తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం

తిరుపతి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం

తిరుపతి: రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. రెండ్రోజుల క్రితం ఈమెయిల్ ద్వారా బెదిరింపులొచ్చాయి. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి విమానాశ్రయ సీఐఎస్ఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ విభాగం ఎస్సై నాగరాజు ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్టం చేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. అక్టోబర్ 12 వరకు ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పురటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, జిల్లాయంత్రాంగం సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

బ్రహ్మోత్సవాల ముఖ్యాంశాలు
* ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు
* గరుడ వాహనసేవ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం
*  భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు
* వాహనసేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో గ్యాలరీలు, పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు
* అక్టోబర్‌ 4 నుండి 12వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు
* అక్టోబరు 8న గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకల రద్దు
* శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవల ప్రత్యక్ష ప్రసారం
* శ్రీవారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది
* తిరుమలలో గదుల లభ్యత తక్కువగా ఉన్నందున, గదులు లభించని భక్తులు తిరుపతిలో బస చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ అధికారుల సూచన