ఆఫ్ఘనిస్తాన్‌లో బిజీగా ఉన్న ఓ మార్కెట్‌లో బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 17 మంది మరణించగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లోని బామియన్ ప్రావిన్స్‌లోని బామియన్ నగరంలో మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో వరుసగా రెండు బాంబు దాడులు జరిగాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ ట్రాఫిక్ పోలీసు కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పేలుడు కారణంగా అనేక దుకాణాలు మరియు వాహనాలు ధ్వంసమయ్యాయని అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తారిక్ అరియన్ తెలిపారు. రెండు బాంబులు వెంటవెంటనే పేలినట్లు ఆయన తెలిపారు.
ఈ దారుణ సంఘటనను ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ట్వీట్‌లో ఖండించారు. ‘బామియన్ నగరంలోని ఒక మార్కెట్ స్థలంలో జరిగిన ఘోరమైన పేలుడును తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశంలో శాంతిభద్రతలను పెంచడానికి విదేశీయులను త్వరగా కనిపెట్టాలని ఆఫ్ఘన్ సైనికులను కోరుతున్నాను. చనిపోయిన మరియు గాయపడ్డ వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
కాగా.. ఈ దాడికి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత తీసుకోలేదని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థ దేశంలోని మైనారిటీ షియా ముస్లింలపై యుద్ధం ప్రకటించినట్లు గమనించవచ్చు. బామియన్ ప్రావిన్స్‌లో షియా ముస్లింలే మెజారిటీ జనాభాగా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు మరియు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని శాశ్వతంగా అంతం చేయడానికి ఖతార్‌లో సమావేశాలు జరుగనున్న తరుణంలో ఈ బాంబు దాడి జరిగింది.
For More News..