బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సరిగ్గా 30 ఏళ్లు. 1992 జూన్ 25న ‘దీవానా’ సినిమాతో ఆయన వెండితెరపై తొలిసారి తళుక్కుమన్నారు. అందులో హీరో రిషి కపూర్ దే మెయిన్ రోల్. తర్వాతి రోల్ ను షారుఖ్ పోషించారు. హీరోయిన్ గా దివ్య భారతి నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ‘దీవానా’ లో మెయిన్ రోల్ లేకున్నా.. ప్రేక్షకుల మదిని దోచేలా షారుఖ్ నటించారు. 1980వ దశకంలో టీవీ సీరియల్ తో నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయనకు ‘దీవానా’ టర్నింగ్ పాయింట్ గా మారిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఇది షారుఖ్ తో పాటు దర్శకుడు రాజ్ కన్వర్ కు కూడా తొలి చిత్రమే. 1992లో ‘బేటా’ మూవీ తర్వాత ఎక్కువ కలెక్షన్స్ చేసింది దీవానా సినిమానే. దీనికి ఫ్రీమేక్ గా తెలుగులో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ‘ప్రేమాయణం’ మూవీ రూపొందింది. ఆ తర్వాత వెంటనే షారుఖ్ కు స్టార్ డమ్ రాలేదు.
తొలినాళ్లలో నెగెటివ్ రోల్స్ ..
తొలి నాళ్లలో చాలా మూవీస్ లో నెగెటివ్ రోల్స్ ప్లే చేయాల్సి వచ్చింది. డర్, బాజీగర్, అంజామ్ సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలనే షారుఖ్ పోషించారు. ఆ తర్వాత క్రమంగా రొమాంటిక్, కామెడీ సినిమాల వైపు ఆయన అడుగులు పడ్డాయి. దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, పర్ దేశ్, మొహబ్బతే సినిమాలతో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు. బాలీవుడ్ బాద్షా మారిపోయాడు. ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ . దీని ద్వారా బాలీవుడ్ లో షారుఖ్ అగ్రతారగా మారాడు. సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో సినిమాలు కూడా షారుఖ్ తీశారు. దీంతో మంచి నిర్మాతగానూ ఆయనకు పేరొచ్చింది.
హిట్ కోసం ఉవ్విళ్లూరుతూ..
2013లో ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమా భారీ విజయాన్ని అందించింది. నాటి నుంచి నేటి దాకా బాలీవుడ్ బాద్ షాకు ఆ స్థాయి హిట్ దక్కలేదు. మరో హిట్ కోసం ఉవ్విళ్లూరుతున్న షారుఖ్.. జవాన్, డంకీ, పఠాన్ సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఇవన్నీ 2023లోనే రిలీజ్ కాబోతున్నాయి. వీటన్నింటిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. పఠాన్ మూవీ 2023 జనవరి 25న, జవాన్ మూవీ 2023 జూన్ 2న, డంకీ మూవీ 2023 డిసెంబరు 22న విడుదల కానున్నాయి. ఇక త్వరలో విడుదలకానున్న హీరో మాధవన్ సినిమా ‘రాకెట్రీ ; ద నంబీ ఎఫెక్ట్’, అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చద్దా, రణ్ బీర్ నటించిన బ్రహ్మాస్త్ర, సల్మాన్ ఖాన్ మూవీ టైగర్3 లలోనూ ప్రత్యేక పాత్రల్లో షారుఖ్ కనిపించబోతున్నారు.