Vikarabad Incident: కలెక్టర్‌ను నమ్మించి తీసుకెళ్లి దాడి చేయించిన సురేశ్.. బీఆర్ఎస్ నేతల ముఖ్య అనుచరుడు

Vikarabad Incident: కలెక్టర్‌ను నమ్మించి తీసుకెళ్లి దాడి చేయించిన సురేశ్.. బీఆర్ఎస్ నేతల ముఖ్య అనుచరుడు

వికారాబాద్ / కొడంగల్, వెలుగు: ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కీలక నిందితుడిగా భావిస్తున్న బీఆర్​ఎస్​ కార్యకర్త బోగమోని సురేశ్..​ పక్కా ప్లాన్​ ప్రకారమే కలెక్టర్​ను, ఇతర అధికారులను ప్రజాభిప్రాయ సేకరణ సభ నుంచి గ్రామానికి తీసుకెళ్లినట్లు పోలీసులు చెప్తున్నారు. గ్రామంలో కలెక్టర్​ నాలుగు అడుగులు వేయగానే.. కొందరు దాడికి తెగబడ్డారని, ఇదంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తున్నదని పోలీసులు అంటున్నారు.

సురేశ్​ది కీలకపాత్ర 

సురేశ్ మాట మీద లగచర్లకు వెళ్లిన కలెక్టర్‌తో ఎవరూ మాట్లాడడానికి సిద్ధంగా లేకపోగా.. నినాదాలు చేస్తూ దాడి చేశారు. దీన్నిబట్టి ఈ దాడికి బీఆర్ఎస్ లీడర్​సురేశ్ ​రెచ్చగొట్టిన మాటలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కలెక్టర్​ రాకముందే సురేశ్​ అక్కడి గ్రామస్తులను రెచ్చగొట్టి రాళ్లు, కర్రలతో సిద్ధంగా ఉంచాడని, ముందస్తు ప్లాన్​ప్రకారం అక్కడికి వచ్చిన కలెక్టర్​ను, ఇతర అధికారులను తీసుకువెళ్లి దాడి చేయించినట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు ఇదివరకే ప్రకటించారు.

Also Read :- పరిగి పోలీస్ స్టేషన్‌కు భారీ పోలీసు బందోబస్తు

పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు 

కలెక్టర్​ను లగచర్లకు తీసుకుపోయిన బీఆర్ఎస్ ​కార్యకర్త సురేశ్​ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా తెలుస్తోంది. సురేష్.. ఆ పార్టీ వర్కింగ్ ​ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి, హరీశ్​రావు, ఇతర లీడర్లను కలిసిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి.. ఆరోపణలు ఎదుర్కొంటోన్న సురేష్ తన అనుచరుడే అని బహిరంగంగా చెప్పారు.  ‘సురేశ్ మా పార్టీ కార్యకర్త. రోజూ నాకు ఫోన్లు చేస్తూ ఉంటాడు. అధికారులపై దాడి రోజు కూడా నాకు ఫోన్ ​చేశాడు. అతడికి అక్కడ భూమి ఉంది. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరిస్తున్నాం అని చెప్పాడు. బహిష్కరించమని చెప్పా’ అని స్పష్టం చేశారు. దీని ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.