మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదిలో బోటింగ్, టూరిజం డెవలప్మెంట్ మాటలకే పరిమితమైంది. లక్సెట్టిపేటలో నాలుగు నెలల కిందట ఒక స్పీడ్ బోట్‌ను ప్రారంభించినా అది మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనం, నిధుల కొరత వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఆహ్లాదం కరువైంది. హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి సరదా గడుపుదామనుకుంటే ఆ చాన్స్ లేకుండా పోయింది.
'జలకళ'లాడుతున్న గోదావరి...
గోదావరి నది జిల్లాలోని జన్నారం నుంచి కోటపల్లి మండలం వరకు 120 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీల్లో నిండా నీళ్లతో అన్ని కాలాల్లోనూ 'జలకళ'లాడుతోంది. దీంతో గోదావరిలో బోటింగ్ ఏర్పాటుకు అవకాశాలున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. గతంలో ఇటు లక్సెట్టిపేట నుంచి అటు కోటిలింగాల వరకు, గూడెం గోదావరి బ్రిడ్జి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. స్పీడ్ బోట్లు, పెద్ద బోట్లు ఏర్పాటు చేసి పాపికొండల తరహాలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఏండ్లు గడుస్తున్నా ప్రజలకు ఎదురుచూపులే మిగిలాయి.
శివ్వారం మొసళ్ల మడుగులో...
జైపూర్ మండలం శివ్వారం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో మొసళ్ల సంరక్షణ కేంద్రం ఉంది. దీనిని ఎల్ మడుగు అని కూడా పిలుస్తారు. గోదావరిలో సహజసిద్ధంగా ఏర్పడింది. మంచిర్యాల నుంచి 43కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో పట్టుకున్న మొసళ్లను తీసుకొచ్చి ఈ మడుగులో విదిలేస్తారు. అటవీశాఖ ఆధ్వర్యంలో బోటింగ్, వాచ్ టవర్ ఏర్పాటు చేశారు. అన్నారం బ్యారేజీ నిర్మాణంతో గోదావరిలో నిండా నీళ్లు ఉండడం వల్ల ఎల్ మడుగు రూపురేఖలు కోల్పోయింది. టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బోటింగ్ ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నిత్యం సందర్శకులతో కళకళలాడే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే శాపంగా మారింది.
'ఎల్లంపల్లి' ఎంతో అనుకూలం...
గోదావరి నదిలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు లక్సెట్టిపేట వద్ద బోటింగ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఈ రెండు చోట్ల బోటింగ్‌ను ప్రారంభిస్తే మంచిర్యాల, లక్సెట్టిపేట సహా జిల్లాలోని ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రజలకు ఆహ్లాదం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల ప్రజలు నిత్యం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసినప్పుడు అధిక సంఖ్యలో తరలివచ్చి గోదావరి అందాలను ఆస్వాదిస్తున్నారు. అయితే ఇక్కడ బోటింగ్ లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలాగే ప్రాజెక్టు దిగువన గతంలో ఏర్పాటు చేసిన పార్క్ నామరూపాలు లేకుండా పోయింది. ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పార్క్‌ను డెవలప్ చేస్తే ప్రజలు రోజంతా ఆహ్లాదంగా గడపడానికి అవకాశం ఉంటుంది.
లక్సెట్టిపేట-కోటిలింగాల మధ్య..
గోదావరికి అటువైపు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిలింగాల, ఇటువైపు లక్సెట్టిపేట పట్టణం ఉంటుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు లక్సెట్టిపేట, రాయపట్నం మీదుగా వెళ్లి కోటిలింగాల ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇలా రోడ్డు మార్గంలో వెళ్తే 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే గోదావరి మీదుగా బోట్లలో కేవలం కిలోమీటరు ప్రయాణిస్తే కోటిలింగాలకు చేరుకోవచ్చు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య బోటింగ్ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పలుమార్లు చెప్పినప్పటికీ అది నెరవేరలేదు. నిరుడు ఆగస్టులో ఒక స్పీడ్ బోట్‌ను ప్రారంభించి వదిలేశారు. లక్సెట్టిపేట గోదావరి ఒడ్డున ఫ్లాట్‌ఫామ్ నిర్మిస్తామని, మరో రెండు బోట్లను ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టు భూమిని సేకరించి పార్క్‌ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అంతకుముందు తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పుల శ్రీనివాస్‌గుప్తా ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు పలు ప్రాంతాలను సందర్శించి టూరిజం డెవలప్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అతీగతీ లేకపోవడం గమనార్హం.