రూ.3కోట్లకు వ్యాపారి ఐపీ..యాచకుడికి నోటీసులు

రూ.3కోట్లకు వ్యాపారి ఐపీ..యాచకుడికి నోటీసులు

ఖమ్మం జిల్లా బోనకల్లులో ఓ యాచకుడికి ఐపీ నోటీస్ రావడం చర్చనీయాంశమైంది. భిక్షమెత్తి పైసా పైసా పోగేసి దాచుకున్న ఆ యాచకుడిని ఐపీ నోటీసులు కలవర పెట్టాయి. అవసరాలకు పనికొస్తాయని దాచుకుంటే ఏకంగా ఐపీ నోటీసులు రావడంతో పరేషాన్ లో పడ్డాడు. దాచుకున్న డబ్బుతో కూతురికి ఉన్నంతలో ఫంక్షన్ చేయాలనుకున్న అతనికి నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే.. 

బోనకల్కు చెందిన హోటల్ వ్యాపారి నర్సింగరావు.. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులు ఎక్కువై రూ.2కోట్ల 75 లక్షలకు ఐపీ పెట్టాడు. నర్సింగరావుకు అప్పు ఇచ్చినవారందరికీ నోటీసులు వెళ్లాయి. అయితే అప్పు ఇచ్చిన వాళ్లలో గొల్లాల అశోక్ అనే భిక్షాటన చేసుకునే యాచకుడు కూడా ఉన్నాడు. 

Also Read : పదేళ్ల కేసీఆర్​ పాలనలో  విద్యుత్​ చార్జీల పెంపు ఇలా

గొల్లాల అశోక్ అనే  ఈ యాచకుడు స్థానికంగా ఉండే సాయిబాబా టెంపుల్ వద్ద భిక్షాటన చేస్తుంటాడు. పైసా పైసా పోగేసి రూ.50 వేలు కూడబెట్టాడు. అదే ప్రాంతంలో ఉండే హోటల్ వ్యాపారి నర్సింగరావుకు.. అశోక్ కూడబెట్టిన రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. ప్రామిసరీ నోటు కూడా రాసుకున్నారు. నర్సింగరావు ఐపీ పెట్టడంతో గొల్లాల అశోక్ కు కూడా నోటీసులు వెళ్లాయి. దీంతో బిడ్డల కోసం దాచి ఉంచుకున్న డబ్బులు ఇక రావేమోనని అశోక్ ఆందోళన చెందుతున్నాడు. ఐపీ నోటీస్ రావడంతో ఇక తనకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదని తన కుమార్తె భవిష్యత్ ఏంటని యాచకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.