- రెండ్రోజుల తర్వాత సాగర్ కాల్వలో మృతదేహం లభ్యం
- హత్య అని మృతుడి బంధువుల ఆరోపణ.. ఆందోళన
- ఎంక్వైరీ చేస్తున్న ఖమ్మం రూరల్ పోలీసులు.
ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: ఈనెల 13 తెల్లవారుజామున అదృశ్యమైన ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్పకు చెందిన యువకుడు సంజయ్ కుమార్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సంజయ్ కనిపించకుండా పోయిన రెండో రోజు అతడి మృతదేహం తనికెళ్ల దగ్గర నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో లభించింది. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అందజేశారు. డెడ్ బాడీపై గాయాలున్నాయని, ఎవరో కొట్టి సంజయ్‌ను హత్య చేశారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మృతికి కారకులైనవారిని అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవాలని కరుణగిరి దగ్గర బైపాస్ రోడ్డుపై బుధవారం మధ్యాహ్నం ఆందోళన నిర్వహించారు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు. మృతుడి దగ్గర లభించిన సెల్ ఫోన్ డేటా, ఫోన్ కాల్స్ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుందని అంటున్నారు. హత్యకు గురైనట్టుగా ఇంత వరకు ప్రాథమిక ఆధారాలు లభించలేదని, దర్యాప్తు తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేస్తున్నారు.
ఆ రోజు అసలేం జరిగింది..!
హైదరాబాద్ నుంచి వస్తున్న అన్న సాయిని ఖమ్మం బస్టాండ్ లో రిసీవ్ చేసుకునేందుకు ఈనెల 12న అర్థరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజయ్‌కుమార్, ఆ తర్వాత 1.30 సమయంలో అన్నకు వాయిస్ మెసేజ్ పంపించాడు. ‘దానవాయిగూడెం రైల్వే బ్రిడ్జి సమీపంలో బైక్‌ను ఆటో గుద్దుకుంది. అక్కడ ఓ అమ్మాయిని కొందరు చంపేశారు. నలుగురు నన్ను చంపేస్తున్నారు’ అని వాయిస్ మెసేజ్ చేశాడు. తనను బలవంతంగా ఆటోలో తీసుకెళ్తున్నారని అందులో చెప్పాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
ఆ తర్వాత సంజయ్ ఆచూకీ లేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి గాలిస్తుండగా, ఈనెల 14న సాయంత్రం మృతదేహం లభ్యమైంది. అయితే మృతుడు వాయిస్ మెసేజ్ చేసినట్టుగా బైక్ ను ఆటో గుద్దినట్టు ఆనవాళ్లు లేవని, ఆ సమయంలో అటువైపు ఆటో వెళ్లినట్టుగా ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు. సమీపంలోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఎక్కడైనా యువతి మిస్సింగ్ కేసు నమోదైందా అనే కోణంలోనూ ఎంక్వైరీ చేస్తున్నారు. హత్య జరిగిందా? లేక ఏదైనా ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది ఎంక్వైరీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.