అసదుద్దీన్..​ వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం : బోధన్​ ఎమ్మెల్యే షకీల్

  • మజ్లిస్ ​అధినేతకు బోధన్​ ఎమ్మెల్యే సవాల్​
  • ఏడాది నుంచి తన మర్డర్​కు ప్లాన్​ వేస్తున్నారన్న షకీల్​

బోధన్/ నిజామాబాద్, వెలుగు: మజ్లిస్​అధినేత అసదుద్దీన్​ఒవైసీ బెదిరింపులకు భయపడనని బోధన్​ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన భవిష్యత్తు తేలుస్తానని ఆయన చెప్పడాన్ని సవాల్​గా స్వీకరిస్తున్నానన్నారు. బ్లాక్​మెయిల్​కు భయపడేవాడిని కాదన్నారు. ఈ మేరకు శుక్రవారం షకీల్ ​ఓ వీడియో రిలీజ్​ చేశారు. వెన్నుపోట్లు వద్దని నేరుగా, ఢీకొందామని అసదుద్దీన్​కు సూచించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్​ చేసే వారిని ప్రజాబలంతో ఎదుర్కొంటానన్నారు. బీఆర్​ఎస్ ​ కౌన్సిలర్​ శరత్​రెడ్డి నాయకత్వంలో ఏడాది నుంచి తన మర్డర్​కు ప్లాన్​జరుగుతోందన్నారు. అందులో భాగంగా మొన్నటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలప్పుడు నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలోనూ హత్యాయత్నం జరిగిందన్నారు. పోలీసులు ఉండడంతో వారికి ధైర్యం సరిపోలేదన్నారు.

ఉగ్రవాదులతో సంబంధాలు​

జ్యుడీషియల్​ రిమాండ్​లో ఉన్న ఇద్దరు మజ్లిస్​ లీడర్లు నవీద్, అల్తాఫ్​పై ఇప్పటికే పది చొప్పున కేసులు ఉన్నాయని ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. వారికి ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నాయన్నారు. కౌన్సిలర్​ శరత్​రెడ్డి ఇచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం మరో లీడర్ ​షరీఫొద్దీన్​తో కలిసి తనను చంపే కుట్ర చేశారన్నారు. బక్రీద్ ​రోజు ఈద్గా వద్ద అబ్దుల్​బాకీ ఏడుస్తూ పెద్ద నాటకం చేశారన్నారు. ఆయన కొడుకు అల్తాఫ్​ను తాను జైల్లో పెట్టించానని ఏడవడం విచిత్రంగా ఉందన్నారు. దీని వెనుక కూడా తనను రాజకీయంగా నష్టపర్చాలనే కుట్ర దాగి ఉందన్నారు. ఇప్పటి వరకు అల్తాఫ్​పై పదికి మించి కేసులున్నాయని, దానిపై ఆయన సమాధానం చెప్పాలన్నారు. అబ్దుల్​బాకీపై కూడా 2001–02 ప్రాంతంలో పోలీసులు రౌడీషీట్​నమోదు చేశారన్నారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్​మీర్​ నజీర్ ​అలీ మోసగాడనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించానన్నారు. తనను చంపే కుట్రలో భాగం పంచుకొని పరారైన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసి పీడీ యాక్ట్​కింద జైలుకు పంపాలని డిమాండ్​ చేశారు.