
Layoffs in 40s: ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలన చూసిన వినిపిస్తున్న మాట ఒక్కటే లేఆఫ్స్. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల నుంచి దేశీయంగా ఉన్న సంస్థల వరకు ప్రతి చోటా ఉద్యోగాల కోతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బాంబే షేవింగ్ కంపెనీ సీఈవో శంతను దేష్ పాండే కీలక విషయాలను బయటపెడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల కోతల్లో ఫాలో అవుతున్న కొత్త ట్రెండ్ ప్రస్తుతం ఇండియాకు కూడా పాకిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 40ల వయస్సులో ఉన్న ఉద్యోగులను కంపెనీలో లేఆఫ్ చేస్తున్నాయని దేష్ పాండే వెల్లడించారు. ఈ వయస్సు వారు ఎక్కువ జీతాలను పొందటంతో పాటు సీనియారిటీ కలిగి ఉన్నందున ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కంపెనీలు ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకోవాలని బడ్జెట్లను మరింత కఠినంగా మార్చుతున్న వేళ 40లలో ఉన్న ఉద్యోగులు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారని సీఈవో వెల్లడించారు.
ఈ వయస్సులో ఉన్న ఉద్యోగులు ఎక్కువగా తమ పిల్లల కాలేజీ ఫీజులు, వయో భారంలో ఉన్న తల్లిదండ్రుల ఖర్చులు, ఈఎంఐలు, తక్కువ సేవింగ్స్ వంటి ఆర్థిక సమస్యల సుడిగుండంలో ఉంటున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ వయస్సును గోల్డెన్ శాలరీ ఫేజ్ అని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవటం ఆర్థికంగా భారాన్ని పెంచటంతో పాటు ఆందోళనకు గురిచేస్తుందని ఆయన వెల్లడించారు.
ALSO READ : layoffs: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేఆఫ్స్.. 25 శాతం ఉద్యోగులు ఇక ఇళ్లకే..!!
అందుకే ప్రస్తుతం ఈ వయస్సులోని ఉద్యోగులు తమ స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకోవటం, ఏఐ వంటి నూతన సాంకేతికతలను నేర్చుకోవటం, వ్యాపారం చేయాలనే ఆలోచనలను పెంపొందించుకోవటం చాలా ముఖ్యంగా సీఈవో సూచించారు. ఇందుకోసం అనేక ఆన్ లైన్ కోర్సులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. చాలా మంది కార్పొరేట్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీలకు ఈ వయస్సు ఉద్యోగులు అధిక వేతనాల కోసం వెళుతూ తర్వాత లేఆఫ్స్ ప్రమాదంలో పడుతున్నారని ఒక యూజర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరికొందరు ఆ వయస్సులో కొత్త స్కిల్స్ నేర్చుకోవటం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.