- పత్తాలేని టూరిజం బోట్లు.. బోసి పోయిన రిజర్వాయర్లు
నాగర్‌కర్నూల్, వెలుగు : ప్రకృతి అందాలు, కృష్ణా నది తీర ప్రాంతాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటింగ్ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ఎకో టూరిజం, జంగిల్ టూరిజం, రివర్ టూరిజంపై ఆసక్తి ఉన్న పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్బాటంగా ప్రారంభించారు. సోమశిల వద్ద కృష్ణా నదిలో, సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీవారి జలాశయంలో టూరిజం అధికారులు బోట్లను ఏర్పాటు చేశారు.
అయితే బోట్లకు కట్టిన పూలు వాడకముందే మరోచోట ప్రారంభోత్సవం ఉందని బోట్లను ఇక్కడి నుంచి తరలించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మధ్యలో ట్యాంక్‌బండ్ తరహాలో బుద్ద విగ్రహం, లైటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి టూరిజం కార్పోరేషన్ బోట్ ఏర్పాటు చేసి చెరువులో చక్కర్లు కొట్టారు. ఆ తరువాత కేసరి సముద్రం చెరువులో లైట్లు వెలగలేదు. బోట్ కనిపించలేదు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.
అంతా ఉత్తుత్తిదే..
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి టూరిజం శాఖను నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల, అమరగిరి, సింగోటం, కేసరి సముద్రం చెరువులో బోటింగ్ ప్రారంభించారు. అదే ఊపులో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలోని గుడిపల్లిగట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో నిర్మాణంలో ఉన్న కోయిల్‌సాగర్, సరళా సాగర్, శంకర సముద్రం, శ్రీరంగాపూర్ తదితర నోటిఫైట్(ట్యాంకులు) రిజర్వాయర్లలో బోటింగ్ అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఇక మూడేండ్ల కింద సోమశిల వద్ద బోటింగ్‌ను అప్పటి టూరిజం మంత్రి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
లింగాల గట్టు వద్ద బోటింగ్ ప్రారంభానికి సినీ నటుడు తనికెళ్ల భరణిని ఆహ్వానించారు. సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్ కట్టను ట్యాంక్‌బండ్‌గా మార్చి కాటేజీలు నిర్మించారు. ఇక్కడ బోటింగ్ ప్రారంభించారు. మంత్రి ప్రారంభించిన వారం రోజుల పాటు వాటిని నడిపించిన టూరిజం ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ బోటింగ్ ప్రారంభం ఉన్నా వీటినే అటు ఇటు తిప్పి చేతులు దులుపుకున్నారు.
చివరికి సరైన నిర్వహణ, ఆపరేటర్లు లేక బోట్లను హుస్సేన్ సాగర్‌కు తరలించినట్లు సమాచారం. మంచాలకట్ట, మల్లేశ్వరం ఐలాండ్ వరకు బోటింగ్‌కు విపరీతమైన క్రేజీ ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నోటిఫైడ్ ట్యాంకులు, రిజర్వాయర్లు, ట్యాంక్బండ్ల వద్ద బోటింగ్, టూరిజం డెవల్ప్మెంట్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో లోకల్‌గా ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని అంటున్నారు.
పర్యాటకులకు తప్పని తిప్పలు
కృష్ణా తీరాన కొండల నడుమ ఉన్న సోమశిల, అమరగిరి ప్రాంతాలు పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకుపోతాయి. సోమశిలలో టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన లాంచీని శ్రీశైలం వరకు తిప్పుతామని ప్రకటించారు. ప్రస్తుతానికి నదిలో ఓ రౌండ్ వేయడానికే పరిమితం చేశారు. ఇక్కడ అదనంగా కాటేజీలు నిర్మించి రివర్ బోటింగ్ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించినట్లవుతుంది. పర్యాటకులు ప్రైవేట్ బోట్లలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొండల నడుమ సుడులు తిరిగే కృష్ణా బ్యాక్‌వాటర్‌తో అమరగిరి పర్యాటకులను ఆకర్షిస్తోంది. కొల్లాపూర్ నుంచి అమరగిరి వెళ్లే రోడ్డు వర్షాలకు పూర్తిగా ధ్వంసం కావడంతో టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. అమరగిరి నుంచి సోమశిల వరకు, శ్రీశైలం ప్రాజెక్ట్ వైపు బోటింగ్‌కు అవకాశాలున్నా పట్టించుకోవడం లేదు. సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్‌లో గతంలో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తే నాగర్ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి ప్రాంతాల నుంచి టూరిస్టులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.