
జనాలు ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య విషయంలో అయితే పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. కరోనా తరువాత దగ్గినా.. తుమ్మినా.. బాడీ కొద్దిగా వెచ్చగా అనిపిస్తే చాలు..ఆస్పత్రికి క్యూ కడుతున్నాం. ఈ కాలంలో శరీరం ఫిట్ గా లేక హెల్త్ సవాలుగా మారింది. ఏం చేసినా ఫిట్ నెస్ రాకపోవడంతో కొంతమంది వేలకు వేలు ఖర్చు పెట్టి జిమ్ సెంటర్లకు వెళుతున్నారు. జిమ్ వల్ల బాడీకి ఫిట్నెస్ ఏర్పడుతుందో లేదో తెలియదు. అయితే కొన్ని సహజ సూత్రాలైన సూపర్ సిక్స్ ఫార్ములాను పాటిస్తే బాడీ ఫిట్ గా ఉంటుందంటున్నారు నిపుణులు.. ఇప్పుడు మనం ఆ సూపర్ సిక్స్ పాయింట్ల గురించి తెలుసుకుందాం. . .
1. ఉదయం వాకింగ్ అద్భుతం: ప్రతి రోజు సూర్యోదయం సమయంలో 30 నిమిషాలు నడవడం శరీరానికి ఎనర్జీ ని అందిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, శరీరంలోని టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. మనసును ప్రశాంతపరుస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఇది బెస్ట్ స్టార్ట్. వాకింగ్ సమయంలో పచ్చని ప్రదేశాల్లో నడవడం వలన మెదడుకు నూతన తేజాన్ని అందిస్తుంది.
2. నీరు త్రాగడం : రోజు 2నుంచి 3 లీటర్లు తాగడం శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగితే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. ప్రతి గంటకోసారి నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలోని కణజాలాలకు తేమ అందుతుంది.
3. పోషకాల ఆహారం : ప్రాసెస్ చేసిన ఆహారం కన్నా తాజా కూరగాయలు, పండ్లను తినడం అధిక ప్రయోజనాలుంటాయి. వీటిలో పోషక విలువలు ఎక్కువుగా ఉంటాయి. వారానికి 3 సార్లు సూప్స్, సలాడ్స్ తినడం ద్వారా ఫైబర్ పెరుగుతుంది. చక్కెర, ఉప్పు, మైదా వంటి హానికర పదార్థాలు తగ్గించాలి. మితంగా తినే అలవాటుతో పాటు... సమయానికి భోజనం చేయడం అత్యంత ముఖ్యం.
4. యోగా & వ్యాయామం: ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు ప్రాణాయామం చేయడం ద్వారా శరీరానికి, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సూర్యనమస్కారాలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక స్థైర్యాన్ని కలిగిస్తాయి. యోగా ద్వారా జీవన శక్తి పెరుగుతుంది. దీర్ఘ కాలిక వ్యాధులకు ఉపశమనంతో పాటు మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.వ్యాయామం వలన శారీరక కదలికలతో శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. జిమ్, డాన్స్, స్విమ్మింగ్, సైక్లింగ్ – ఏదైనా అలవాటుగా మార్చుకోవాలి. అలసట, నీరసం దూరమవుతుంది. శరీరంలోని మసిల్స్ బలపడతాయి. వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
5. నిద్రకి స్థిరమైన సమయం అవసరం: రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం శరీరాన్ని చక్కగా ఫంక్షన్ చేయించేందుకు ఉపయోగపడుతుంది. రాత్రి 10:00కి నిద్రలోకి వెళ్ళడం మరియు కనీసం 7 గంటల నిద్రపోవడం అవసరం. నిద్ర లోపం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, మానసిక అలసట వస్తాయి. నిద్ర ముందు మొబైల్ దూరంగా పెట్టడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
6. ఆరోగ్యానికి ఆలోచన కూడా ఔషధం: మన ఆలోచనలు కూడా శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల హార్మోన్ల స్థాయి బ్యాలెన్స్ అవుతుంది. డిప్రెషన్ దూరమవుతుంది. ప్రతిరోజూ ఉదయం “నేను ఆరోగ్యంగా ఉన్నాను” అనుకోవడం వల్ల అంతర్గత శక్తి పెరుగుతుంది. స్ట్రెస్ లేని జీవితం ఆరోగ్యానికి బాట.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఖర్చులు అవసరం లేదు – సరైన అలవాట్లు, చిత్తశుద్ధి ఉంటే చాలుని ఈ వ్యాసం ద్వారా మనం గ్రహించవచ్చు. మనం నిత్యం అలవాట్లు మార్చుకుంటూ, చిన్న చిన్న మెరుగులతో జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోగలము.