![పరిచయం : మందిర మంత్ర.. హ్యాపీ ఫర్ నో రీజన్!](https://static.v6velugu.com/uploads/2025/02/bollywood-actress-mandira-bedi-life-story_qNzuhAK7fI.jpg)
ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించేదిఈ బాలీవుడ్ నటి. ఇప్పుడు పూర్తిగా తన లుక్‌ని మార్చేసి డిఫరెంట్‌గా మారిపోయింది. లుక్‌కి తగ్గట్టే పవర్ఫుల్ పాత్రల్లో నటిస్తోంది. ఆమె ఎవరో కాదు.. మందిరా బేడి. ఆమె పలు భాషల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించింది. లేటెస్ట్గా ఆమె నటించిన ‘ఐడెంటిటీ’ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఎప్పటిలానే ఆమె నటనతో మెస్మరైజ్ చేసింది. ఆమె గురించి మరిన్ని
ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇవి..
కొందరు నటులు టెలివిజన్‌లో సీరియల్స్ చేసి, తర్వాత సినిమాల్లోకి వస్తుంటారు. మందిర కూడా అలాగే సినిమాల్లోకి వచ్చింది. టెలివిజన్ ఇండస్ట్రీలో డైలీ సీరియల్‌తోనే ఆమె నటనా ప్రయాణం మొదలైంది. అయితే ఆమె నటిగానే కాకుండా తనకున్న మరో టాలెంట్‌ను కూడా బయటపెట్టింది. అదే క్రికెట్ కామెంటేటర్. క్రీడారంగంలో క్రికెట్‌కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఆ రంగంలో మహిళా కామెంటేటర్‌గా కూడా పనిచేసింది. అలా ఆమె ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రస్తుతం ఆమె వయసు ఐదు పదుల పైనే.. అయినా ఎంతో ఎనర్జిటిక్‌గా, ఫిట్‌గా ఉంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలుస్తోంది.
కలకత్తాలో పుట్టిన మందిరా బేడి.. ముంబైలో చదువుకుంది.1994లో టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. దూరదర్శన్ చానెల్లో ‘శాంతి’ అనే సీరియల్ చేసింది. అందులో శాంతి పాత్రలో నటించింది. దాంతో ఆమెకు ఎంతో గుర్తింపు లభించింది. 1995లో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాలో నటించింది. అప్పట్లో ఆమె అందం, నటన అందర్నీ ఆకట్టుకుంది. దాంతో చాలాకాలంపాటు ఆమె బిగ్ స్క్రీన్‌లో మంచి పాత్రల్లో మెరిసింది. 2003లో ఆమె క్రికెట్ కామెంటరీ చేసింది.
అక్కడ కొన్ని విమర్శలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత మళ్లీ కెరీర్లో ముందుకు సాగాలనే ఉద్దేశంతో సీరియల్స్, టీవీ షోలు హోస్ట్ చేసింది మందిర. ఆమె నటన, ఫ్యాషన్, స్టైల్ ఆడియెన్స్‌కు ఎంతో నచ్చేది. దాంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేవి. అలా 2004లో ‘మన్మథ’ సినిమాతో తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో ఆమె నటించిన ఒకే ఒక్క సినిమా ‘సాహో’. ‘ఐడెంటిటీ’ సినిమాతో మలయాళంలోనూ ఎంట్రీ ఇచ్చిందామె.
మళ్లీ స్క్రీన్‌పై..
మందిర 2018 నుంచే వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోంది. ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘స్మోక్’. తర్వాత ‘థింకిస్తాన్’, ‘రోమిల్ అండ్ జుగల్’, ‘ఖుబూల్ హై 2.0’, ‘సిక్స్’ వంటి హిందీ సిరీస్‌ల్లో నటించింది. 2023లో వచ్చిన ‘ది రైల్వే మెన్’లో రాజ్బిర్ కౌర్ పాత్రలో నటించింది. ఆ పాత్ర ఆమెకు మళ్లీ ఇండస్ట్రీ గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే, అప్పటికి ఆమె భర్తకు దూరమై ఎంతోకాలం కాలేదు. 1999లో పెండ్లి చేసుకుంది మందిర. 2021లో ఆమె భర్త రాజ్ కౌశల్ గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత వాళ్ల కొడుకు, కూతురు చిన్నపిల్లలే. ఇలాంటి సమయంలో మళ్లీ తాను స్క్రీన్‌పై కనపడడం గురించి ఆమె ‘ఆయన దూరమయ్యాక మొదటి సంవత్సరం చాలా కష్టంగా గడిచింది.
మూడో ఏట నుంచి కాస్త ఫర్వాలేదు. అవసరమైనప్పుడు థెరపీలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విషయంలో పని చేస్తూ ఉండడమే నా మోటివేషన్. ప్రతిసారి బెటర్‌గా చేస్తూ పోవాలి. నా పిల్లలే నాకు బెస్ట్ మోటివేటర్స్. వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తా. నేను బతకడానికి, నా పని కంటిన్యూ చేయడానికి వాళ్లే కారణం. అంతేకాదు, వాళ్లను చూసే ధైర్యం, శక్తిని తెచ్చుకుంటా. వాళ్లకు నేను ఒక మంచి పేరెంట్‌గా ఉండడం అవసరం” అని ఓ సందర్భంలో చెప్పింది.
సోషల్ మీడియా హెల్ప్ అయింది
సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు. కానీ, 30లలో నేను చేసే పని గురించి ఎక్కువ ఆలోచించేదాన్ని. ఎందుకంటే నాకు పనిలో ఇన్సెక్యూరిటీ ఉండేది. ఆ టైంలో ఎన్నో ఆలోచనలతో సతమతమయ్యేదాన్ని. ప్రతి నిమిషం, పని పూర్తి అవుతుందనే అనుకునేదాన్ని. కానీ, 40 ఏండ్ల తర్వాత ‘నేను అనుకున్న పని అద్భుతంగా చేయగలను’ అనే సిచ్యుయేషన్‌కి వచ్చా. ఇప్పుడు నాకు చేతి నిండా పనుంది. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్‌లో ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఎంతోమంది ఆర్టిస్ట్‌లు బయటికొస్తున్నారు. నాక్కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. సోషల్ మీడియా మీద కొందరికి చెడు అభిప్రాయం ఉంటుంది. కానీ, నా విషయంలో అయితే సోషల్ మీడియా చాలా మోటివేట్ చేసింది. నా ఫిట్నెస్ జర్నీకి చాలా హెల్ప్ అయింది.’’
..ఎంతో నేర్చుకున్నా
‘‘ఈ జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. కష్టతరమైన పరిస్థితుల్ని చూశా. మనం చివరిగా చేసిన పనినే చాలామంది గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయంలో నన్ను గుర్తుపెట్టుకోవడానికి నా వెనక చాలా వర్క్స్ ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదిగేటప్పుడు ఆ అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. అదే పడిపోతున్నప్పుడు ఆల్రెడీ మంచి కాలం చూసినందుకు గర్వపడాలి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటాం. కష్టకాలం వచ్చినప్పుడు లైఫ్‌ని చూసే ఆలోచనా దృష్టి మారుతుంది. ఆ దృష్టితోనే సవాళ్లను చూస్తాం. నా లైఫ్‌లో ఎదుర్కొన్న వాటన్నిటి నుంచి ఎంతో నేర్చుకున్నా, దానివల్ల ఎదుగుతూనే వచ్చా.’’
అదే నా పుస్తకం
నేను రాసిన పుస్తకం పేరు ‘హ్యాపీ ఫర్ నో రీజన్’. సంతోషంగా ఉండడానికి కారణం అవసరం లేదు అని దానర్థం. శాంతి, సంతోషాన్ని మనలోనే వెతకాలి. సెల్ఫ్ లవ్, గ్రాటిట్యూడ్ అనేవి చాలా అవసరం. నిన్ను నువ్వు అంగీకరించడం సెల్ఫ్ లవ్‌లో భాగమే. ఆ తర్వాత నీ మీద నువ్వు ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. దాంతోపాటు కృతజ్ఙతాభావం చాలా కీలకంగా పనిచేస్తుంది. పాజిటివ్ మైండ్‌సెట్ మెయింటెయిన్ చేయడం వల్ల నెగెటివిటీ, కోపం, చిరాకు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు అని అందులో చెప్పాను. ఈ పుస్తకం చదివిన వాళ్లు చాలామంది స్ఫూర్తి పొందినట్లు వాళ్ల రివ్యూల్లో చెప్తుంటారు.