ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఓ ఆగంతకుడు కాల్ చేయటంతో హై టెన్షన్ నెలకొంది. దీంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. అణువణువూ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ జల్లెడ పట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంతో పాటుగా మంత్రి సీతక్క ఇంట్లో ప్రతి గదిని తనిఖీ చేశారు. అంతేకాకుండా గార్డెన్ ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఆలయం అన్ని పరిసరాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు.
ఎక్కడా ఏమీ కనిపించకుండా పోవడంతో ప్రజా భవన్ నుంచి వెళ్లిపోయారు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్. ఈ క్రమంలో బాంబ్ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు శోధిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వేట కొనసాగిస్తున్నారు. ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.