పాకిస్తాన్​ మసీదులో పేలుడు.. నలుగురికి గాయాలు

పాకిస్తాన్​ మసీదులో పేలుడు.. నలుగురికి గాయాలు

పెషావర్: పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తున్​ఖ్వా ప్రావిన్స్​లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా  ఒక మసీదులో బాంబు పేలి ఒక సీనియర్ మతాధికారి సహా నలుగురు సహాయకులు గాయపడ్డారు. అఫ్గాన్​ సరిహద్దు ప్రాంతం దక్షిణ వజీరిస్తాన్​లోని మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో ఇంప్రూవైజ్డ్ ఎక్స్​ప్లోజివ్ డివైస్(ఐఈడీ) పేలడంతో జమియత్ ఉలేమా -ఎ ఇస్లాం(జేయూఐ) జిల్లా చీఫ్ మౌలానా అబ్దుల్లా నదీమ్ గాయపడ్డారని వానా జిల్లా ఎస్పీ ఆసిఫ్ బహదర్ తెలిపారు. 

గాయపడిన వారిని సహాయక సిబ్బంది వెంటనే వానా పట్టణంలోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ టెర్రరిస్టు సంస్థ కూడా ప్రకటన చేయలేదన్నారు. 

శుక్రవారం ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఈ పేలుడుకు పాల్పడినట్టు తెలిపారు. టెర్రరిస్టులు ఐఈడీని మసీదు లోని పుల్​పిట్​కింద అమర్చినట్లు ఆసిఫ్ తెలిపారు. ఈ ప్రావిన్స్ లో తరచు బాంబు పేలుడు ఘటనలు జరుగుతున్నట్టు చెప్పారు. గత నెలలో దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీలో ఆత్మాహుతి దాడి జరిగి జేయూఐ- నాయకుడు మౌలానా హమిదుల్ హక్ హక్కానీతో సహా ఆరుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు.