రాహుల్ నా అల్లుడు మాత్రమే.. ఫేవ‌రేట్ క్రికెట‌ర్‌ కాదు: సునీల్‌శెట్టి

ప్రస్తుత భారత జట్టులో నిలకడైన ఆటగాడు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు.. కేఎల్ రాహుల్. స్ట్రైక్ రేట్ పెద్దగా లేకపోయినా, భారీ ఇన్నింగ్స్‌లు ఆడకపోయినా సందర్భానికి తగ్గట్టు రాణించగల సమర్ధుడు. మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో మనం ఆస్ట్రేలియాపై విజయం సాధించామంటే అది రాహుల్ శ్రమే. 200 పరుగుల లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రాహుల్( 97 నాటౌట్) కడవరకూ క్రీజులో నిల్చొని విజయతీరాలకు చేర్చాడు. 

97*, 19*, 34*, 27, 39.. ఈ టోర్నీలో రాహుల్ స్కోర్లివి. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. మిగిలిన ఐదు ఇన్నింగ్స్ ల్లో మూడు సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ప్రదర్శన చాలు అతను ఎంత నిలకడగా ఆడతాడో చెప్పటానికి. ఇంత గొప్పగా ఆడే అల్లుడిని కాదని.. మరో ఆటగాడిని తన ఫేవ‌రేట్ క్రికెట‌ర్‌ ఎంచుకున్నారు.. అతని మామ సునీల్‌శెట్టి.

ఓ బాలీవుడ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సునీల్ శెట్టి.. త‌న ఫేవ‌రేట్ క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ కాదని తెలిపారు. రాహుల్ ఒక క్లాస్ ప్లేయ‌ర్ అన్న సునీల్‌శెట్టి.. అతను త‌న‌కు కొడుకుతో స‌మాన‌మ‌ని వెల్లడించారు. అయితే తాను మాత్రం కోహ్లీ ఆట‌నే ఎక్కువ ఇష్టపడతానని తెలిపారు. ఛేజింగ్‌లో కోహ్లి మాస్ట‌ర్ అని వర్ణించారు. రాణించాలనే కసి, నిల‌క‌డైన ఆట‌తీరు, భారీగా ప‌రుగులు చేయాల‌నే సంక‌ల్పం కోహ్లీని ఒక ఐకాన్‌ నిల‌బెట్టాయ‌ని సునీల్ శెట్టి చెప్పుకొచ్చారు.

ALSO READ :- బీజేపీలో శేరిలింగంపల్లి ముసలం : పార్టీకి విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం

చివరగా కోహ్లి త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ క్రికెట‌ర్ అని సునీల్ శెట్టి తెలిపారు. కాగా, 2023 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కోహ్లీ 6 మ్యాచుల్లో 354 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

సొంత అల్లుడు రాహుల్

కాగా, రాహుల్.. సునీల్ శెట్టి కూతురు అతియాశెట్టిని వివాహమాడిన సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ  జంట పెద్ద‌ల అంగీకారంతో పెళ్లిపీట‌లెక్కారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వీరి వివాహం జరిగింది.