ప్రాజెక్టుల పర్మిషన్లలో బోర్డులే కీలకం

  • అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి తప్పనిసరి
  • తేల్చి చెప్పిన సీడబ్ల్యూసీ

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు ఇవ్వడంలో కృష్ణా, గోదావరి రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డులే కీలకమని సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు ఇచ్చే విధానంపై శనివారం ఫ్లో చార్ట్‌‌ రిలీజ్‌‌ చేసింది. దీనిని కృష్ణా, గోదావరి బోర్డులు, తెలంగాణ, ఏపీ ఇంజనీర్‌‌ ఇన్‌‌ చీఫ్‌‌లకు పంపింది. గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న 6 ప్రాజెక్టులకు అనుమతి విషయంలో జీఆర్‌‌ఎంబీ తీరుపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ నుంచి వచ్చిన తాజా మార్గదర్శకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రాజెక్టుల పర్మిషన్‌‌లకు బోర్డుల అప్రైజల్‌‌తో పాటు అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి తప్పనిసరి అయింది.

బోర్డుల నిర్ణయానికి మరింత ప్రాధాన్యం
తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) లిఫ్ట్‌‌, తుపాకులగూడెం బ్యారేజీ, మోడికుంట వాగు, చనకా–కొరాటా బ్యారేజీ, చౌట్‌‌పల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌‌ స్కీంలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వాటి డీపీఆర్‌‌లను గోదావరి బోర్డుకు సమర్పించింది. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌‌లలో సమగ్ర వివరాలు లేవని జీఆర్‌‌ఎంబీ కొర్రీలు పెట్టింది. దీనిపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తూ..  ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు ఇవ్వడానికి సీడబ్ల్యూసీలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని, వెంటనే డీపీఆర్‌‌లు సీడబ్ల్యూసీకి పంపాలని కోరింది. బోర్డు అధికారాలపై ఫుల్‌‌ బోర్డు మీటింగులోనే స్పష్టతనిస్తామని జీఆర్‌‌ఎంబీ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు ఇవ్వడంలో బోర్డులను కీలకం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్మిషన్‌‌లు ఇచ్చే విధానం ఇది..
ఒక ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడానికి సీడబ్ల్యూసీకి డీపీఆర్‌‌ సమర్పించాల్సి ఉంటుంది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ, ఇరిగేషన్‌‌ ప్లానింగ్‌‌, ఇంటర్‌‌ స్టేట్‌‌ ఇష్యూస్‌‌, కాస్ట్‌‌, కాస్ట్‌‌ ఎకనామిక్స్‌‌, డిజైన్స్‌‌ తదితర డైరెక్టరేట్లు వాటిని పరిశీలించి, ఇంకా ఏమైన వివరాలు అవసరమైతే ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతాయి. ఈ డైరెక్టరేట్ల నుంచి క్లియరెన్స్‌‌ వచ్చిన తర్వాత బోర్డు ఆమోదం కోసం పంపుతారు. అక్కడి నుంచి టెక్నికల్‌‌ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) అనుమతికి పంపి, క్లియరెన్స్‌‌ తర్వాత అపెక్స్‌‌ కౌన్సిల్‌‌కు రికమండ్‌‌ చేస్తారు. అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో ఇరు రాష్ట్రాల సీఎంల ఆమోదం తర్వాత ఆయా ప్రాజెక్టులకు క్లియరెన్స్‌‌ వస్తుంది. ఆయా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డులో రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌‌ సెక్రటరీలు, ఈఎన్సీలు మెంబర్లుగా ఉంటారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన గల అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులు. సీడబ్ల్యూసీ తాజా మార్గదర్శకాల నేపథ్యంలో మన ప్రాజెక్టులకు పర్మిషన్‌‌లు తెచ్చుకోవాలన్నా ఏపీ ఆమోదం తప్పనిసరి కానుంది.