బోర్డర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని కమెంగ్ సెక్టార్ లో ఏడుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 14,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఆదివారం సైనికులు పెట్రోలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంచు కొండలు విరిగిపడ్డాయి. దీంతో వాటి కింద చిక్కుకుపోయిన సైనికులను కాపాడేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. తీవ్రమైన హిమపాతం కొనసాగుతున్నా సరే.. ఆ ప్రతికూల వాతావరణంలోనూ సహాయ చర్యలను చేపట్టినప్పటికీ లాభం లేకపోయిందని ఆర్మీ తెలిపింది. ప్రాణాలతో సైనికులను కాపాడలేకపోయామని, చివరికి అమరులైన ఏడుగురు సైనికుల మృతదేహాలను ఘటనా స్థలం నుంచి వెలికి తీశామని ఇవాళ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫార్మాలిటీలను పూర్తి చేసి.. మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపింది.
ప్రధాని మోడీ సంతాపం
ఈ ఘటనలో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచు కొండలు విరిగిపడి.. ఏడుగురు భారత సైనికులు మరణించడం తనను ఎంతో బాధించిందని అన్నారు. ఈ వీర సైనికులు మన దేశానికి అందించిన అసాధారణ సేవలను ఎప్పటికీ మరువలేమని ప్రధాని ట్వీట్ చేశారు.
PM Narendra Modi condoles the demise of Indian Army personnel who lost their lives due to an avalanche in Arunachal Pradesh.
— ANI (@ANI) February 8, 2022
"We will never forget their exemplary service to our nation. Condolences to the bereaved families," he tweets pic.twitter.com/pDGDe06ccN