
చెన్నూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఓవర్స్పీడుకు ఇద్దరు బలయ్యారు. ఒకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చెన్నూరు సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూరు మండలం ఓత్కులపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ కంకణాల దేవేందర్ రెడ్డి(40) శనివారం బైక్పై చెన్నూరు వెళ్లాడు. రాత్రి తిరిగి గ్రామానికి వస్తుండగా, కత్తరసాల బ్రిడ్జి వద్ద చెన్నూరుకు చెందిన మెకానిక్ మహమ్మద్ సైఫ్(22), మహమ్మద్ అబిద్ ఎదురయ్యారు.
అదే సమయంలో చెన్నూరు వైపు వెళ్తున్న బొలెరో వెహికల్ వీరి రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దేవేందర్ రెడ్డి, సైఫ్ అక్కడికక్కడే చనిపోయారు. అబిద్కు సీరియస్గా ఉండడంతో స్థానికులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవీందర్ తెలిపారు. మృతుడు దేవేందర్ రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్, అబిద్కి పెళ్లి కాలేదు.