అఆలు దిద్దేటప్పటి నుంచే యాక్టింగ్​ వైపు

అఆలు దిద్దేటప్పటి నుంచే యాక్టింగ్​ వైపు

కొందరికి పెద్దయ్యాక ఏం అవ్వాలో అనే క్లారిటీ చిన్నప్పటి నుంచే ఉంటుంది. మరికొందరికి పెరిగేకొద్దీ రకరకాల ఇంట్రెస్ట్​లు మారుతుంటాయి. ఆ విధంగా కెరీర్​ సెలక్ట్​ చేసుకుంటారు కొందరు. అలానే సెలక్ట్​ చేసుకుంది బాలీవుడ్​ నటి షహానా గోస్వామి.

ఆరేండ్ల వయసులో అల్లరి, ఆటపాటలు వంటివి మామూలే. సినిమా అంటే కార్టూన్​లే. అది కమర్షియల్​ సినిమాలు అర్థం చేసుకునే వయసు కాదు. కానీ, షహానా మాత్రం ఆ వయసు నుంచే సినిమాలు చూడడాన్ని ఎంజాయ్ చేసేది. నటీనటుల్ని గుర్తుపట్టడం, వాళ్ల యాక్టింగ్, డాన్స్ ఇమిటేట్ చేయడం వంటివి చేసేది. అందులో తనకు ఇష్టమైన నటులు కూడా ఉండేవాళ్లు. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక్కదాన్నే థియేటర్​కు వెళ్లి సినిమాలు చూశా కూడా అంటున్న షహానా యాక్టింగ్ మీద ఉన్న ఇష్టంతో దాన్నే కెరీర్​గా ఎంచుకుంది. పర్ఫార్మెన్స్ ఉండే పాత్రలు, ఫిమేల్ లీడ్​ రోల్స్​లో ఆడియెన్స్​ను మెప్పిస్తోంది. ఈమె నటించిన ‘సంతోష్​’ సినిమా ఆస్కార్​ బరిలో ఉంది. షహానా సినిమా జర్నీ గురించి ఆమె మాటల్లోనే.. 

‘‘నేను పుట్టి పెరిగింది న్యూఢిల్లీలో. మా నాన్న ఓంకార్ గోస్వామి. ఎకానమిస్ట్, బిజినెస్  జర్నలిస్ట్. అమ్మ ఎడిటోరియల్ కన్సల్టెంట్​. నేను చిన్నప్పుడు ఢిల్లీలో ‘సర్దార్ పటేల్ విద్యాలయ’ అనే స్కూల్లో చదివా. ఆ తర్వాత ముంబయిలోని సోఫియా కాలేజీలో చదువుకున్నా. స్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఛాంపియన్​ని. స్కూల్లో జరిగే అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్​ బాల్, వాలీబాల్ పోటీల్లో జోనల్ లెవల్లో ఆడేదాన్ని. నేషనల్ ఆర్టిఫిషియల్​ వాల్ క్లయింబింగ్ కాంపిటీషన్​లో సెకండ్ పొజిషన్​లో నిలిచా. స్పోర్ట్స్​, ఆర్ట్స్​లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. గురు పద్మశ్రీ కిరణ్​ సెహగల్ దగ్గర పదేండ్లు ఒడిస్సీ నాట్యం నేర్చుకున్నా. వాళ్ల డాన్స్ ట్రూప్​తో కలిసి స్టేజ్​ షోలు చేశా. పన్నెండేళ్ల వయసులో మూడు వేల రూపాయల చెక్ అందుకోవడం నా మొదటి సంపాదన. 

అమ్మానాన్నలు కూడా యాక్టింగ్ చేశారు. అమ్మ ఇంకా యాక్టింగ్ చేస్తూనే ఉంది. డాన్స్​ కూడా చేస్తుంది తను. నన్ను ఇండిపెండెంట్​ అమ్మాయిగా పెంచారు. నాకు ‘ఫలానాది చేయాలని ఉంది’ అంటే ఇంట్లో ఎవరూ అడ్డు చెప్పరు. ‘నీకు నచ్చింది నువ్వు చెయ్యి’ అని ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నా ఫోకస్ అంతా ప్రొఫెషనల్ యాక్టింగ్ మీదే ఉండేది.


కాబట్టి ఆ ఇష్టంతోనే ముంబయిలో గ్రాడ్యుయేషన్​ పూర్తయ్యాక యాక్టింగ్​ని కెరీర్​గా ఎంచుకోవాలనుకున్నా. అందుకే చదువుతున్న రోజుల్లోనే యాక్టింగ్​లో జైమిని పాఠక్​ స్థాపించిన ‘వర్కింగ్ టైటిల్’ అనే థియేటర్​ గ్రూప్​లో ప్రొడక్షన్ అసిస్టెంట్​గా చేరా. తర్వాత కొన్నాళ్లకు వాళ్లకు చెందిన ‘సీగల్ అండ్ అరేబియన్ నైట్స్​ ప్రొడక్షన్స్​’లోనే నటించడం మొదలుపెట్టా. అలా థియేటర్​ సర్కిల్​లో షాను శర్మను కలిశా. ఆయన నన్ను నసీరుద్దీన్​ షా మొదటిసారి డైరెక్ట్​ చేస్తున్న ‘యూ హోతా తో క్యా హోతా’ సినిమాలో ఒక రోల్​ కోసం ఆడిషన్​కి పిలిచారు. అందులో ‘పాయల్’ అనే పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆ వెంటనే ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సినిమాలో చేశా. 

అయితే, నా మొదటి సినిమా షూటింగ్​లో నా పర్ఫార్మెన్స్ బాగుందనుకున్న సినిమాటోగ్రాఫర్..​ ‘రూ బా రూ’ సినిమాలో లీడ్​ రోల్​కి ఆడిషన్​ కోసం నన్ను రికమెండ్ చేశారు. అప్పటికి నా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి కాలేదు. మొదట ఒప్పుకున్న సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయితే ‘రూ బా రూ’లో తార రోల్​లో చేశా. ఆ పాత్రకు నటిగా నాకు మంచి పేరు వచ్చింది. దాంతో నేను అవకాశాల కోసం వెతుక్కోకుండానే ఎవరో ఒకరి ద్వారా అవకాశాలు వచ్చేవి. 

ఒక్క సినిమా... ఎన్నో అవార్డులు

ఇండస్ట్రీ ఫ్రెండ్స్ షాను శర్మ, సిమ్రాన్ ‘రాక్​ ఆన్’​ సినిమా కోసం యాక్టర్లను సెలక్ట్​ చేస్తున్న టైంలో డైరెక్టర్​ అభిషేక్​ కపూర్​కి నా పేరు సజెస్ట్ చేశారు. ఆ సినిమాలో ‘డెబ్బీ’ అనే పాత్ర నాది. నా కెరీర్​కి బ్రేక్​ ఇచ్చిన సినిమా ఇది. బాలీవుడ్​లో షహానా గోస్వామి అనే నటి ఉందని గుర్తింపు వచ్చింది. అందులో బెస్ట్​ పర్ఫార్మర్​గా (క్రిటిక్స్) ఫిల్మ్​ఫేర్ కూడా అందుకోవడం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే అప్పటివరకు ఏ సపోర్టింగ్​​ యాక్టర్​కి కూడా ఆ అవార్డ్​ దక్కలేదు. అంతేకాదు.. అదే సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్​గా ‘స్టార్​ స్క్రీన్​, లయన్ గోల్డ్, సినీబ్లిట్జ్’​ అవార్డులు అందుకున్నా. 

ఇతర భాషల్లో..

సినిమాలే కాకుండా మ్యూజిక్ వీడియోలు, కమర్షియల్ అడ్వర్టైజ్​మెంట్లలో కూడా నటించా. నా మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్​ ‘మిడ్​నైట్స్ చిల్డ్రన్’(2012). సల్మాన్​ రష్దీ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లిష్​ సినిమా ఇది. ఇందులో అమీనా పాత్ర చేశా. ఆ తర్వాత కూడా నేను హిందీతోపాటు ఇంగ్లిష్​, బెంగాలీ సినిమాల్లో యాక్ట్​ చేశా. ‘అండర్ కన్​స్ట్రక్షన్’ అనే బెంగాలీ సినిమాకి ఇస్లాంటిల్లా సినీఫోరం ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్​ దక్కింది.

2021లో వచ్చిన ‘బాంబే బేగమ్స్’, ‘ది లాస్ట్ అవర్’, ‘హుష్​ హుష్’ అనే సిరీస్​ల్లో నటించా. వాటిలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. అయితే కెరీర్​లో ఇంకా ఏదో సాధించాలనే తపనతో ముంబయి నుంచి పారిస్​ వెళ్లి, 2020లో ఇండియాకి వచ్చేశా. అదే ఏడు బ్రిటిష్ టెలివిజన్ డ్రామా మినీ సిరీస్​ ‘ఎ సూటబుల్ బాయ్​’లో మీనాక్షి మెహ్రాగా చేశా. 

కానిస్టేబుల్ సంతోష్​

కానిస్టేబుల్​గా పనిచేస్తున్న వ్యక్తి మరణంతో ఆ ఉద్యోగాన్ని అతని భార్యకు ఇస్తారు. అప్పటివరకు గ్రామంలో భర్త చాటు భార్యగా ఉన్న ఆమె తనకు ఏమాత్రం పరిచయం లేని కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. ఈ సినిమా డైరెక్టర్ సంధ్యాసూరి. ప్రతి రోజు షూటింగ్​లో ఎంజాయ్ చేస్తే పనిచేసేవాళ్లం. ‘సంతోష్ సైని’ పాత్ర చేస్తున్నప్పుడు నా నటనను మెరుగుపరుచుకునే అవకాశం దక్కింది.

ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు ఎలా ఉంటుందో అని ఆలోచించలేదు. కానీ చాలా కష్టమైన సబ్జెక్ట్​ అనిపించింది. అందుకే రెస్ట్​ లేకుండా షూటింగ్​ చేశాం. రెండు నెలలు షూటింగ్ పూర్తయ్యాక వేసవి కాలం వచ్చింది. ఒకవైపు ఎండ, వేడి ఇబ్బందిపెడుతుంటే మరోవైపు భారీ వర్షాలు కూడా పడ్డాయి. అలాంటి టైంలో కూడా టీం అంతా ఎంతో ఎనర్జిటిక్​గా షూటింగ్ చేశాం. మధ్యమధ్యలో చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకుండా అందరం కలిసి ఒకే లక్ష్యంతో పనిచేశాం. షూటింగ్ చేస్తున్నప్పటికీ ఇలాంటి సినిమాలు ఇండియాలో రిలీజ్​ అవుతాయా! అనే అనుమానం నా బుర్రలో తిరుగుతుండేది.

ఎందుకంటే ఇండియాలో సినిమా అనేది ఒక బిజినెస్​. యూరప్​లో దాన్ని ఒక ఆర్ట్​ ఫామ్​గా చూస్తారు. గవర్నమెంట్​ సపోర్ట్​తో ‘సంతోష్​’ లాంటి కథలు, పాత్రలు తెరమీదకి తీసుకొస్తారు. ఇలాంటి కథలు మాస్​ని అట్రాక్ట్ చేయలేవు. ఇంటర్నేషనల్ గుర్తింపు లేదా అవార్డులు వస్తే.. అప్పుడు జనాల్లో ఆ సినిమా చూడాలన్న క్యూరియాసిటీ వస్తుంది. అందుకే సబ్జెక్ట్​ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మా సినిమా ఆస్కార్​ వరకు వెళ్లిందంటే ఆశ్చర్యపోయా.

ఇది నాకు చాలా స్పెషల్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం టీం అంతా ఎంతో కష్టపడి పనిచేశాం. కేన్స్​లో ప్రీమియర్ షో, ఇప్పుడు ఆస్కార్​ నామినేషన్స్​కు వెళ్లడం ఒక రివార్డ్​లా అనిపిస్తుంది. డైరెక్టర్​ సంధ్యను చూస్తే గర్వంగా ఉంది. సంతోష్​ సినిమా కాన్సెప్ట్ ఎంచుకోవడం, డైరెక్షన్​ చేయడం అంటే మామూలు విషయం కాదు. 

ఇలా ఆలోచిస్తా..

యాక్టింగ్ విషయానికొస్తే.. ఏదైనా సీన్​ చేయడానికి ముందు ఆ సీన్​ని మైండ్​లో ఊహించుకునేదాన్ని. ఆ సిచ్యుయేషన్​లో ఆ పాత్ర ఎలా రియాక్ట్ అవుతుంది? అనేది అర్థం చేసుకున్నాకే యాక్టింగ్ చేసేదాన్ని. ఇప్పుడైతే... ఆ క్షణం ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుని, ఆ ఎమోషన్ పట్టేసి నటించడం అలవాటు చేసుకున్నా. ఇందులో కూడా అలానే చేశా. ఏ ప్రాజెక్ట్​లో అవకాశం వచ్చినా ‘ఈ ప్రాజెక్ట్​కి నేను సూట్​ అవుతానా? ఈ పాత్ర నాకు సూట్ అవుతుందా?’ అని ఆలోచిస్తా.

ఈ రెండు విషయాలు ఆలోచించాకే కథలు సెలక్ట్ చేసుకుంటా. కొన్ని పాత్రలకు నిజ జీవితంలో నేనెలా ప్రవర్తిస్తానో? లేదా ఎలా ఆలోచిస్తానో? అలానే ఉంటాయి. ఉదాహరణకు ఫేమస్ కమెడియన్ కపిల్ శర్మతో ‘జ్విగాటో’ అనే సినిమాలో నటించా. అందులో నా పాత్ర పేరు ప్రతిమ. నా ఆలోచనలు కూడా ప్రతిమ క్యారెక్టర్​లానే ఉంటాయి. ఆ పాత్ర నా పర్సనాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. 

సినిమా తీయాలని...

నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో చాలావరకు విమెన్​ డైరెక్టర్​లతోనే పనిచేశా. ఫిమేల్ సెంట్రిక్​ సినిమాల్లో నటించా. అలాంటి సినిమాల్లో నటించాలని చాలామంది నటీమణులకు ఉంటుంది. కానీ, అలాంటి కథలు రావడం తక్కువ. ఇప్పుడు అలాంటి కథలు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇంపాక్ట్​ క్రియేట్ చేసే పాత్రలు చేసే అవకాశం నాకు రావడం హ్యాపీగా ఉంది. సినిమా తీయడం అంటే ఇష్టం. భవిష్యత్​లో అది కూడా చేయాలనుకుంటున్నా. యాక్టింగ్, డైరెక్షన్ చేయాలి అనేది చిన్నప్పటి నుంచి నాకున్న కోరిక” అని యాక్టింగ్​ జర్నీ గురించి చెప్పింది షహానా. 

చాలా ఇంట్రెస్ట్

ప్రస్తుతానికి​ ఫిట్​నెస్​ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకే జిమ్​లో వర్కవుట్స్​, యోగా వంటివి రెగ్యులర్​గా చేస్తున్నా. అలాగే నేచర్​ అంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు నేచర్​కి సంబంధించి బ్యూటిఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తుంటా. పెయింటింగ్, స్కెచింగ్, ఎంబ్రాయిడరీ వంటి క్రియేటివ్​ ఆర్ట్స్​ను కూడా ఇంట్రెస్ట్​గా చేస్తా. ట్రావెలింగ్​ అంటే కూడా ఎంతో ఆసక్తి. ఆరేండ్ల వయసులో నాన్నతో కలిసి మొదటిసారి ట్రెక్కింగ్​కి వెళ్లా. అప్పటి నుంచి ట్రెక్కింగ్ అంటే ఇష్టం పెరిగింది. అందుకని ట్రెక్కింగ్​ కోసమే ట్రావెలింగ్ చేస్తుంటా.