వరంగల్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌కు బాంబు బెదిరింపు

వరంగల్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌కు బాంబు బెదిరింపు
  • హనుమకొండ, వరంగల్‌‌‌‌ జడ్జీలకు మెయిల్‌‌‌‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • రెండు గంటల పాటు తనిఖీ.. ఫేక్‌‌‌‌ మెయిల్‌‌‌‌ అని నిర్ధారణ

హనుమకొండ, వెలుగు : వరంగల్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌లో బాంబ్‌‌‌‌ పెట్టామని వచ్చి మెయిల్‌‌‌‌ శుక్రవారం కలకలం రేపింది. ‘కన్నదాసన్‌‌‌‌_కరైకుడి@అవుట్‌‌‌‌లుక్‌‌‌‌.కామ్‌‌‌‌’ అనే మెయిల్‌‌‌‌ నుంచి ఉదయం 7.06 గంటలకు హనుమకొండ, వరంగల్‌‌‌‌ జడ్జిలకు మెయిల్‌‌‌‌ రాగా వారు 11 గంటల తర్వాత గమనించారు. చెన్నైలో సవుక్కు శంకర్‌‌‌‌ అనే జర్నలిస్ట్‌‌‌‌పై అక్కడి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, నివేదా పేతురాజ్, ఉదయ్‌‌‌‌ నిధి స్టాలిన్‌‌‌‌ వ్యవహారంలో లీక్‌‌‌‌లకు గెలీలియో రిమోట్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ సిస్టం దుర్వినియోగమే కారణమని, దానికి నిరసనగానే కోర్టు ఆవరణలో ఐఈడీ బాంబులు అమర్చామని, అవి మధ్యాహ్నం 2 గంటలకు యాక్టివేట్‌‌‌‌ అవుతాయని మెయిల్‌‌‌‌లో పేర్కొన్నారు.

 దీంతో అప్రమత్తమైన జిల్లా కోర్టు జడ్జీలు వెంటనే వరంగల్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు డాగ్‌‌‌‌, బాంబ్‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌ డిస్ట్రిక్ట్‌‌‌‌ కోర్ట్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌కు చేరుకొని తనిఖీలు ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు తనిఖీ చేసినా బాంబులు కనిపించలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.