హీరో రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’లో ధనవంతుడి కూతురిగా.. పొగరు, అమాయకత్వం కలగలసిన పాత్రలో కనిపించిన నటి గుర్తుందా? నేహా శర్మ. చిరుత సినిమా రామ్ చరణ్‌కే కాదు.. నేహాకు కూడా డెబ్యూనే. ఆ తర్వాత వరుణ్ సందేశ్‌తో ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించిన ఈమె మళ్లీ టాలీవుడ్లో కనిపించలేదు. పంజాబీ, హిందీ, మలయాళం, తమిళ భాషల్లో చేసింది. కానీ, పెద్దగా బ్రేక్ రాకపోవడంతో కొన్నాళ్లు తెరపై కనపడలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది నేహ. అయితే లేటెస్ట్గా ఈ ఏడాది ఆమె నటించిన రెండు వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంటున్నాయి. సినిమా నుంచి వెబ్‌సిరీస్ వరకు ఆమె జర్నీ గురించి..
మాది బీహార్‌లోని భాగల్పూర్. మా నాన్న అజిత్ శర్మ రాజకీయ నాయకుడు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో నాన్న తరఫున ప్రచారం కూడా చేశా. భాగల్పూర్లోనే స్కూల్ చదువు పూర్తి చేశా. తర్వాత న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేశా. కథక్ డాన్స్ నేర్చుకున్నా. లండన్‌లోని ‘పైనాపిల్ డాన్స్ స్టూడియో’లో స్ట్రీట్ హిప్ హాప్, లాటిన్ డాన్స్ సాల్సా, మెరెంగ్యు, జీవె, జాజ్ వంటి డాన్స్ ఫామ్స్ కూడా నేర్చుకున్నా. వంట చేయడం, మ్యూజిక్ వినడం, చదవడం, డాన్స్ చేయడం నా హాబీ.
యాక్టింగ్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, ఆర్ట్ పర్ఫార్మ్చేయడం ఇష్టం. అందుకని సినిమా మీడియం బాగుంటుంది అనిపించింది. సరిగ్గా ఎగ్జామ్స్ టైంలో అకాడమీ అవార్డ్స్ ఇచ్చేవాళ్లు. ఆ ఈవెంట్స్ చూస్తూ ఎగ్జామ్స్ కూడా సరిగా రాసేదాన్ని కాదు. మొదటి సినిమా చేశాక ఆ ఎక్స్‌పీరియెన్స్ బాగా నచ్చింది. దాంతో దాన్నే ప్రొఫెషన్‌గా ఎంచుకున్నా.
ఆడిషన్ లేకుండానే..
నా డెబ్యూ సినిమా తెలుగులో చిరుత(2007). ఆ తర్వాత కుర్రాడు (2009) అనే మరో తెలుగు సినిమా చేశా. 2010లో ఇమ్రాన్ హష్మీకి జోడీగా ‘క్రూక్’ అనే సినిమాలో నటించా. అదే నా బాలీవుడ్ డెబ్యూ. క్రూక్ సినిమాలో ఓ పాత్ర కోసం కొత్త అమ్మాయి కావాలని మోహిత్, ముఖేశ్ వెతుకుతూ నా దగ్గరికి వచ్చారు. ఆ రోల్‌కు నేను సరిపోతానని వాళ్లకు అనిపించి ఉండొచ్చు. నేను చేసిన చిరుత సినిమా కూడా చూసుండొచ్చు. అందుకే ఆడిషన్ లేకుండానే నన్ను ఓకే చేశారు. ఆ తర్వాత ‘యమ్లా పగ్లా, దీవానా 2, తుమ్ బిన్ 2, కామెడీ ముబారకన్’ వంటి సినిమాల్లో నటించా.
అలాంటి ఆఫర్లు చాలా అరుదు
మంచి స్క్రిప్ట్స్ రావడం అంత ఈజీ కాదు. కాదని చెప్పలేని ఆఫర్లు చాలా అరుదుగా వస్తుంటాయి. నాకు ఏడాదికి ఐదు ఆఫర్లు వస్తాయని గొప్పలు చెప్పుకోను. ఒకవేళ ఐదు సినిమా అవకాశాలు వచ్చినా వాటిలో ఒక్కటే బాగుంటుంది. కాబట్టి ఆ ఒక్కటే ఎంచుకుంటా. పదిహేనేండ్ల తర్వాత కూడా కథల విషయంలో ఇలానే ఆలోచిస్తా. అంతేకానీ అవకాశాల కోసం నెట్ వర్క్ బిల్డ్ చేసుకుని, పీఆర్ని మెయింటెయిన్ చేసి, ఎప్పడూ మీడియాలో కనిపించడం వంటివి ఏవైనా చేస్తుంటే... ఏదో ఒకటి కలిసొచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అది జరిగినా, జరగకపోయినా అక్కడ నువ్వు చేసేదేం లేదు. వచ్చిన అవకాశాన్ని కష్టపడిచేయడం వరకే నీ పని. అది బాగా వస్తే.. వంద స్క్రిప్ట్‌లు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఒక సినిమా చేస్తున్నప్పుడు పూర్తిగా నా దృష్టంతా దాని మీదే పెడతా. అందుకు తగ్గట్టే రిజల్ట్ వస్తుంది.
అందుకే వాటికి దూరంగా
‘సినిమా ఇండస్ట్రీలో కెరీర్ గ్రోత్ ఉండాలంటే... సోషల్‌గా ఉండాలి. పార్టీలకు వెళ్లాలి’ అని కొందరు నాకు చెప్పేవాళ్లు. అలా ఉండేందుకు ట్రై చేశా. కానీ, కొద్దిరోజుల్లోనే అలా చేయడం నాకు నచ్చలేదు. అప్పటి నుంచి పార్టీలు, పబ్‌లకు దూరంగా ఉన్నా. కెరీర్ మొదట్లో అంటే నెట్వర్క్ పెంచుకోవాలనే ఆలోచనతో పార్టీలకు వెళ్లేదాన్ని. అక్కడికి వెళ్లాక నేను ఒక మూలన కూర్చునేదాన్ని.
దగ్గరకు వచ్చి ఎవరూ నాతో మాట్లాడే వాళ్లు కాదు. నేను యాక్టర్‌ని. నటన తెలుసు. అంతేకానీ, ‘సర్.. నాకు పని ఇవ్వండి’ అని ఎలా అడగాలో తెలియదు. ఒక పాత్ర చేయమని అవకాశం వచ్చిందంటే నా వర్క్ నచ్చితే ఇస్తారు. లేదంటే ఇవ్వరు. యాక్టర్ కావాలనే ఆశతో ముంబైకి లక్షల మంది ప్రజలు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పదేండ్ల తర్వాత కూడా నాకు అవకాశాలు వస్తున్నాయి. అంటే అది నాకు గొప్ప విషయమే కదా!
స్పాంటేనియస్‌గా...
నేను స్పాంటేనియస్ యాక్టర్‌ని. సీన్ చెప్పగానే ఇన్వాల్వ్ అయిపోయి వెంటనే ఎక్స్‌ప్రెస్ చేస్తా. ఎమోషన్ ఏదైనా చాలా త్వరగా పలికించగలను. నిజానికి విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే ఎక్స్ప్రెషన్ రూపంలో చూపించడం నటించడానికి ఉత్తమమైన మార్గం. నా ఎమోషన్ని నిజాయితీగా బయటపెట్టగలను. అలా నటించగలను అని యాక్టింగ్ సపరేట్గా నేర్చుకోలేదు. స్కూల్లో డాన్సింగ్, సింగింగ్, డ్రామాల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. స్టేజీ మీద పర్ఫార్మ్ చేయడం నాకు చాలా ఇష్టం. లక్కీగా మొదట్లోనే మంచి అవకాశాలు వచ్చాయి. ఎంత సక్సెస్ఫుల్ అయితే అంత గుర్తిస్తుంది ఈ ఇండస్ట్రీ.
వర్కింగ్ స్టయిల్ వేరే..
నేను తెలుగు కాకుండా ఇతర భాషల్లో నటించా. ఒక్కో ఇండస్ట్రీ వర్కింగ్ స్టయిల్ ఒక్కోలా ఉంటుంది. అన్ని రకాల ఎక్స్‌పీరియెన్స్‌లు నేను ఎంజాయ్ చేశా. అదంతా పెద్ద లెర్నింగ్ ప్రాసెస్ నా వరకు. ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా. తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే నాకు మొదటి అవకాశం ఇచ్చింది ఆ ఇండస్ట్రీనే కాబట్టి.
బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు
ఇండస్ట్రీకి రావడానికి బ్యాక్‌గ్రౌండ్ ఉండాల్సిన పనిలేదు. ఎవరో వచ్చి ‘నువ్వు ఇది చెయ్యి’ అని దారి చూపించాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు ఇండిపెండెంట్‌గా తమ నిర్ణయాలు తాము తీసుకోగలగాలి. నేను వచ్చింది చిన్న గ్రామం నుంచే. ‘‘సరైన గోల్స్ పెట్టుకోవాలి. వాటిని సాధించడం కోసం కష్టపడాలి’’ అని నేర్పించారు నా తల్లిదండ్రులు. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి. మనసుకు నచ్చిన పని చేయాలి. నేను చేసే పని మీద పూర్తి అవగాహన ఉండాలి. ఈ జర్నీ చాలా కష్టమని నాకు తెలుసు. ఏ పనీ సొంతంగా చేయడం అంత ఈజీ కాదు. కానీ, ఆ జర్నీలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గర్వంగా ఫీలవుతారు. అది చాలా గొప్ప ఫీలింగ్’’.
రాజకీయాల్లోకి..
నేను ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. అక్కడ ఎంపీ సీటు ఇస్తే.. నన్ను అభ్యర్థిగా నిలబెడతానని మా నాన్న చెప్పారు. నాకయితే రాజకీయాల్లోకి వెళ్లాలని ఇప్పటికైతే లేదు. ఫ్యూచర్లో వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళ్తా. ప్రజలు నాకు చాలా ఇచ్చారు. కాబట్టి వారికి తిరిగి ఇచ్చే టైం వచ్చినప్పుడు నేను రాజకీయాల్లో అడుగుపెడతా. సొంతంగా నాకంటూ ఒక స్థాయి ఏర్పాటుచేసుకుంటేనే కదా ప్రజలు నన్ను సీరియస్‌గా తీసుకునేది. అలా ఏమీ చేయకుండానే ‘నేను చెప్తా మీరు వినాలి’ అంటే ఎవరూ వినరు.
గ్రే క్యారెక్టర్స్ లో...
మొన్నటివరకు హీరోయిన్గా గ్లామర్ పాత్రల్లోనే నటించిన నేహా శర్మ సడెన్‌గా రూట్ మార్చింది. ఈ ఏడాది రిలీజ్ అయిన రెండు వెబ్ సిరీస్‌ల్లో గ్రే క్యారెక్టర్స్ లో కనిపించింది. ఈ మధ్యే వచ్చిన ‘ఇల్లీగల్’ వెబ్ సిరీస్‌లో గ్రే షేడ్స్ ఉన్న మెయిన్ లీడ్‌గా చేసింది. అది సక్సెస్ అవడంతో ఖుషీగా ఉన్న నేహకు డబుల్ ధమాకా అన్నట్టు మరో వెబ్ సిరీస్ ‘36 డేస్’ కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సిరీస్‌లతో ఆమె కెరీర్ మళ్లీ రీస్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. మనోజ్ బాజ్‌పేయితో కలిసి ‘వికల్ప్’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. అంతేకాదు.. చైనా సినిమా ‘షాన్జాన్’లో కూడా చేసింది నేహ.