అమెరికాను వణికిస్తున్న బాంబు సైక్లోన్‌

అమెరికాను వణికిస్తున్న బాంబు సైక్లోన్‌

వాషింగ్టన్ : అమెరికా వాయువ్య తీరాన్ని అత్యంత శక్తిమంతమైన తుపానులలో ఒకటిగా అంచనా వేస్తున్న 'బాంబు సైక్లోన్'  మంగళవారం తాకింది. దీని ప్రభావంతో  కాలిఫోర్నియా, ఒరెగాన్‌‌, లిన్‌‌వుడ్‌‌, సీటెల్‌‌, బెల్లేవ్‌‌, శాక్రమెంటో వ్యాలీ ఏరియాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ ఈదురు గాలుల ధాటికి అనేక విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దాంతో వాషింగ్టన్ స్టేట్‌‌లోని 6 లక్షల ఇండ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్టు విరిగి మీదపడి ఒక మహిళ మృతి చెందింది. ఒరెగాన్‌‌లో 15 వేలు, కాలిఫోర్నియాలో దాదాపు 19 వేల ఇండ్లకు పవర్ సప్లై నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

శుక్రవారం వరకు భారీ వర్షాలు

బాంబు సైక్లోన్ ప్రభావంతో ఒరెగాన్, పోర్ట్ ల్యాండ్  దక్షిణ ప్రాంతం, శాన్ ఫ్రాన్సిస్కో ఉత్తర ప్రాంతం, కాలిఫోర్నియాతోపాటు ఇతర ఏరియాల్లో శుక్రవారం వరకు బారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెదర్ ప్రెడిక్షన్ సెంటర్ వెల్లడించింది. వాతావరణ ప్రతికూల ప్రభావంతో హరికేన్-లు కూడా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అధికారుల ప్రకారం.. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, నార్త్ కోస్ట్ అండ్ శాక్రమెంటో వ్యాలీలో 20 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశం ఉంది. 1,066 మీటర్ల ఎత్తున్న ఉత్తర సియెర్రా నెవాడాలో వచ్చే రెండు రోజులు 28 సెంటీమీటర్లు మంచు కురిసే చాన్స్ ఉంది. పర్వత ప్రాంతాల్లో గంటకు120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. అందువల్ల ప్రజలు మరో రెండు రోజ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.