పరిచయం : లాపతా లేడీస్​ ఆస్కార్​కు వెళ్లారు!

పరిచయం : లాపతా లేడీస్​ ఆస్కార్​కు వెళ్లారు!

నితాన్షి గోయల్​... ఈ పేరు చదివితే ఆమె ఎవరనేది వెంటనే గుర్తురాకపోవచ్చు. కానీ ఫూల్​కుమారి అంటే మాత్రం కొందరి బుర్రల్లో తళుక్కున మెరుస్తుంది ‘లాపతా లేడీస్​’ సినిమాలో ఆమె రూపం. ఇండియా నుంచి ‘లాపతా లేడీస్’ ఆస్కార్​కు​ అఫీషియల్​ ఎంట్రీ అయ్యింది. పదహారేండ్ల వయసులోనే ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న  ఆమె రియల్​లైఫ్​​ ఇది...

ఉత్తరప్రదేశ్​​, నోయిడాలో పుట్టిన నితాన్షికి చిన్నప్పట్నించీ కూడా టీవీలో కనిపించాలి, స్టేజ్​ మీద పర్​ఫార్మెన్స్​ చేయాలనే కోరిక బలంగా ఉండేది. ‘‘అందుకు తగ్గట్టే ఇంటర్​ స్కూల్​ డాన్స్​ లేదా డ్రామా పోటీల్లో పార్టిసిపేట్​ చేసేదాన్ని. అలా పార్టిసిపేట్​ చేయడమే కాదు ప్రైజ్​లు గెలుచుకునేదాన్ని. నాలోని ఆసక్తిని, ఇంట్రెస్ట్​ను మా అమ్మానాన్న గమనించారు. అర్థంచేసుకున్నారు. 

అందుకే వాళ్లు చేస్తున్న పనులు వదులుకుని, ఊరిని వదిలి మరీ నా కోసం ముంబయికి షిఫ్ట్​ అయిపోయారు. ఇండస్ట్రీలోకి జూనియర్​ ఆర్టిస్ట్​గా అడుగుపెట్టా. ఫిల్మ్​ సెట్స్​కి వెళ్లినప్పుడల్లా మా ఫ్యామిలీ అందరం వెళ్లేవాళ్లం. నేను అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందనేది జాగ్రత్తగా గమనించేదాన్ని. అది చూశాక నటించాలనే కోరిక బలపడింది.

అలా షూటింగ్స్​కి వెళ్లినప్పుడు ‘పీకే’ సినిమా సెట్స్​లో అమీర్​ఖాన్​​ను మొదటిసారి చూశా. అప్పుడు ‘లవ్​ ఈజ్​ ఎ వేస్ట్​ ఆఫ్​ టైం...’ అనే పాట షూటింగ్​ చేస్తున్నారు. నేను, మా అమ్మానాన్న ఆడియెన్స్​లో కూర్చున్నాం. అప్పుడు నా సీటు అమీర్​ సర్​ పక్కనే. ఒకసారి సడెన్​గా వెనక్కి తిరిగి చూశారు. ఆయన ఫేస్​ని స్పష్టంగా చూడడం అదే మొదటిసారి. ఆ తరువాత ఆయన దగ్గరకెళ్లి టిష్యూ పేపర్ మీద ఆటోగ్రాఫ్​ ఇవ్వమని ​ అడిగా. ఆయన ఒప్పుకుని ఎంతో ఇష్టంగా ఆటోగ్రాఫ్​ ఇచ్చారు. ఆ తరువాత ఆ ఆటోగ్రాఫ్​  పేపర్​ ఎలా పోయిందో... పోయింది. 

అది పోయినందుకు మూడు గంటలు గుక్కపట్టి ఏడ్చా. కట్​ చేస్తే... 2021లో ‘‘అమీర్​ సర్​ సినిమాలో చేసేందుకు నిన్ను ఫైనల్​ చేశారు” అనే ఫోన్​ కాల్​ రావడం. అప్పుడు నాకు ‘బలంగా ఒక విషయాన్ని నమ్మితే అది నిజం అవుతుంది’ అనిపించింది. ‘లాపతా లేడీస్​’ కోసం నితాన్షి నుంచి పూర్తిగా ఫూల్​కుమారిగా మారిపోయా. అందుకు నా పర్ఫార్మెన్స్​, లుక్​ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నా. 

ప్రాంక్​ ఆడిషన్ కాల్​​ అనుకున్నా

లాపతా లేడీస్​లో ఫూల్​ కుమారి రోల్​ ఆడిషన్​కి వెళ్లినప్పుడు అది అమీర్​ ఖాన్​ ప్రొడక్షన్, కిరణ్​ రావ్​ డైరెక్షన్​లో వస్తున్న సినిమా అని నాకు తెలియదు. ఆడిషన్​ కోసం మూడు పెద్ద సీన్స్​ ఇచ్చారు. వాటిని చదివాక ఈ ప్రాజెక్ట్​లో నేనెలాగైనా ఉండాల్సిందే అనుకున్నా. అందుకోసం ఆ రాత్రంతా ప్రిపేర్​ అయ్యా. పాత సినిమాలు చూశా. తెల్లారి నిద్రలేచి ఫూల్​లా రెడీ అయ్యా. నా దగ్గర చీర లేక లెహంగా, దుపట్టాను కట్టుకుని రెడీ అయ్యా. అయితే ఈ ఆడిషన్​ కొవిడ్​ టైంలో చేయాల్సి వచ్చింది. అందుకని యూట్యూబ్​ వీడియో లింక్​ పంపి, అటు నుంచి ఏం రెస్పాన్స్​ వస్తుందా? అని చాలా ఎదురుచూశా.

 వీడియో పంపిన కొన్ని గంటల తరువాత దాదాపు సాయంత్రం టైంలో ‘‘అమిర్​ ఖాన్, కిరణ్​​ నిన్ను కలవాలి అనుకుంటున్నారు’’ అని ఫోన్​ కాల్​ వచ్చింది. అది ప్రాంక్​ కాల్​ అనుకున్నా! అదే విషయం వాళ్లతో చెప్పి ‘‘మీరు మాట్లాడుతుంటే నా మైండ్​లో ఒకే అమీర్​ ఖాన్​ వస్తున్నారు. మీరు ఏ అమీర్​ ఖాన్​ గురించి మాట్లాడుతున్నారో చెప్పండి’’ అన్నా. అప్పుడు వాళ్లు ‘‘నువ్వు అనుకుంటున్న అమీర్​ఖాన్​ నుంచే ఈ ఫోన్​ కాల్’’​ అన్నారు. నేను నమ్మలేకపోయా. ఆశ్చర్యపోయా. ఆయన్ని కలిసేందుకు వెళ్లినప్పుడు చాలా నెర్వస్​ అయ్యా. ఆయన మాట్లాడుతూ ‘నువ్వెంత మంచి ఆడిషన్​ ఇచ్చావో తెలుసా’ అన్నారు. ఆ తరువాత మా అమ్మ దగ్గరకి వెళ్లి ‘మీ దగ్గర వజ్రం ఉంది’ అన్నారు.

నిజాయితీగా... 

ప్రతీ ఆర్టిస్ట్​ అమీర్​ఖాన్​తో పనిచేయాలి అనుకుంటారు. నా డెబ్యూ ఫిల్మ్​కే అంత పెద్ద వ్యక్తితో పనిచేయడం చాలా గొప్పగా అనిపించింది. నటుడిగా అమీర్​ ఖాన్​ అందరికీ ఫేవరెట్​. అయితే ఆయన మనిషిగా కూడా చాలా గొప్పవాడు. ‘లాపతా లేడీస్’ ప్రమోషన్స్​ ​భోపాల్​లో చేస్తున్నప్పుడు ఆయన్ని ‘‘ఎప్పుడూ మీరు నవ్వుతూ ఉంటారు. రహస్యం ఏంటి?’’ అని అడిగారు. అందుకు ఆయన “ఇలా ఉండడం మా అమ్మ నాకు నేర్పించింది.

 తను ఎప్పుడూ ‘నువ్వు ఎవరి మనసుల్ని నొప్పించొద్దు. ఒకవేళ నీ తప్పు ఉంటే వెంటనే వెళ్లి క్షమించమని అడుగు. నీ ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలి’ అని చెప్పింది. ఆమె మాటలే నేను ఫాలో అవుతున్నా. అమ్మ నేర్పించిన అద్భుతమైన ఆ విషయాన్ని నాకు తోడుగా ఉంచుకున్నా. భవిష్యత్తులో కూడా అలానే ఉంటా” అని చెప్పారు.

మొరటుగా కనిపించేందుకు...

ఫూల్​ కుమారి పాత్రకు సెలక్ట్​ అయితే అయ్యా కానీ చాలా ఛాలెంజెస్​ ఎదుర్కొన్నా.  అందులో ఒకటి ముఖం ట్యాన్​ చేసుకోవడం. నా స్కిన్​ సాఫ్ట్​గా, మెరుస్తుంటుంది. మెరిసే చర్మాన్ని ట్యాన్​ చేసుకునేందుకు మూడు నెలలపాటు ప్రతిరోజూ రెండు నుంచి మూడు గంటలు ఎండలో ఉండేదాన్ని. అంటే 2001లో ఊరి ఆడవాళ్లు ఎలా ఉంటారో ఆ లుక్​ కోసం అన్నమాట. నా నేచురల్​ అప్పియరెన్స్​కి సినిమాలో క్యారెక్టర్​కి చాలా తేడా ఉంటుంది. 

సినిమా షూటింగ్​ అయిపోయాక నా ఒరిజినల్​ స్కిన్​ టోన్​కి మళ్లీ వచ్చేందుకు ఐదు నెలలు టైం పట్టింది. ఇలాచేయడానికి మాత్రం అమీర్​ సర్​​ నుంచి ఇన్​స్పైర్​ అయ్యానని చెప్తా. ఎందుకంటే ‘దంగల్’​ సినిమాలో చేసినప్పుడు​ మూడు నెలల్లో బరువు పెరిగారు అమీర్​. ఆ తరువాత మళ్లీ తగ్గారు. ఆ డెడికేషన్​ ఫాలో కావాలి అనుకున్నా. అలా ఉండడం వల్ల సినిమాకు వాస్తవరూపం ఇచ్చినట్టు అవుతుంది.

ఈ పాత్రలో నాకు ఎదురైన మరో ఛాలెంజ్​ ఫూల్​ కుమారి బాడీ లాంగ్వేజ్​. ఫూల్​ తన కథను బాడీ లాంగ్వేజ్​, కళ్లతో చెప్తుంది. బాడీ లాంగ్వేజ్​ మొదట్లో కాస్త కష్టంగా అనిపించింది. దానికోసం నేను చాలా ప్రిపేర్​ అయ్యా. ఆ కాలంలో ఆడవాళ్లు ఎలా ఉండేవారో తెలుసుకునేందుకు ‘బాలికా వధు, సూయీ ధాగా, నదియోం కే పార్’​ వంటి పాత సినిమాలు చూశా. అలా ఫూల్​ క్యారెక్టర్​కి ఒక మ్యాజిక్​ తేగలిగా. ఫూల్​కుమారి క్యారెక్టర్​ నాకు చాలా దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. నేను 2024 వెర్షన్​ ఫూల్​ కుమారి. ఫూల్​ ఆశాజీవి. అలాగే అమాయకంగా ఉంటుంది​. ఆ లక్షణాలు నాకు చాలా రిలేట్​ అవుతాయి.

అవి మర్చిపోలేను...​

ఫూల్​ మొదటి జీతం తీసుకునే సీన్​ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె స్వతంత్రంగా ఉండడానికి అది మొదటి అడుగు. తన కాళ్ల మీద తను ఎలా నిలబడొచ్చో అర్థమవుతుంది ఆమెకు. ఆ సీన్​ చాలా అందంగా ఉంటుంది. ఈ ఒక్క సీన్​కే ఫ్యాన్​ బేస్​ ఉంది! ఆ సీన్​ గురించి చాలా మంచి కామెంట్స్​ చదివా. అలాగే మంజు మాయికి గుడ్​ బై చెప్పేది చాలా ఎమోషనల్​ సీన్​. అదే లాస్ట్​ సీన్ కూడా​. దాంతో మాకు అప్పటికే ‘గుడ్​ బై’ చెప్తున్న ఫీలింగ్​ వచ్చేసింది. యాక్షన్​ చేస్తున్నప్పుడు మంజు మాయి, నేను... ఇద్దరం చాలా ఎమోషనల్​ అయ్యి సీన్​ చేస్తూ ఏడవడం మొదలుపెట్టాం.

నితాన్షియన్స్​ ఇచ్చిన సపోర్ట్​ ఇది...

ఈ రోజున నేను ఇలా ఉన్నానంటే అది ఫ్యాన్స్​ వల్లనే. నేను చేసిన టీవీ షో, పాట లేదా లా పతా లేడీస్​ సినిమా... ఇలా ఏదైనా కావచ్చు ఫ్యాన్స్​ ఎప్పుడూ నన్ను సపోర్ట్​ చేశారు.  నా మీద విపరీతమైన ప్రేమ కురిపించారు. సోషల్​ మీడియాలో నా ఫాలోయర్స్​ నన్ను ‘నిట్స్’ అని పిలుస్తారు. వాళ్లని నేను ‘నితాన్షియన్స్​’ అని ప్రేమగా పిలుచుకుంటా. ఈ సోషల్​ మీడియా ఫ్యామిలీని కరోనా లాక్​డౌన్​ టైంలో ఏర్పరచుకున్నా. ఈ ప్లాట్​ఫామ్​ ద్వారా నన్ను నేను నిరూపించుకోవాలి అనుకున్నా. నా ఫాలోయర్స్​ నా గొంతును చాలా ఇష్టపడతారు. 

అందుకే కొందరు నా గొంతును వాళ్ల ఫోన్​ కాలర్​ ట్యూన్​గా పెట్టుకున్నారు. నా వీడియోలను స్టేటస్​గా పెట్టుకున్నారు. నేను చెప్పే మోటివేషనల్​ కోట్స్​ చాలా మందికి నచ్చేవి. అలా నా సోషల్​ మీడియా ఫ్యామిలీ విస్తరిస్తూ పోయింది. అంత పెద్ద సోషల్​ మీడియా ఫ్యామిలీ ఉండడం గర్వంగా అనిపిస్తుంది నాకు. నటిగా నా జర్నీలో వాళ్లది చాలా ముఖ్య పాత్ర.

చైల్డ్​హుడ్​ మిస్​ కాలేదు 

చిన్నప్పట్నించీ నేను ఎంటర్​టైన్​మెంట్​ ఫీల్డ్​లో ఉన్నా కాబట్టి నా బాల్యాన్ని మిస్​ అయ్యానని కొందరు అనుకుంటుంటారు. ఇదే విషయాన్ని అడిగారు కూడా. కానీ నేనలా ఏం మిస్​ కాలేదు. నా పని నాకు ఇచ్చిన అవకాశాలకు, ఎక్స్​పీరియెన్స్​లకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటా. బాల్యం,  పని..​ రెండింటినీ బ్యాలెన్స్​ చేయడంలో కొన్ని ఛాలెంజెస్​ ఎదురయ్యాయి. కానీ ఈ జర్నీలో చాలా విలువైన విషయాలు నేర్చుకోగలిగా. 

నా ప్యాషన్​ను చేరుకోగలిగా. చిన్నదాన్ని కాబట్టి ఈ ఇండస్ట్రీలో ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నా అనుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలోకి ఎవరు అడుగుపెట్టినా​ ఒత్తిడి ఉంటుంది. దానికి వయసుతో సంబంధం లేదు. అందరికీ ఒకేలా ఉంటుంది అనిపిస్తుంది నాకయితే. అందులోనూ నాకు చాలా బలమైన సపోర్ట్​ సిస్టమ్​ ఉంది. సక్సెస్​తో పాటు ఎదురైన ఛాలెంజ్​లు, బాధ్యతలను సరిగా బ్యాలెన్స్​ చేయడంలో నా కుటుంబం, స్నేహితులు, గురువులు నాకు సాయం చేశారు. అందుకే వర్క్​, వ్యక్తిగత జీవితానికి మధ్య బ్యాలెన్స్​ను ఎటువంటి ఒత్తిడి లేకుండా దాటగలుగుతున్నా.

ఒకప్పటిలా చేయట్లేదు 

బాలీవుడ్​ నటి రేఖ అంటే నాకు చిన్నప్పట్నించీ చాలా ఇష్టం. చాలామంది ‘రేఖలా ఉన్నావ’ని చెప్పేవాళ్లు. ఒకప్పుడు ఆమెను బాగా ఇమిటేట్​ చేసేదాన్ని. కానీ ఇప్పుడు మానేశా. ఎందుకంటే మరో రేఖ ఉండడం అనేది అసాధ్యం. కంగనా రనౌత్​ రోల్స్​ చూసి చాలా ఇన్​స్పైర్​ అవుతా. ఆమె చేసిన ‘క్వీన్​, మణికర్ణిక’ సినిమాలు బాగా నచ్చుతాయి. అలాగే ప్రియాంక చోప్రా ‘బర్ఫీ’ సినిమాలో చేసిన రోల్​ ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ల పర్ఫార్మెన్స్​ అనేది వాళ్లలోని నటనా నైపుణ్యాన్నే కాకుండా శక్తివంతమైన సందేశాలను పంపుతాయి. వాళ్ల హావభావాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపుతారంటే అతిశయోక్తి కాదు. ఐదారేండ్లలో షారుఖ్​ ఖాన్​తో కలిసి నటించాలి అనుకుంటున్నా. ఆయనలా నేను కూడా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకోవాలి అనుకుంటున్నా.

చదువు ఆపను

యాక్టింగ్​లో ఉన్నానని చదువు నిర్లక్ష్యం చేయను. షూటింగ్​ షెడ్యూల్​ ఉన్నా చదువు విషయంలో కాంప్రమైజ్​ కాలేదు. ఫిల్మ్​ షూటింగ్​ అప్పుడు లొకేషన్లో చదువుకున్నా. లాపతా లేడీస్​ షూటింగ్​ మొదలయ్యే ముందు ఎగ్జామ్స్​ రాశా. షూటింగ్​ పూర్తయిన తరువాతి రోజు తొమ్మిదో తరగతి ఫైనల్​ ఎగ్జామ్స్​ రాశా. షాట్స్​ మధ్య బ్రేక్​ టైంలో ఎగ్జామ్​కి ప్రిపేర్​ అయ్యేదాన్ని. నాతో పాటు సైన్స్​, లెక్కల పుస్తకాలు షూటింగ్​కి తీసుకెళ్లేదాన్ని.

నేను ఎగ్జామ్స్​ రాస్తున్నప్పుడు ఒక టీచర్​ నా దగ్గరకొచ్చి ‘నువ్వు మంచి పని చేశావు’ అన్నారు. అక్కడున్న ఇన్విజిలేటర్​ ‘‘ఆమెను ముందు ఎగ్జామ్​ రాయనివ్వండి. ఆ తరువాత అందరం తనతో మాట్లాడొచ్చు. సెల్ఫీస్​ కూడా తీసుకోవచ్చు” అన్నారు. ఎగ్జామ్​ రాశాక వాళ్లంతా నాతో మాట్లాడారు. సినిమా దేని గురించని అడిగారు. కానీ సినిమా సబ్జెక్ట్​ గురించి నేనేమీ చెప్పలేదప్పుడు. ఇప్పుడు వాళ్లంతా సినిమా చూసే ఉంటారు అనుకుంటున్నా. ఇప్పుడు కామర్స్ సబ్జెక్ట్​తో పన్నెండో తరగతి ​చదువుతున్నా. వచ్చే ఏడాది జరగబోయే బోర్డ్​ ఎగ్జామ్స్​ రాస్తా. 

ఆ రివ్యూలతో...

లాపతా లేడీస్​ సినిమా గురించిన వేల కొద్దీ రివ్యూలు వచ్చాయి. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. పాజిటివ్​ ఫీడ్​ బ్యాక్​ ఇచ్చిన ప్రేక్షకులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటా. నా హార్డ్​ వర్క్​, డెడికేషన్​కు దొరికిన గిఫ్ట్​ అది. రివ్యూలనేవి చేస్తున్న పనిలో నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి సాయం చేస్తాయి. లాపతా లేడీస్​ సినిమాలో చేస్తున్నప్పుడు నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. 

వాటిలో అమీర్​ సర్​ చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నా. అదేంటంటే.. ‘‘సీన్​ చేసేటప్పుడు పర్ఫెక్షన్​ గురించి కాకుండా ఆ సీన్​లో మ్యాజికల్​ మూమెంట్​ ఎలా తేవాలని చూస్తా” అన్నారాయన. అలా ఆలోచించడం వల్ల  అప్పటికప్పుడు జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి లోపాలు లేకుండా నటించే అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో కూడా ఛాలెంజ్​ ఉన్న మంచి రోల్స్​ చేసేందుకు ట్రై చేస్తా. అలాగైతేనే నాతో పాటు క్యారెక్టర్స్​ను కూడా ఎక్స్​ప్లోర్​ చేసే వీలుంటుంది.

విలువైన విషయాలెన్నో...

చిన్నప్పట్నించీ నేను యాక్టింగ్​లో ఉన్నా కాబట్టి ‘‘బాల్యాన్ని మిస్​ అయ్యావా?’ అని అడుగుతుంటారు. కానీ నేనలా ఏమీ మిస్​ కాలేదు. ఎందుకంటే నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తున్నా. నేను చేస్తున్న పని నాకు ఇచ్చిన అవకాశాలు, ఎక్స్​పీరియెన్స్​లకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటా. అలాగని ఛాలెంజెస్​ ఎదురు కాలేదని చెప్పను. ఎదురయ్యాయి. కానీ ఈ జర్నీలో చాలా విలువైన విషయాలు నేర్చుకోగలిగా. ఒకరకంగా చూస్తూ ఎంటర్​టైన్​మెంట్​ రంగంలోకి రావాలనే నా కోరిక ​చిన్నవయసులోనే తీరడం హ్యాపీ కదా!

తెలుగు తెలుసు​

తెలుగు, కొరియన్​ భాషలను నేర్చుకోవడం అనేది నాకు ఈ ప్రపంచంలో మరో వైపు తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చింది. టాలీవుడ్​లో, కొరియన్​ సినిమాల్లో నటించడం వల్ల ఆయా సంస్కృతులు, పరిశ్రమలో లోతైన విషయాలు తెలిశాయి. పలు భాషలు, సంస్కృతుల్లో కలిసిపోవడం నాకు చాలా ఇష్టం. ఇలాంటివే నా జర్నీలో ఎదిగేందుకు అంతులేని అవకాశాలు ఇస్తాయి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.

  • మిస్​ ప్యాంటలూన్స్​ జూనియర్​ ఫ్యాషన్​ ఐకాన్’​ టైటిల్​ను 2015లో గెలుచుకుంది. అప్పట్నించి పలు ఫ్యాషన్​ షోస్​లో పార్టిసిపేట్​ చేసింది. 
  • నాగార్జున - ఏక్​ యోధ, కర్మఫల్​ దాతా శని, ఇష్క్​బాజ్​, దయాన్​, పేష్వా బాజీరావ్’​ వంటి టీవీషోల్లో చేసింది. 
  • ఎంఎస్​ ధోని - ది అన్​టోల్డ్​ స్టోరీ’, ‘ఇందు సర్కార్’​, ‘హుర్​దంగ్’​ అనే సినిమాల్లో కూడా చేసింది.
  • నటి, మోడల్​గానే కాకుండా సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్​ కూడా ఫేమస్​. పది మిలియన్లకు పైగా ఇన్​స్టాగ్రామ్​ ఫాలోయర్స్​ ఉన్నారు. స్నాప్​చాట్​లో కూడా ఫాలోయింగ్​ ఎక్కువే.
  • 2022లో  యునైటెడ్​ బిజినెస్​ జర్నల్​ నితాన్షిని 20 ఏండ్ల కంటే తక్కువ వయసు ఉన్న 30 మంది ఇన్​ఫ్లుయెన్సర్​లలో ఒకదానిగా ఎంపిక చేసింది.
  • యునిసెఫ్​ వాళ్లు చేసిన ఒక అడ్వర్టైజ్​మెంట్​లో సింగర్​గా చేశా. నాలోని సింగింగ్​ స్కిల్​ వల్లనే ఆ రోల్​కి సెలక్ట్​ అయ్యా.
  • షారుక్​ ఖాన్​తో నటించాలనేది నా విష్​. అది ఐదారేండ్లు లేదా ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు. కానీ ఆయనతో నటించడం మాత్రం గ్యారెంటీ!

పూర్ణిమ