- గల్లీ నుంచి మెయిన్ రోడ్డు దాకా ఇదే పరిస్థితి
- ఫీటు లోతు గుంతల కారణంగా స్లోగా ట్రాఫిక్
- వానల పేరుతో రిపేర్లను పట్టించుకోని బల్దియా
- 10 వేలకు పైగానే గుంతలు ఉన్నట్లు నిపుణుల అంచనా
“ బాగ్‌లింగంపల్లికి చెందిన జనార్దన్ సికింద్రాబాద్‌లో జాబ్ చేస్తాడు. రోజూ ఆర్టీసీ క్రాస్‌రోడ్, ముషీరాబాద్ మీదుగా బైక్‌పై డ్యూటీకి వెళ్తాడు. రోడ్లపై గుంతల కారణంగా అతనికి బ్యాక్‌పెయిన్ సమస్య వచ్చింది. కొంత కాలం సెలవు పెట్టి రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించాడు. ’’
“ రామ్‌కోఠికి చెందిన సురేశ్‌కు ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మెటీరియల్, ఇతర పనుల కోసం రోజుకి పదిసార్లు చిక్కడపల్లికి వెళ్తుంటాడు. రోడ్లపై గుంతలు ఉండగా బైక్‌పై వెళ్లాలంటే ఇబ్బందిగా మారింది. దీంతో కొద్ది రోజులుగా కారులో వెళ్తున్నాడు. ”
హైదరాబాద్, వెలుగు: సిటీలో గల్లీ నుంచి మెయిన్ రోడ్ల దాకా గుంతలు పడ్డాయి. అడుగడుగునా గుంతల కారణంగా వెహికల్స్ వేగం తగ్గి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. కొన్ని చోట్ల ఫీట్‌కు పైగా లోతైన గుంతలు పడిన రోడ్లు ఉండగా, 10 నిమిషాల జర్నీకి అరగంట పడుతోంది. వానాకాలం రోడ్లు రిపేర్లు చేయడం కష్టంగా ఉంటుందని అధికారులు చెబుతుంటారు. నాలుగైదు రోజులుగా వానలు పడడం లేదు. అయినా రోడ్ల రిపేర్లు మాత్రం జరగట్లేదు. వానలతో పడే గుంతలను వెంటనే పూడ్చేందుకు మాన్సూన్ఎమర్జెన్సీ టీమ్‌లను నియమించాల్సి ఉండగా బల్దియా నామమాత్రంగా ఏర్పాటు చేసింది. దీంతో రోడ్లపై కంప్లయింట్స్ బల్దియాకు ఎక్కువగా వెళ్తున్నాయి. ప్రతి ఏటా రోడ్ల నిర్వహణ, కొత్త రోడ్ల నిర్మాణానికి బల్దియా రూ.900 కోట్లు ఖర్చు చేస్తోంది. రోడ్ల రీకార్పెటింగ్, మెయింటెనెన్స్‌కు 2016 నుంచి ఇప్పటివరకు రూ.2,520 కోట్లు వెచ్చించింది. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రస్తుతం గ్రేటర్లో 10 వేల వరకు గుంతలు ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు కాంట్రాక్టర్ల సమ్మె కారణంగా అంతర్గత రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. వెయ్యి కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించే వరకు పనులు చేయమని కాంట్రాక్టర్లు సమ్మె బాట పట్టారు. దీంతో రోడ్ల రిపేర్ల పనులు బంద్ అయ్యాయి.
ఓల్డ్‌సిటీలోనే కాదు.. హైటెక్ సిటీలోనూ..
ఓల్డ్‌సిటీలోనే కాదు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ లాంటి ఏరియాల్లోనూ రోడ్లపై గుంతలు పడ్డాయి. స్పీడ్‌గా వెళ్తే గుంతలు కనిపించక వెహికల్స్ దెబ్బతింటున్నాయి. బషీర్బాగ్నుంచి రామ్ కోఠి రూట్లో ఐదారు గుంతల్లో నీరు చేరింది. తెలియక స్పీడ్‌గా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. ముషీరాబాద్ ఏరియాలో చాలా రోడ్లు డ్యామేజ్అయ్యాయి. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీకి వెళ్లే రూట్లో అశోక్ నగర్, క్రాస్ రోడ్డు వద్ద ఏర్పడ్డ గుంతతో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. బహదూర్ పురా,చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో మెయిన్‌రోడ్లు కూడా పూర్తిగా గుంతలమయమయ్యాయి. కొన్నినెలలుగా పరిస్థితి ఇలానే ఉన్నప్పటికి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. షేక్‌పేటలో ఉన్న గుంతలు దగ్గరకు వచ్చేంత వరకు కనిపించకపోవడంతో స్పీడ్‌గా వెళ్తూ వాహనదారులు సడెన్ బ్రేక్‌లు వేస్తూ జారి పడుతున్నారు. బాలానగర్ఫ్లైఓవర్కింద గుంతల్లో మోకాళ్లలోతున నీళ్లు ఉన్నాయి.
జీతాల్లో కోత విధిస్తామని..
రోడ్లపై గుంతలు చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని గత కమిషనర్లు అప్పట్లో ప్రకటించారు. ఇక ప్రైవేట్ఏజెన్సీలకు అప్పగించిన మెయిన్ రోడ్లపై గుంతలు కనిపిస్తే అధికారుల జీతాల్లో కోత విధిస్తామని ప్రస్తుత కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంతల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆదేశిస్తే హడావిడిగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. కమిషనర్మాత్రం రోడ్లకు సంబంధించి ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. రోడ్ల గుంతలపై కమిషనర్‌కు చెప్పినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రిటైర్డ్ దంపతుల సేవలపై హైకోర్టు స్పందించి..
సిటీకి చెందిన రిటైర్డ్ ఎంప్లాయ్ గంగాధర్ తిలక్ దంపతులు తమ పెన్షన్ డబ్బులతో కొంతకాలంగా రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి వేస్తున్నారు. వారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా న్యూస్ చానెళ్లు, పత్రికల్లోనూ రావడంతో దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. బల్దియా నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రోడ్ల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని బల్దియా అధికారులను ఆదేశించింది. దీంతో ఐదేళ్లుగా గ్రేటర్లో 2 లక్షల 43 వేల 455 గుంతలు పూడ్చినట్లు, ఈ ఏడాది కేవలం 2,152 గుంతలు మాత్రమే ఏర్పడ్డాయని, వాటిని కూడా పూడ్చామని, ప్రస్తుతం సిటీ రోడ్లపై ఎలాంటి గుంతలు లేవని అధికారులు నివేదికను హైకోర్టుకు సమర్పించారు. ఒక్కో గుంతకు 7,390 రూపాయలు ఖర్చు చేసినట్లు, ఇందుకు ఐదేళ్లలో మొత్తం180 కోట్లు ఖర్చయినట్లు లెక్కలు చూపారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎక్కడ చూసిన గుంతలే కనిస్తున్నాయని, మీరు ఇచ్చిన నివేదిక సమగ్రంగా లేదని తిరిగి సమర్పించాలని ఆదేశించింది. మరో ఐదారు రోజుల్లో కొత్త నివేదికను అందజేసేందుకు బల్దియా రెడీ అవుతోంది.
ఎక్కడ గుంత.. మ్యాన్‌హోల్ ఉందో తెలియట్లే..
వానాకాలం వస్తే చాలు రోడ్లు పూర్తిగా కరాబ్అవుతాయి. గుంతల్లో వర్షపు నీరు నిలిస్తే ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో తెలియదు. రోడ్లపై గుంతల కారణంగా ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారు. ట్రాఫిక్ వాళ్లు చిన్న తప్పు చేస్తేనే వందల్లో ఫైన్ వేస్తారు. మరి రోడ్లపై గుంతలు ఉంటే ఎవరికి
ఫైన్ వేయాలి.
- జనార్దన్‌రెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్
కారు నడపాలంటేనే..
కారులో బయటి ప్రదేశాలకు ఎన్నిసార్లు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది అనిపించదు. అదే సిటీలో కారు కిరాయికి పోవాలనిపించదు. రోడ్లపై గుంతలు ఉండగా నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. కొద్దిగా స్పీడ్‌గా వెళ్తే చాలు కారు ఎత్తేస్తుంది. గుంతలను పూడ్చితే ఇబ్బందులు తప్పుతాయి. లేకపోతే బ్యాక్‌పెయిన్ ప్రాబ్లమ్ వచ్చేలా ఉంది.
- శ్రీకాంత్, మౌలాలి