
హైదరాబాద్ : అబిడ్స్ పోలీస్ స్టేషన్ ముందు బొడపాటి శేజల్ మరోసారి బైఠాయించి ఆందోళన నిర్వహించింది. మంచిర్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అబిడ్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసినా... పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ నిరసన తెలిపింది. ఎమ్మెల్యే చిన్నయ్యపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని గత కొద్దిరోజులుగా శేజల్ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
తనకు న్యాయం చేస్తామని చెప్పిన తెలంగాణ పోలీసు అధికారులు గత మూడు రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించింది శేజల్. కనీసం తన ఫిర్యాదును స్వీకరించకుండా కాలయాపన చేస్తూ...ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదని ఆరోపించింది. సరైన రుజువులు కావాలని, పై అధికారులను సంప్రదించిన తర్వాతే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారని వాపోయింది శేజల్. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన అనుచరులతో.. 72 గంటలుగా తనను, తన కుటుంబ సభ్యులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ.. బెదిరిస్తున్నారని ఆరోపించింది.
తనకు న్యాయం జరగదని తెలిసే ఆత్మహత్యాయత్నం చేశానని, ఆస్పత్రికి తీసుకెళ్లి మళ్లీ తనను బతికించి ఇబ్బంది పెడుతున్నారంటూ కన్నీటి పర్యంతమైంది. తనకు న్యాయం జరిగేలా చూడాలని లేకపోతే తనకు చావే శరణ్యం అని శేజల్ వేడుకుంది.
మరోవైపు.. మహిళా పోలీస్ స్టేషన్ కు రమ్మంటే రానంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించింది. తనకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపనంటూ నినాదాలు చేసింది. చివరకు మహిళా పోలీసులతో ఖైరతాబాద్ సీఐ ప్రసాద్..శేజల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. బలవంతంగా మహిళా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. శేజల్ తో పాటు ఆదినారాయణ అనే వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. గతంలో ఆదినారాయణపై గుడివాడలో 2013లో చైన్ స్నాచింగ్ కేసు ఉందని ఖైరతాబాద్ సీఐ ప్రసాద్ తెలిపారు.