నాన్నా.. నువ్వు చచ్చిపోతవా?..గుక్కపట్టి ఏడ్చిన సైఫ్ అలిఖాన్ కొడుకు.. ఎందుకంటే..

నాన్నా.. నువ్వు చచ్చిపోతవా?..గుక్కపట్టి ఏడ్చిన సైఫ్ అలిఖాన్ కొడుకు.. ఎందుకంటే..
  • సైఫ్​పై కత్తి దాడి జరిగినప్పుడు తైమూర్​ కన్నీళ్లు
  • ఓ టీవీ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్న బాలీవుడ్​ స్టార్

ముంబై: కత్తి దాడిలో గాయపడి తాను హాస్పిటల్​ వెళ్తున్నప్పుడు తన వెంట ఎనిమిదేండ్ల తన కొడుకు  తైమూర్​ కూడా ఉన్నాడని బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీఖాన్​ తెలిపారు. 

ఆరోజు అర్ధరాత్రి తన బాధను చూస్తూ తైమూర్​ గుక్కపెట్టి ఏడ్చాడని, వచ్చీరానీ మాటలతో ‘‘నాన్నా.. నీకేమైందే? నువ్వు చనిపోతున్నవా” అని అడిగాడని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సోమవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో సైఫ్ అలీఖాన్..తైమూర్​ మాటలను గుర్తుచేసుకున్నారు. 

‘‘జనవరి 16..ఆ రోజు అర్ధరాత్రి మా ఇంట్లోకి దుండగుడు దూరి దాడి చేస్తున్నప్పుడు ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. నా పక్కన నా వైఫ్​ కరీనా కపూర్, మా ఎనిమిదేండ్ల కొడుకు తైమూర్​ ఉన్నారు. నేను మామూలు దాడే అనుకున్నాను. 

కానీ, వెన్నులో కత్తి దిగినట్టు ఇంట్లో వాళ్లు  గుర్తించారు. నా బాధను చూసి తాళలేక తైమూర్​ వెక్కివెక్కి ఏడ్చాడు. నాతోపాటు దవాఖానకు వస్తానన్నాడు. నా వెంట ఆటోలో వాడు కూడా వచ్చాడు. ఆరోజు తైమూర్​ కన్నీళ్లు, వాడి మాటలు నన్ను ఎంతో కలచివేశాయి.

‘నాన్నా.. నువ్వు చనిపోతున్నవా’ అంటూ వాడు ఏడ్చేశాడు. ‘అదేం లేదు బేటా’ అని ఓదార్చాను” అని సైఫ్​ భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోజు  హాస్పిటల్​కు ఆటోలో వెళ్తున్నప్పుడు తన వెంట తైమూర్​, ఇబ్రహీం(సైఫ్​ మొదటి భార్య కొడుకు), ఆటో డ్రైవర్​ మాత్రమే ఉన్నారని ఆయన వివరించారు. 

తనను హాస్పిటల్​కు తరలించేందుకు కరీనా పడిన వేదన అంతా ఇంతా కాదని అన్నారు. ‘‘దాడి జరిగిన ఆరోజు అర్ధరాత్రి నా భార్య కరీనాకపూర్​ షాక్​కు గురైంది. వెంటనే తేరుకొని..తెలిసిన వారికి ఫోన్లు చేసింది. 

ఎవరూ స్పందించలేదు. తనే బంగ్లా పైనుంచి కిందికొచ్చి ఆటోలు, క్యాబ్​లను పిలిచింది. చివరికి ఓ ఆటో డ్రైవర్​ వచ్చి.. నన్ను సేఫ్​గా లీలావతి హాస్పిటల్​కు తీసుకెళ్లాడు. 

ఇంట్లో నొప్పితో బాధపడుతున్న నాకు పనివాళ్లు హరి, గీత సపర్యలు చేశారు. వాళ్లంతా లేకపోతే నేను ఇప్పుడు ఉండేవాడిని కాదేమో” అని వ్యాఖ్యానించారు. జనవరి 16న దాడి జరిగిన తర్వాత మొదటిసారి సోమవారం  సైఫ్​ అలీఖాన్​ ఓ టీవీ చానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు.  దాడి జరిగిన రోజు తాను, తన కుటుంబం పడిన వేదనను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.