బోటెక్కితే జేబు గుల్లే..సోమశిలలో అడ్డగోలుగా చార్జీలు

బోటెక్కితే జేబు గుల్లే..సోమశిలలో అడ్డగోలుగా చార్జీలు
  • గతం కంటే మూడింతలు ఎక్కువ
  • లైఫ్ జాకెట్లు, బోటు కెపాసిటీ నిబంధనలకు పాతర
  • ఆందోళనలో సంగమేశ్వరం పర్యాటకులు, ప్రయాణికులు
  • చోద్యం చూస్తున్న అధికారులు

అడిగేవారు లేకపోవడంతో సోమశిల ఘాట్​బోట్ల నిర్వాహకులదే ఇష్టారాజ్యమైంది. పర్యాటకుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు.  గతేడాదితో పోలిస్తే రెండు, మూడు నెలల్లో చార్జీలు మూడింతలు పెరిగాయి.  ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

కొల్లాపూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల..- ఏపీలోని నంద్యాల జిల్లా సిద్దేశ్వరం మధ్య ఉన్న కృష్ణానదిని ఇరు రాష్ట్రాలకు చెందిన ఘాట్ బోట్ల నిర్వాహకులు ఒప్పందం చేసుకుని దాటిస్తుంటారు. ఏపీలో ఎలాంటి వేలం లేనప్పటికీ సోమశిలలో ఏటా ఉగాదికి వేలం వేసుకొని బోట్ల నిర్వహణ చేస్తున్నారు. రూ.30 వేల నుంచి మొదలైన ఈ వేలం రెండేండ్ల కిందట ఏకంగా రూ.60 లక్షలు పలికింది. తెలంగాణకు చెందిన 16 బోట్లలో కొంతమందికి లైసెన్స్ ఉండగా, ఏపీలోని సిద్దేశ్వరం, సంగమేశ్వరం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులకు ఇవేమీ లేవు. అయినా ఇరువురు పరస్పర సహకారంతో బోట్లు తిప్పుకునేవారు. 

ఇష్టం వచ్చిన రేట్లు..

సోమశిలకు చెందిన ఘాట్ బోట్ నిర్వాహకులు నది దాటిస్తే గతంలో ఒక్కో వ్యక్తికి రూ.40, బైక్​కు రూ.60 తీసుకుంటే.. ఇప్పుడు  రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ, కర్నాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఏపీలో ఏడు నదులు కలిసే సంగమ తీరంతో పాటు ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడికి హైదరాబాద్​తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. వారి వద్ద నుంచి సంగమేశ్వర క్షేత్రానికి రానుపోను సోమశిల ఘాట్ బోటు నిర్వాహకులు ఒక్కో వ్యక్తి నుంచి రూ.200లు వసూలు చేసేవారు. అందులో రూ.30 సంగమేశ్వర ఘాట్ బోట్ నిర్వాహకులకు ఇచ్చేవారు.

ఇప్పుడిదీ రూ.400కు చేరింది. అలాగే ఐ ల్యాండ్ కు తీసుకెళ్తే రూ.5–6 వేలు, అమరగిరికి రూ.6 – 8 వేలు తీసుకుంటే.. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.8 – 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, కొందరి స్వార్థం కారణంగా ఏడాదికి పైగా ఘాట్ బోట్లను సంగమేశ్వరం ప్రాంతంలో తిప్పేందుకు అనుమతివ్వలేదు. ఒకవేళ పర్యాటకుల కోసం వెళ్తే ఏపీకి చెందిన పోలీసులు బోట్లను పట్టుకుని సీజ్ చేసిన సందర్భాలున్నాయి. దాదాపు రెండు నెలల నుంచి బోట్లు తిప్పుకునేందుకు పోలీసులు అనుమతులివ్వడంతో.. సోమశిల ఘాట్ బోట్ల నిర్వాహకులతో పాటు సిద్దేశ్వరం ఘాట్ బోట్ల నిర్వాహకులు ఇలా చార్జీలు పెంచి మరీ వసూలు చేస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు!

ఘాట్ బోట్ల ద్వారా ఏడాదికి రూ.కోట్లలో ఆదాయం వస్తుండడంతో నిర్వాహకులు అందులో కొంత డబ్బు అధికారులకు ముట్టజెప్పడం ఆనవాయితీగా మారింది. అంతేకాకుండా వారం వారం పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు పార్టీలు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల తాము ఎలా తిరిగినా, ఏం చేసినా ఎవరూ ఏమీ అనకుండా ఉంటారని పలువురు చెప్పడం కొసమెరుపు. ఇక ఆయా శాఖల అధికారులు కుటుంబాలతో వచ్చినా, స్నేహితులతో వచ్చినా వారి నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరు.

గత బీఆర్ఎస్ హయాంలో ఘాట్ బోటు నిర్వాహకులు తెలంగాణకు చెందిన మద్యాన్ని ఏపీకి సరఫరా చేసి మరింత ఆదాయం పొందిన సందర్భాలు లేకపోలేదు. ఇక లైఫ్​జాకెట్ వంటి ప్రభుత్వ నిబంధనలు దేవుడెరుగు.  ఇప్పటికైనా రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గతంలో మాదిరి చార్జీలు వసూలు చేయాలని పర్యాటకులు, స్థానిక ప్రయాణికులు కోరుతున్నారు.

టూరిజం శాఖ ఆధ్వర్యంలో బోట్లు తిప్పాలే..

సెలవు దినం కావడంతో సంగమేశ్వర ఆలయం, కృష్ణా నది అందాలను చూసేందుకు హైదరాబాద్​ నుంచి స్నేహితులతో కలిసి వచ్చా. ఘాట్ బోట్లలో ఇక్కడ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. లైఫ్​ జాకెట్లు లేవు. పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా తక్కువ చార్జీలతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం బోట్లు తిప్పితే బాగుంటుంది. పర్యాటకులపై భారం తగ్గి  ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని సౌలత్​లు కూడా కల్పించాలి.

- డాక్టర్ మురళి, హైదరాబాద్ పర్యాటకుడు