- పీసీసీ చీఫ్‌గా నియామకంతో పార్టీలో జోష్
- కాంగ్రెస్ అధికారంలోకిరావడంతో మారిన సమీకరణలు
- జిల్లాలో కొనసాగుతున్న పార్టీ హవా
- డీఎస్ తరువాత మహేష్‌కు కీలక పదవి
- ఇద్దరూ బీసీ నేతలే కావడం విశేషం
నిజామాబాద్, వెలుగు: ఇందూర్ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ టీపీసీసీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. స్టూడెంట్లీడర్ గా పాలిటిక్స్‌లో చేరి అంచలంచెలుగా ఎదిగి, ఇప్పుడు పీసీసీ పీఠం దక్కించుకున్నారు. పార్టీలో మహేశ్ సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తించిన కాంగ్రెస్ పెద్దలు ఆయనకు రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. పదేండ్ల విరామం తరువాత గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సమీకరణలు మారి జిల్లాలో పార్టీ హవా నడుస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన పోస్టు జిల్లా ఖాతాలో చేరడంతో క్యాడర్ మరింత జోష్‌లో ఉంది.
నో బ్యాక్ గ్రౌండ్
భీంగల్ మండలం రహాత్నగర్విలేజ్కు చెందిన మహేశ్‌గౌడ్ ఫ్యామిలీకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. తండ్రి గంగాధర్‌గౌడ్‌కు మంచి రైతుగా పేరుంది. నక్సలైట్ల (మావోయిస్టుల) సమస్యతో ఆయన 1970వ దశకంలో తన కుటుంబాన్ని జిల్లా కేంద్రంలోని గోల్హనుమాన్ ఏరియాకు మార్చారు. అక్కా, తమ్ముడు, చెల్లె ఉన్న మహేష్ చదువు డిగ్రీ వరకు ఇందూర్ గిరిరాజ్కాలేజీలో ముగిసింది.
మహారాష్ట్రలో ఎల్ఎల్బీ చేశారు. తండ్రి గంగాధర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి గట్టి సపోర్టర్‌గా ఉండేవారు. మహేష్శ్గౌడ్లో కూడా ఎన్ఎస్యూఐ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. డిగ్రీ కాలేజీలో స్టూడెంట్యూనియన్కు వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన మహేశ్గౌడ్లోని లీడర్షిప్ క్వాలిటీస్ గుర్తించిన కాంగ్రెస్ ఆయన్ను బాగా ఎంకరేజ్ చేసింది.
జిల్లా ఎన్ఎస్యూఐ (1986-–90) ప్రెసిడెంట్ గా, తర్వాత ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా (1990-–98 )పనిచేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ సెక్రటరీ (1998-–2000)గా పనిచేస్తున్న టైంలో హైకమాండ్ ఆయన్ను ఏపీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించింది. 2021 నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.
ఆటుపోట్లకు ఎదురొడ్డి
మహేష్‌గౌడ్ జిల్లా కాంగ్రెస్‌లో ఉద్దండ నాయకులను తట్టుకొని పాలిటిక్స్‌లో నిలదొక్కుకున్నారు. స్టూడెంట్ లీడర్‌గా ఎన్ఎస్యూఐలో ఉంటూ డిచ్పల్లి సెగ్మెంట్ నుంచి 1994లో అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత మళ్లీ పోటీ అవకాశం దక్కకపోగా పలు ఆటుపోట్లు తట్టుకొని నిలబడ్డారు. 2023లో అర్బన్ టికెట్ ఆశించారు. 2003లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్లినా అక్కడ ఇమడలేక ఏడాదిన్నరకే ఘర్‌వాపస్ అయ్యారు. 2013-14లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన మహేశ్‌గౌడ్ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై మొదటిసారి చట్టసభలోకి ఎంట్రీ ఇచ్చారు.
డీఎస్ శిష్యుడే
జిల్లా రాజకీయాలలో చెరగని ముద్రవేసిన డి.శ్రీనివాస్ (డీఎస్) ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొందిన మహేశ్‌గౌడ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నియమితులై గురువుకు తగ్గ శిష్యుడయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్‌గా డీఎస్‌కు రెండుసార్లు అధిష్టానం అవకాశం ఇచ్చింది. 2004, 2009 ఎలక్షన్స్‌లో రెండుసార్లు ఆయన పార్టీని అధికారంలోకి తెచ్చారు.
బీసీ సామాజిక వర్గానికి డీఎస్ తరువాత జిల్లాకు చెందిన మరో బీసీ లీడరే రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. మూడేండ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉండే మహేష్‌గౌడ్‌కు ఏఐసీసీ ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు ఆయన పదవి పొందడానికి దోహదపడ్డాయి. రూలింగ్ పార్టీలో ప్రెసిడెంట్ హోదాను సీఎం తరువాత స్థానంగా క్యాడర్ భావిస్తుంది.