బోగ శ్రావణి ఆరోపణలు నిరాధారం : మున్సిపల్ వైస్ చైర్మన్

జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన బోగ శ్రావణిపై మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై ఆమె చేసిన ఆరోపణల్ని ఖండించారు. ఆమె చెప్పిన మాటలన్నీ నిరాధారమైనవని అన్నారు. పార్టీ మారే ఉద్దేశంతోనే శ్రావణి అనవసర ఆరోపణలు చేశారని చెప్పారు. మచ్చలేని నాయకుడైన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలాంటి వారో నియోజకవర్గ ప్రజలకు తెలుసని అన్నారు. శ్రావణి వెనక బీజేపీ నాయకులు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. 

రాజీనామా విషయం ముందే తెలియకపోతే ఎంపీ అర్వింద్ ఫేస్ బుక్ లో లైవ్ ఎలా పెట్టారని గోలి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయించింది బీజేపీ నాయకులేనని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. శ్రావణి విషయం పార్టీ పెద్దలకు వరకు తీసుకెళ్లామని, కొత్తగా ఛైర్మన్ గా అధిష్ఠానం ఎవరిని నియమించినా తామంతా అంగీకరిస్తామని స్పష్టం చేశారు.