కరీంనగర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ‘‘ మేము కూడా దాడులు చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. గతంలోనూ ఎన్నో ఉద్యమాలు చేశాం. అప్పుడున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై మేమెప్పుడైనా దాడులు చేశామా ? కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ, కాంగ్రెస్ అలజడులు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి స్టేజీ వద్ద మహాధర్నా చేస్తున్న యువజన సంఘాల నాయకులు.. ఆ మార్గం మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి కారును చుట్టుముట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పోలీసులు ఇదంతా చూసుకుంటారని.. టీఆర్ఎస్ నేతలు సంయమనం పాటించాలని సూచించారు. రసమయిపై దాడి చేయాలన్న కుట్రతోనే రాళ్లు తెచ్చి పెట్టుకున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరులు, కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ అనుచరులే ఇదంతా చేశారన్నారు.
అంతకుముందు ఏం జరిగింది ?
కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి స్టేజి వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా ఉద్రిక్తంగా మారింది. గుండ్లపల్లి నుండి గన్నేరువరం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్ జామ్ అయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో హైదరాబాద్ వెళ్లేందుకు అటుగా వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఎమ్మెల్యేను చూసి ఆగ్రహానికి గురైన యువకులు... కారు వెంట పరుగులు తీశారు.
అనంతరం పోలీసుల సహాయంతో రసమయి వాహనంలో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ధర్నా చేస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సుడా ఛైర్మన్(టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు) జి.వి.రామకృష్ణారావు తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈక్రమంలో వారి వెంటనున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు స్టేషన్ లోపలున్న కాంగ్రెస్, యువజన సంఘాల నేతల దగ్గరకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో సీపీ సత్యనారాయణ పోలీసు స్టేషన్ కు దగ్గరకు వచ్చి వినోద్ కుమార్, రసమయితో మాట్లాడారు.