కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

  • ప్రాణహిత నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తానన్న హామీ ఏమైంది కేసీఆర్ ?

కొమురంభీం జిల్లా: మిల్లర్ల దగ్గర కమీషన్ల కోసమే కేసీఆర్ బాయిల్డ్ రైస్ పంచాయతీ పెట్టారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చేతకాకనే వరిధాన్యం పంచాయతీ పేరుతో టీఆర్ఎస్ ధర్నాలు చేస్తోందన్నారు. ప్రాణహిత నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లిస్తానని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కొమురంభీం జిల్లా కౌటాల తుమ్మిడిహెట్టి దగ్గర జరిగిన పాల్వాయి హరీష్ బాబు ప్రాణహిత జలసాధన పాదయాత్ర ముగింపు సభలో మాట్లాడారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరంలో ఎక్కువ కమీషన్లు రావడం వల్లే ప్రాణహిత ప్రాజెక్టుపై కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును బీజేపీ మేనిఫెస్టోలో పెట్టించే బాధ్యత తాను తీసుకుంటాన్నారు వివేక్ వెంకటస్వామి.
తెలంగాణ ప్రాజెక్టుల్లో దోచుకుని ఆంధ్ర కాంట్రాక్టర్లు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులయ్యారు
నిత్యం ప్రజల గురించే ఆలోచించి గొప్ప పేరు సంపాదించిన నాయకుడు పాల్వాయి పురుషోత్తం రావ్, కాకా వెంకటస్వామి సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల హక్కుల కోసం అశేష కృషి, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం వైఎస్సార్ ను ఒప్పించి పనులు ప్రారంభమయ్యేలా చేసిన వ్యక్తి కాకా వెంకటస్వామి అని తెలిపారు.  ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ప్రాజెక్టుల్లో దోచుకొని ప్రపంచంలోనే పెద్ద ధనవంతులయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో డబ్బులు దోచుకున్న కేసీఆర్.. కొడుకును సీఎం చేసి తాను కేంద్రానికి వెళ్లాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో కేసీఆర్ 500 కోట్లు ఖర్చుపెట్టాడని.. అదంతా ప్రజల సొమ్ము అన్నారు. ప్రజల సొమ్మును దోచుకొని రాజకీయ, కుటుంబ భవిష్యత్తు కాపాడుకుంటున్నాడని అన్నారు. 
కారు.. సారు.. పదహారు కాస్త ఏడు స్థానాలైంది
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలతో కేసీఆర్ కి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని, కారు.. సారు.. పదహారు కాస్త ఏడు స్థానాలైందని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. పోడు భూములకు పట్టాల హామీ ఏమైందని.. పొడుభూముల్లోకి వస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులకు కేసీఆర్ అనధికార ఉత్తర్వులు జారీ చేశారని ఆయన ఆరోపించారు.  శ్రీలంక, పాకిస్తాన్ దేశాలు అప్పులు చేసి నాశనం దిశగా వెళ్తున్నాయని, కేసీఆర్ మనరాష్ట్రాన్ని కూడా అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నాడన్నారు. డబ్బులతోనే వచ్చే ఎన్నికల్లో గెలుస్తన్న ధీమా కేసీఆర్ కి ఉంది, ఒక్కో నియోజకవర్గంలో 50కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే సహాయం గురించి వివరించాలని ఆయన సూచించారు. 

 

ఇవి కూడా చదవండి

మత్తు వదలరా బాబు..సన్మార్గంలో నడవండి

రివ్యూ: గని

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ