
మీరు ప్రయాణిస్తున్న ట్రైన్లో బాంబు పెట్టాం.. అంటూ రైళ్వే సిబ్బందిని బెదిరిస్తున్న ఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఎక్స్‌ప్రెస్ విషయంలో అదే జరిగింది. ఢిల్లీ–-జమ్మూ కశ్మీర్ తావి రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు జులై 28 రాత్రి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.
అప్రమత్తమైన అధికారులు రైలును హర్యానాలోని సోనిపట్ స్టేషన్‌లో ఆపేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, అగ్నిమాపక దళం అంబులెన్స్‌తో పాటు స్టేషన్‌కు చేరుకున్నారు.
ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారి తెలిపిన వివరాల ప్రకారం... బాంబు బెదిరింపుతో శుక్రవారం రాత్రి 9:34 గంటలకు సోనిపట్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాంబు నిర్వీర్య స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే బాంబు బెదిరింపు కాల్ఫేక్ అని తేలింది. తనిఖీ అనంతరం 1:48 గంటలకు రైలు తిరిగి బయల్దేరింది.
భయాందోళనకు గురైన ప్రయాణికులు
బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఆలస్యంగా నడవడంతో ఇబ్బందికి గురయ్యారు. అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వకుండానే సోనిపట్ స్టేషన్‌లో ట్రైన్‌ని రెండు గంటల పాటు నిలిపివేశారని పలువురు ప్రయాణికులు ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.