పేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు

పేల్చేస్తాం.. ఉత్తరాది రాష్ట్రాలకు పాక్ ఉగ్రవాద సంస్థ పేరుతో లేఖలు

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని పలు రైల్వే స్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని హెచ్చరిస్తూ లేఖలు కలకలం రేపాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ పేరుతో ఈ లేఖలు రావడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యమైన ప్రదేశాల చుట్టూ భద్రతను పెంచాయి.

ఈ విషయంపై నార్త్ వెస్టర్న్ రైల్వే CPRO కెప్టెన్ శశి కిరణ్ మాట్లాడుతూ.. బుధవారం(అక్టోబర్ 02) హనుమాన్‌గఢ్ రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలిపారు. హుటాహుటీన రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదని పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు తెలిపారు.

జైషే మహ్మద్ పేరుతో లేఖలు

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ పేరుతో లేఖలు వచ్చినట్లు హనుమాన్‌గఢ్ అదనపు ఎస్పీ ప్యారే లాల్ మీనా తెలిపారు. ఆ లేఖలో గంగానగర్‌లోని రైల్వే స్టేషన్, ప్రముఖ స్థలాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 30న జోధ్‌పూర్, బికనీర్, కోట, బుండీ, ఉదయ్‌పూర్, జైపూర్‌లను బాంబులతో పేల్చివేస్తామని లేఖలో ఉన్నట్లు చెప్పారు. అలాగే, నవంబర్ 2న రాజస్థాన్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని మతపరమైన ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుపుతామని హెచ్చరించినట్లు తెలిపారు.