లెక్కలంటే నాకు కూడా భయం ఉండేది.. సినీ నటి దీపికా పదుకొనే

లెక్కలంటే నాకు కూడా భయం ఉండేది.. సినీ నటి దీపికా పదుకొనే
  • లెక్కలంటే నేను కూడా భయపడేదాన్ని
  • పరీక్షా పే చర్చలో దీపికా పదుకొనే

న్యూఢిల్లీ: ఎలాంటి సమస్యలు వచ్చినా దాచుకోకుండా తల్లిదండ్రులుకు, తోటివాళ్లకు చెప్పుకోవాలని బాలివుడ్ యాక్టర్ దీపికా పదుకొనే స్టూడెంట్లకు సూచించారు. భావాలను ఎప్పుడూ అణిచివేయొద్దని, స్నేహితులతోనో టీచర్లతోనో పంచుకోవాలన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్​లో దీపికా పదుకొనే పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యంపై ఆమె స్కూల్ పిల్లలతో మాట్లాడారు. తాను కూడా ఒక దశలో డిప్రెషన్​కు గురయ్యానని దీపికా పేర్కొన్నారు. 

అయితే, దాన్ని ఎలా అధిగమించాలో స్టూడెంట్లకు వివరించారు. డిప్రెషన్​నుంచి బయటపడేదెలా అనే విషయం గురించి చర్చించేందుకు చక్కని వేదికను అందించారంటూ ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

నేనూ అల్లరి పిల్లనే.. 

ఈ సందర్భంగా దీపిక తన స్కూల్​ డేస్​ను గుర్తుచేసుకున్నారు. తాను స్కూల్లో టేబుల్స్, కుర్చీలు ఎక్కి అల్లరి చేసేదాన్నని చెప్పుకొచ్చారు. స్టూడెంట్​గా ఉన్నప్పుడు సహజంగానే మానసిక ఒత్తిడికి గురవుతామని చెప్పారు. 

లెక్కలు సరిగా రాక తానెంతో భయపడిపోయేదాన్నని వివరించారు. అయితే, ఆ భయాన్ని అధిగమించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని దీపిక ప్రస్తావించారు. 

ఏదైనా సమస్య వస్తే లోపలే దాచుకొని కుంగిపోవద్దని, కుటుంబ సభ్యులు.. స్నేహితులకు చెప్పుకోవాలని సూచించారు. మన భావోద్వేగాలను బయటపెట్టేందుకు డైరీ రాయడం చక్కని మార్గమని చెప్పారు.