![పడవ లైబ్రరీ భలేగుంది](https://static.v6velugu.com/uploads/2022/06/Boat-library-for-children-in-Odisha’s-Bhitarkanika-National-Forest_nSbYhlz5Nr.jpg)
పడవ ఎక్కి చెరువులో షికారు చేయడం అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా చాలా ఇష్టం. ఈ పడవ ఎక్కితే నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు. అవును ఇదొక పడవ లైబ్రరీ. ప్రకృతి, జంతువులు, పక్షులకి సంబంధించిన పుస్తకాలు బోలెడు ఉంటాయి ఇందులో. ఒడిశా దంగమల్లోని ఎకో–టూరిజం కాంప్లెక్స్‌లో ఉంది ఈ బోట్ లైబ్రరీ. భీతర్కనికా నేషనల్ ఫారెస్ట్‌కి సమీపంలో ఏర్పాటు చేసిన లైబ్రరీ వెనక పర్యావరణ పరిరక్షణ గురించి పిల్లలకు చెప్పాలనే ఉద్దేశం ఉంది.
ఈ నెల 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పడవ లైబ్రరీని ఏర్పాటు చేశారు అధికారులు. అంతేకాదు ఇలాంటి లైబ్రరీ మనదేశంలోనే మొదటిది. పడవలో కూర్చొని రకరకాల పుస్తకాలు చదివేందుకు పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లని కూడా ఈ లైబ్రరీలోకి అనుమతిస్తున్నారు.
పాత పడవకి రంగులు వేసి..
ఖాళీగా ఉన్న పాత పడవలో లైబ్రరీ పెట్టాలి అనుకున్నారు భీతర్కనికా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జె.డి.పాటి. పాత పడవకు రంగులు వేసి, లోపల 32 అరలు ఏర్పాటు చేశారు. లైట్లు పెట్టారు. ఈ లైబ్రరీలో దాదాపు1,500 పుస్తకాలు ఉన్నాయి. ఒడిశా, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అన్ని వయసుల పిల్లలకు నచ్చిన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. కింది అరల్లో మూడు నుంచి ఐదేండ్ల పిల్లల కోసం బొమ్మల పుస్తకాలు ఉంటాయి. ఐదు నుంచి పదేండ్ల వయసు పిల్లలు ఇష్టపడే జానపద కథలు, చిన్న కథలు, మహనీయుల జీవితచరిత్ర పుస్తకాలు ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా, అట్లాస్, సైన్స్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పుస్తకాల్ని పదిహేనేండ్ల పిల్లలకు ఇస్తారు. ఈ అడవిలో ఉప్పు నీటి మొసళ్లను చూసేందుకు వచ్చేవాళ్ల పిల్లలతో పాటు చుట్టుపక్కల ఊళ్లలోని స్కూలు పిల్లల్ని అనుమతిస్తున్నారు.
ప్రకృతిని కాపాడడం కోసం..
‘‘చిన్న వయసు నుంచే పిల్లలకు చెట్లు, పక్షులు, జంతువుల పట్ల ప్రేమగా మెలగడం అలవాటు చేయడం, వాటిని కాపాడేలా చేయడమే ఈ లైబ్రరీ ఉద్దేశం. డొనేషన్స్ వస్తే మరిన్ని పుస్తకాలు తెప్పించాలని అనుకుంటున్నాం. స్కూల్ పిల్లలకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాలనే ఆలోచన కూడా ఉంది” అని చెప్తున్నాడు పాటి.