
బెంగాలీ ఫ్యామిలీలో పుట్టిన అభిషేక్ బెనర్జీ సొంతూరు వెస్ట్ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో ఖరీదా. ఢిల్లీలో చదివాడు. కంప్యూటర్ సైన్స్ తీసుకున్న తాను కానీ, దాన్ని కొనసాగించలేదు. దానికి బదులు ఇంగ్లీష్ హానర్స్ కోర్స్ తీసుకున్నాడు. కలకత్తాలో స్కూల్ చదువు పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలోనే నాటకాలు వేయడంలో శిక్షణ తీసుకున్నాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అభిషేక్ అందరిలానే చదువు పూర్తయ్యాక ఉద్యోగంలో చేరాలనుకున్నాడు. కానీ, కంప్యూటర్ సైన్స్ నచ్చక మానేశాడు.
కామెడీ అందరు నటులూ చేయలేరు. అలాగే కామెడీ చేసేవాళ్లు ఏ పాత్ర అయినా చేయగలరు’’ అని అంటుంటారు. అలాంటివాళ్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో ఒకరు అభిషేక్ బెనర్జీ కూడా. కామెడీ పాత్రల్లో ఎంత నవ్విస్తాడో.. విలన్ పాత్రలో ఉంటే హీరోలకు ధీటుగా నటిస్తాడు. మంచి పాత్ర వస్తే సపోర్టింగ్ రోల్స్‌లోనూ మెప్పిస్తాడు. స్త్రీ, పాతాళ్ లోక్ వంటి ప్రాజెక్ట్‌లే తన టాలెంట్‌కి నిదర్శనం. కాస్టింగ్ డైరెక్టర్‌తో మొదలైన అభిషేక్ ప్రయాణం నటుడిగా మలుపు తీసుకుంది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చిపెట్టింది.
కాస్టింగ్.. కంటిన్యూ..
మొదటిసారి ‘రంగ్‌దే బసంతి’ సినిమాలో కనిపించాడు. 2008లో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. నాక్ అవుట్ అనే సినిమాకి 2010 కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే ఏట ‘సోల్ ఆఫ్ శాండ్’ అనే సినిమాలో నటించాడు. ఆ తర్వాత ది డర్టీ పిక్చర్, నో వన్ కిల్డ్ జెస్సికా, గబ్బర్ ఈజ్ బ్యాక్, రాక్ ఆన్ – 2, డియర్ డాడ్, ఓకే జానూ, టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ, అజ్జి.. ఇలా అనేక సినిమాలకు కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. వాటిలో కొన్ని సినిమాల్లో నటించాడు కూడా. 2018లో ‘స్త్రీ’ సినిమాతో అతనికి గుర్తింపు దక్కింది. అయినప్పటికీ ఒకవైపు నటిస్తూనే కాస్టింగ్ డైరెక్టర్‌గానూ కొనసాగాడు అభిషేక్. అందుకే ‘స్త్రీ’తో గుర్తింపు వచ్చాక కూడా ‘కళంక్’ సినిమాకు కాస్టింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
ఆ తర్వాత మళ్లీ అర్జున్ పాటియాలా, డ్రీమ్ గర్ల్, బాలా వంటి సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నటించాలనే తపనతో 2015లో షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించాడు. అంతేకాదు.. 2015లో టీవీఎఫ్ పిచెర్స్ వంటి య్యూటూబ్ ఛానెల్స్‌లో వెబ్ సిరీస్‌ల్లోనూ నటించాడు. తర్వాత మీర్జాపూర్, టైప్ రైటర్ వంటి హిట్ సిరీస్‌ల్లోనూ అభిషేక్ కనిపించాడు. టైప్ రైటర్లో ‘ఫకీర్’ అనే కీలక పాత్ర పోషించాడు. కాస్టింగ్ డైరెక్టర్‌గా మొదలైన తన జర్నీని ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. తన ఫ్రెండ్‌తో కలిసి ‘కాస్టింగ్ బే’ అనే కంపెనీ నడిపిస్తున్నాడు. ఈ సంస్థను 2017లోనే స్థాపించారు.
అభిషేక్ తన కెరీర్ గురించి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘‘ముంబైకి వచ్చాక కొన్నేండ్ల పాటు నా ప్రయత్నాలు ఏవీ వర్కవుట్ కాలేదు. దాంతో వెనక్కి వెళ్లిపోయి ట్రైనింగ్ తీసుకోవాలి అనుకున్నా. కానీ, కాస్టింగ్ రూమ్‌లోనే నాకు ట్రైనింగ్ పొందే అవకాశం దొరికింది. అలా 23 ఏండ్ల వయసులో కాస్టింగ్ అసోసియేట్‌గా చేరా. ‘ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబై’ అనే సినిమాతో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కాస్టింగ్ డైరెక్టర్‌గా ఉద్యోగం లభించింది. 24 ఏండ్ల వయసులో కాస్టింగ్ డైరెక్టర్‌గా చాలా సినిమాలకు పనిచేశా.’’
కెరీర్‌కి టర్నింగ్ పాయింట్
‘పాతాళ్ లోక్’ అనే వెబ్ సిరీస్ 2020లో ఓటీటీలో విడుదలైంది. అందులో అభిషేక్ విలన్ పాత్ర పోషించాడు. అది తన కెరీర్‌కే టర్నింగ్ పాయింట్ అయింది. ఈ వెబ్ సిరీస్‌కి కూడా తనే కాస్టింగ్ డైరెక్టర్. అప్పటి నుంచి తన కెరీర్ ఊపందుకుంది. ఏడాదికి కనీసం మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా గడిపాడు. అదే టైంలో తెలుగులోనూ నటించాడు. ఆ సినిమా పేరు హైవే. ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన ఆ సినిమాలో ‘డి’ అనే విలన్ పాత్రలో నటించాడు.
గతేడాది ముంజ్య, వేద, స్త్రీ –2 వంటి హిట్ సినిమాల్లో భాగమయ్యాడు. అటు సినిమాలతోపాటు సిరీస్‌లలోనూ నటిస్తున్నాడు. ‘రానా నాయుడు’ సిరీస్‌లో జఫ్ఫాగా, తమన్నా నటించిన ‘ఆఖరీ సచ్’ సినిమాలో భువన్ రాజ్వత్ పాత్రలు పోషించాడు. ‘స్త్రీ’ తర్వాత నుంచి అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇక కొవిడ్ టైంలో అయితే నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయా. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రానప్పుడు నాకు పాతాళ్లోక్లో అవకాశం వచ్చింది. దాంతో కెరీర్ మలుపు తిరిగింది.
అద్దె ఇంటి నుంచి..
చెన్నైలో బీచ్‌కి దగ్గరలో ఉండే కల్పక్కమ్ అనే ప్రాంతంలో కొన్నాళ్లు ఉన్నాడు. అక్కడ బీచ్‌లో అలలను చూస్తూ ఒక ఊహాప్రపంచంలో బతికేవాడట. కల్పక్కమ్ నుంచే తనలో క్రియేటివిటీ వచ్చిందంటాడు అభిషేక్. తర్వాత మళ్లీ ఢిల్లీ రావడంతో అంతా మామూలై పోయింది. కానీ, ముంబై వచ్చిన తర్వాత యాక్టింగ్ కోసం ప్రయత్నాలు, అద్దె ఇంట్లో తిప్పలు, టీనాతో పరిచయం ఇలా చాలా జరిగాయి తన లైఫ్‌లో. తన కష్టాలు చూసి టీనా తనతోపాటే ఫ్లాట్‌లో ఉండమని అడిగిందట. అప్పటికే వాళ్ల మధ్య ప్రేమ ఉండడంతో పెండ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ప్రస్తుతం ఆ జంట పెద్ద విల్లాలో సంతోషంగా ఉంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు
అభిషేక్.
ఎగతాళి చేసేవాడిని
‘‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఒకసారి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. నేను చదివింది ఆర్మీ స్కూల్లో. అక్కడ స్ట్రిక్ట్‌గా ఉండడంతో నేను క్లాస్‌లు ఎగ్గొట్టడానికి ప్రయత్నించేవాడిని. స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని. ఎప్పుడూ గ్రౌండ్లో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడుతూ కనిపించేవాడిని. నేను ఆడగలిగిన ప్రతి ఆటలో పార్టిసిపేట్ చేసేవాడిని. స్పోర్ట్స్ ఆడడం వల్లే నేను అందరితో కలవడం, మొహమాటం లేకుండా మాట్లాడడం వంటివి అలవర్చుకున్నా. అయితే, నటన అంటే నాకు అర్థమయ్యేది కాదు.
అంతెందుకు స్టేజీ మీద ఏదైనా ఆర్ట్‌ని పర్ఫార్మ్ చేయడం పట్ల మంచి ఉద్దేశం ఉండేది కాదు. ఎవరైనా స్టేజీ మీద పర్ఫార్మ్ చేస్తుంటే ఎగతాళి చేసేవాడిని. అలాంటప్పుడు మా ఆర్ట్ టీచర్ ఒక టెస్ట్ పెట్టారు. అందులో నేను ‘వనవాసి రామ్’ అనే పాత్రలో నటించా. అప్పుడు నటించడంలో ఉన్న అనుభూతిని మనసారా ఆస్వాదించా. ప్రేక్షకులు చప్పట్లు కొడుతుంటే మురిసిపోయా. అప్పుడు అర్థమయింది నాకు నటన అంటే ఇష్టమని. అయినా దానిపై మంచి అభిప్రాయం లేకపోవడంతో చదువుకు ప్రియారిటీ ఇచ్చా.
అయితే ఏదో విధంగా తక్కువ మార్కులతో స్కూల్ చదువు పూర్తైంది. కానీ, ఇక లైఫ్‌లో ఏం చేయాలో క్లారిటీ లేదు. ఒకరోజు ఒక ప్రోగ్రామ్‌కి యాంకరింగ్ చేస్తుంటే చిరాకు పడిన మా టీచర్ ‘‘నువ్వు దీనికి మాత్రమే సరిపోతావు” అన్నాడు. కొందరైతే అది అవమానంగా భావిస్తారేమో. కానీ, నాకు అది ఒక సంకేతంలా అనిపించింది. స్పోర్ట్స్, ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ వైపుగా వెళ్లాలనుకున్నా. యాక్టింగ్ ఆడిషన్ ద్వారా కిరోరి మాల్ కాలేజీలో చేరా. అప్పటి నుంచి నా నటన కోసం చేయని ప్రయత్నం లేదు. ఈ ప్రయాణంలో మా అమ్మ నన్ను అడుగడుగునా ఎంకరేజ్ చేసింది. నాన్న మాత్రం నాలాగే ఆర్ట్‌ని అర్థం లేనిదిగా భావించేవాడు అప్పుడు.’’
అమితాబ్‌కి వీరాభిమాని..
‘‘నేను ఎప్పటికీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్నే. తమిళనాడులో ఉన్నప్పుడు రజనీకాంత్ సినిమాలు చాలా చూశా. అలాగే దూరదర్శన్‌లో బచ్చన్ సినిమాలు కూడా చూసేవాడిని. ఒక రకంగా బచ్చన్ అంటే నాకు ‘మేల్ క్రష్’ అనుకోండి. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఆయన నాకు ద్రోణాచార్యుడు.’’