- ఇప్పటికే రెండుసార్లు సర్వే
- పనులు షురూ చేయకుండా తాజాగా మరో సర్వేకునిధుల కేటాయింపు
- కొత్తగా తెరపైకి బోధన్– లాతూర్ లైన్
నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ప్రతీసారి జిల్లాలో బోధన్– బీదర్ రైల్వే లైన్ ప్రస్తావన వస్తుంది. ఈ లైన్‌నిర్మాణానికి గడిచిన 15 ఏండ్లలో రెండుసార్లు సర్వే చేయించారు. పనులు చేపట్టేందుకు ఇప్పటివరకు సెంట్రల్ గవర్నమెంట్నయా పైసా ఫండ్ కేటాయించలేదు. తాజాగా ముచ్చటగా మూడోసారి సర్వే పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సాగదీతతో నెట్టుకొస్తూ..
బోధన్, నారాయణ్‌ఖేడ్, బీదర్లైన్తో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల ప్రజలకు రవాణా సదుపాయం మెరుగవుతోంది. అటు కర్నాటకతోనూ రవాణా, వ్యాపార సంబంధాలు బలపడతాయి. కర్నాటకలోని కొన్ని ప్రాంతాలు అప్పటి హైదరాబాద్ రాజ్యంలో ఉండడంతో బోధన్ నుంచి బీదర్‌వరకు రైల్వే లైన్ వేయాలని నిజాం నవాబు కాలం నుంచే ప్రతిపాదనలున్నాయి.
.దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ అంశానికి 2009లో మొదటిసారి కదలిక వచ్చింది. అప్పటి రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ ఈ లైన్‌సర్వే కోసం రూ.50 లక్షలు కేటాయించారు. 2012లో మొదటి సర్వే పూర్తైంది. పనులు షురువవుతాయని అంతా భావించగా, బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్వచ్చాక 2015లో మరోసారి సర్వే చేయించారు.
కొత్తగా నిర్మించబోయే ఈ రైల్వే మార్గంలో నదులు, వంతెనలు, కొండలు, గుట్టలు, ఫారెస్ట్ తదితర విషయాలపై క్లారిటీ తీసుకున్నారు. 114 కిలోమీటర్ల దూరంలో వేసే ఈ లైన్ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవని అప్పటి సర్వే తేల్చిచెప్పింది. రెండో సర్వే తర్వాత కూడా పనులు స్టార్ట్ చేసేందుకు నిధులు ఇవ్వలేదు. ప్రస్తుతం మరోసారి సర్వే పేరుతో రూ.2.85 కోట్లు మంజూరు చేస్తూ ఈనెల 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటికే రెండుసార్లు చేసిన సర్వే నివేదికలు దగ్గర ఉన్నా మూడో సర్వేకు పురమాయించారు.
వ్యయం అంచనాలో పెరుగుదల
మొదటి సర్వే తర్వాత 2014లో రైల్వే లైన్ నిర్మాణానికి రూ.1,029 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, 2018కి వచ్చేసరికి వ్యయం రూ.2 వేల కోట్లకు పెరిగింది. ఒకే లైన్‌కు ఏండ్ల తరబడి సర్వేలు చేయిస్తూ, పనులు ఆలస్యం చేస్తున్నారు. తాజాగా నిర్వహించే సర్వే అంచనా వ్యయాన్ని మరింత
పెరుగుతుంది. కేవలం సాగదీతకే ఇవన్నీ చేస్తున్నారనే భావన ప్రజల్లో నెలకొంది. ఈ లైన్ వేస్తే తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి, ఖేడ్, సంగారెడ్డి ప్రాంతాలు మరింత వృద్ధిలోకి వస్తాయి. ఎరువులు, బియ్యం ఎగుమతి, దిగుమతులు కూడా సులభమవుతాయి.
కొత్తగా లాతూర్– బోధన్ లైన్
బోధన్– బీదర్‌తో పాటు బోధన్ నుంచి మహారాష్ట్రలోని లాతూర్కు రైల్వే సౌకర్యం కల్పించేందుకు తాజాగా సర్వే చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. 135 కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ వేసేందుకు రూ.2,430 కోట్ల ఖర్చవుతుందనే ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం వద్ద ఉన్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా కోసం ఈ లైన్ నిర్మించాలని యోచిస్తున్నారు.
నార్త్ ఇండియాకే ప్రాధాన్యం
సౌత్ సెంట్రల్ రైల్వే ఆదాయం ఆర్జించడంలో ఐదో స్థానంలో ఉన్నా, నిధుల కేటాయింపులో మాత్రం చివరి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ నార్త్ఇండియాలో రైల్వే విస్తరణకే అధిక నిధులు కేటాయిస్తోంది. జిల్లాలో రైలు సేవల విస్తరణకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రెండేండ్ల కింద స్టూడెంట్ జేఏసీని ఏర్పాటు చేశాం. ఆందోళనలు నిర్వహించడంతో పాటు ఆఫీసర్లకు వినతిపత్రాలు ఇస్తున్నాం. బోధన్– బీదర్లైన్ నిర్మాణాన్ని అదిగో ఇదిగో అంటూ మూలన పడేశారు.
– శివకుమార్, స్టూడెంట్ జేఏసీ లీడర్