గణేశ్ ఉత్సవాలకు వర్తిస్తే.. మిలాద్ ఉన్ నబీకి కూడా వర్తిస్తుంది

గణేశ్ ఉత్సవాలకు వర్తిస్తే.. మిలాద్ ఉన్ నబీకి కూడా వర్తిస్తుంది
  • లౌడ్ స్పీకర్ల వాడకంపై బాంబే హైకోర్టు ఉత్తర్వులు

ముంబై: గణేశ్ ఉత్సవాల్లో లౌడ్ స్పీకర్ల వాడకం హానికరమైతే మిలాద్ ఉన్ నబీకి కూడా అదే వర్తిస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. మిలాద్- ఉన్ -నబీ ఊరేగింపు సమయాల్లో డీజేలు, డ్యాన్స్ షోలు, లేజర్ లైట్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. బుధవారం దీనిని చీఫ్​జస్టిస్ డీకే. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపున ఒవైస్ పెచ్కర్ వాదనలు వినిపించారు. నిర్ణీత స్థాయికి మించి హై డెసిబెల్ సౌండ్ సిస్టమ్స్ కు అనుమతి ఇవ్వకుండా నగర పాలక సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్, లేజర్ లైట్లు ఉపయోగించాలని ఖురాన్ సూచించలేదన్నారు.

పండుగల సమయాల్లో హై డెసిబెల్ సౌండ్ సిస్టమ్ లు, లౌడ్ స్పీకర్ల వాడకాన్ని నిషేధిస్తూ గణేశ్ పండుగకు ముందు బెంచ్ ఉత్వర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు మిలాద్ ఉన్ నబీకి కూడా వర్తించేలా ఆదేశాలివ్వాలని పెచ్కర్ కోర్టును కోరారు. దీనికి బెంచ్ స్పందిస్తూ.. పబ్లిక్ ఫెస్టివల్స్ అని ఆర్డర్​లో పేర్కొన్నందున దానిని జోడించాల్సిన అవసరంలేదని తెలిపింది. గణేశ్ పండుగ సమయంలో లౌడ్ స్పీకర్ల వాడకం హానికరమైతే మిలాద్ ఉన్ నబీకి కూడా అదే వర్తిస్తుందని చెప్పింది.