జగిత్యాలలో హాట్ టాపిక్గా మారిన బొడిగె శోభ కామెంట్స్

జగిత్యాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామంలో స్థానిక బీఆర్ఎస్ లీడర్ సింగిల్ విండో చైర్మన్ రాజనర్సింగరావు ఒక వర్గానికి చెందిన సంఘ భవనంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ.. బీఆర్ఎస్ లీడర్ల ముందే సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పట్ల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.. 

తాము కష్టపడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కానీ.. మధ్యలో వచ్చిన వాళ్లు ఉడుముల్లాగా పార్టీలో ప్రవేశించారని శోభ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టారని... ఏ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ.. రాష్ట్రం కోసం కష్టపడ్డ మమ్మల్ని కాపాడుకోండి అని కోరారు.

ఇలా రెండు పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట ప్రచారం నిర్వహించడం ఒకెత్తయితే.. మాజీ ఎమ్మెల్యే శోభ వ్యాఖ్యలపై స్పందించకుండా అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు మౌనం వహించడం కొసమెరుపు.