శంషాబాద్‎లో ఉద్విగ్న వాతావరణం: దుబాయ్‎లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలు రాక

శంషాబాద్‎లో ఉద్విగ్న వాతావరణం: దుబాయ్‎లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలు రాక

హైదరాబాద్: దుబాయ్‎లో హత్యకు గురైన తెలంగాణకు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతదేహాలు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్టులో మృతదేహాలను ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాస్, నంగీ దేవేందర్ రెడ్డి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విమానాశ్రయ అధికారులు ఫార్మాలిటిస్ పూర్తి చేశారు. తర్వాత ఎయిర్పోర్ట్ కార్గో అధికారులు కుటుంబ సభ్యులకు మృతదేహాల అప్పగించారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండు అంబులెన్సులలో డెడ్ బాడీలను మృతుల స్వస్థలాలకు తరలించారు.

కాగా, జగిత్యాల జిల్లా ధర్మపరి మండల్ ధమ్మన్నపేట్ గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్, నిర్మల్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. దుబాయ్‎లో ఓ బేకరిలో ఇద్దరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం జరిగిన ఒక గొడవలో పాకిస్తాన్‎కి చెందిన తోటి ఉద్యోగి చేతిలో శ్రీనివాస్, ప్రేమ సాగర్ హత్యకు గురయ్యారు. పాకిస్తానీయుడి శ్రీనివాస్, ప్రేమ సాగర్‎ను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. 

సమాచారం అందుకున్న భారత విదేశాంగ శాఖ అక్కడి అధికారులతో మాట్లాడి శ్రీనివాస్, ప్రేమ సాగర్‎ల మృతదేహాలను స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్ 19) మృతదేహాలను దుబాయ్ నుంచి శంషాబాద్‎కు తరలించారు. అక్కడి నుంచి డెడ్ బాడీలను మృతుల స్వస్థలాలకు తరలించనున్నారు. ఎయిర్ పోర్టులో మృతదేహాలను చూడగానే మృతుల కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కుటుంబ పోషణ కోసం ఇళ్లు, వాకిలి వదిలి వెళ్లి అక్కడ హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరుగా రోదించారు.