బోనమెత్తిన హైదరాబాద్ .. వైభవంగా బోనాల జాతర

బోనమెత్తిన  హైదరాబాద్ .. వైభవంగా బోనాల జాతర

 

  • ఉదయం నుంచే ఆలయాలకు తరలివచ్చిన భక్తులు
  • ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సిటీ 
  • నేడు రంగం, ఘటాలు, అంబారి ఊరేగింపు

హైదరాబాద్​, వెలుగు:  పట్నం బోనమెత్తింది. వేపాకుల తోరణాలు. పోతరాజుల విన్యాసాలు. శివసత్తుల పూనకాలు. అమ్మవారి పాటల నడుమ సిటీలో గల్లీ గల్లీలో పండుగ సందడి నెలకొంది. ఆదివారం బోనాల జాతర వైభవంగా సాగింది. తెల్లవారు జాము నుంచే  భక్తులు ఆలయాల కు తరలివచ్చి పూజలు చేశారు.  మొక్కులు చెల్లిస్తూ.. నైవేధ్యంగా బోనాలు సమర్పించారు.​ ఓల్డ్​సిటీలోని ప్రధాన ఆలయాలైన లాల్​దర్వాజ, అక్కన్న మాదన్న, భాగ్యలక్ష్మి, దర్బార్ మైసమ్మ తదితర ఆలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.  ఓల్డ్ సిటీలోని 28 ఆలయాలతో పాటు సిటీలోని అమ్మవారి ఆలయాల్లో బోనాల జాతర కనుల పండువగా  జరిగింది.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్​ఎంసీ, వైద్యశాఖ, వాటర్ బోర్డ్​, విద్యుత్​ శాఖల  అధికారులు తగు ఏర్పా ట్లు చేశారు. లాల్​ దర్వాజా టెంపుల్​ లో భక్తులకు5  క్యూలైన్లు,  బోనాలతో  వచ్చే మహిళలకు ప్రత్యేకంగా రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 2,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత కొనసాగించారు.  సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాస్​ రెడ్డి పర్యవేక్షణలో డీసీపీ స్నేహ మెహ్రా ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. బోనాల సందర్భంగా ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. నేడు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.  రంగం ద్వారా భవిష్యవాణి, ఘటాలు, ఏనుగు అంబారి ఊరేగింపు నిర్వహిస్తారు.  నెలరోజుల పాటు జరిగిన ఆషాఢం మాస బోనాల జాతరలో చివరిది లాల్ దర్వాజా బోనాల ఉత్సవం. ఆగస్టు 4న గోల్కొండ జగదాంబిక అమ్మవారికి చివరి బోనం సమర్పణతో బోనాలు ఉత్సవాలు ముగుస్తాయి.