
- 80 మెగావాట్లు ఉత్పత్తిని చేయాలని నిర్ణయం
- రెడ్కోతో కలిసి కార్యాచరణకు సిద్ధం
- అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్సిటీ, వెలుగు: మహానగర తాగునీటి అవసరాలు తీరుస్తున్న మెట్రో వాటర్ బోర్డుకు విద్యుత్ చార్జీలే ప్రధాన భారంగా మారింది. నెలకు కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులకే ఖర్చు అవుతుండడంతో సొంతంగా ‘సోలార్ ఎనర్జీ’ని ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లో బోర్డుకు ఉన్న ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, ఎస్టీపీలు, డిస్ట్రిబ్యూషన్సెంటర్ల ప్రాంగణాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయనుంది.
ఇందుకు తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ రెడ్కో)తో కలిసి యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అవసరమైతే మరికొన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలనూ భాగస్వాములను చేసుకోవాలని నిర్ణయించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక కూడా సిద్ధమైందని మరో రెండు మూడు నెలల్లోనే ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
రాబోయే రోజుల్లో మరింత విద్యుత్ వినియోగం
ప్రస్తుతం కృష్ణా మూడు దశల్లోనూ, గోదావరి ప్రాజెక్టు, సింగూరు, మంజీరా వంటి జలాశయాల నుంచి నీటిని పంపింగ్ ద్వారా నగరానికి వాటర్ బోర్డు తీసుకువస్తున్నది. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటిని సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కోసం పెద్దమొత్తంలో విద్యుత్ వినియోగం అవుతోంది. రాబోయే రోజుల్లో మరికొన్ని కీలక ప్రాజెక్టులు రాబోతున్నాయి.
దీంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగనుంది. ఏడాది క్రితమే 32 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొన్ని కారణాల వల్ల అది ముందుకు సాగలేదని అధికారులు తెలిపారు. అయితే, తాజాగా రూపొందించిన ప్రణాళికతో పాటు, కొన్ని ఆర్థిక సంస్థలు కూడా రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండడంతో ప్రాజెక్టును చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక
వాటర్బోర్డు అధికారులు సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఒక్కో మెగావాట్ ఉత్పత్తికి 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా. ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఏడాదికి రూ.40 కోట్లు ఆదా చేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాటర్ బోర్డుకు డిస్కంల నుంచి కనెక్టెడ్ లోడ్ నెలకు 300 మెగావాట్ల వరకు ఉంది. ఇందులో నెలకు 210 మెగావాట్లను బోర్డు వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో నెలకు దాదాపు 120 కోట్ల వరకు బిల్లులు వస్తున్నట్టు అధికారులు తెలిపారు.
బోర్డు వినియోగ దారుల నుంచి వసూలు చేసే నీటి చార్జీల ద్వారా నెలకు 110 కోట్ల ఆదాయమే వస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో వస్తున్న ఆదాయానికి విద్యుత్ ఛార్జీలకు పొంతన ఉండడం లేదు. దీంతో ప్రస్తుతం వాటర్ బోర్డుపై రూ.5,600 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే ఏడాదికి కనీసం 40 నుంచి 50 కోట్ల వరకు భారం తప్పుతుందని అధికారుల
అంచనా.