భాగ్యనగరంలో మహిళల కోలాహలం.. బోనాల మొదలైంది. ఆషాఢమాసం నెల రోజులు భాగ్యనగరం..పల్లె వాతావరణాన్ని తలపిస్తుంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం ఈ ఏడాది జులై 7న వచ్చింది. మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురూ అవుతుంది. ఎక్కడ చూసిన వేప మండలు..వేపాకు తోరణాలతో ప్రతి గల్లీలో బోనాల జాతర జరుగుతుంది. ఈ నెల రోజులు ( జులై7నుంచి) హైదరాబాద్ లోని అమ్మవారి గుళ్లు ముస్తాబవుతాయి. అమ్మవారి పాటలు..భజనలతో నగర ప్రజలు పులకించి పోతారు.గల్లీ నుంచి గోల్కొండ దాక, పాత బస్తీల నుంచి లష్కర్ దాక అమ్మోరి గుళ్లల్లో భక్తులు పోటెత్తుతారు.. బోనాల పండుగొచ్చింది. బోనమెత్తుకొని మమ్మల్ని సల్లంగ చూడు తల్లీ అని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురూ అవుతుంది. ఇక్కడి నుంచే బోనాల సంబురాలు షురూ అవుతయ్. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి.. ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరపున ఆధ్వర్యంలో బోనాల సంబరాలు జులై 7న ప్రారంభం కానున్నాయి. ముందుగా జగదాంబి అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
గోల్కొండలో ఫస్ట్
గోల్కొండ బోనాలకు వందల ఏండ్ల చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుంచి కోటలో బోనాల జాతర జరుగుతున్నదని చరిత్రకారులు చెప్తున్నన్నారు. కాకతీయుల నుంచి రాజ్యం కుతుబ్షాహి చేతుల్లోకి వచ్చినంక కూడా కోటలో ఈ జాతర కొనసాగింది. ఏటా ఆషాఢ మాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారంలో ఇక్కడ బోవాలెత్తుతరు. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబిక (ఎల్లమ్మ) తల్లికి ఇష్టమైన బోసం పటేల్ ఇంటి నుంచి వస్తది. పటేలోళ్లదే ఫస్ట్ బోనం. వాళ్లు బోనం పెట్టుడుతోనే జాతర షురూ అయితేది. వాళ్లు ఫస్ట్ బోనం పెట్టడం ఆనవాయితీ. అప్పట్ల నిజాం నవాబులు పటేల్ లక్ష్మమ్మతోటి బోనం చేయించి సర్కారు బోనంగా అమ్మవారికి సమర్పించే వారు.దీనికి అయ్యే ఖర్చు మొత్తం నిజాం సర్కారే భరించేది. బోనం చేసినందుకు పటేలోళ్లకు నవాబులు కానుకలు ఇచ్చేవారు. అదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు సర్కార్ తరపున పటేలోళ్లఫ్యామిలీ నాలుగోతరం బోనం చేస్తున్నది. జాతరకు రెండు రోజుల ముందే పటేలేళ్ల ఇంట్ల పూజలు మొదలవుతాయి. అప్పట్లో బంజరా దర్వాజ దగ్గర్నుంచి డప్పు, డోలుతో సబ్బండ కులాల వృత్తుల వాళ్లతో కలిసి పటేల్ వంశస్తుల ఇంటి నుంచి ఐదు గంటలకు బోనం కోటకు చేరేది. ఇప్పుడు రోడ్డు విస్తరణలో వాళ్ల ఇల్లు పోవడంతో.. బంజర దర్వాజ దగ్గరున్న నాగమ్మ గుడిలో బోనం వండి కోటకు తీసుకు వెళ్తున్నారు. దీన్నే 'పటేలమ్మ బోనం', 'సర్కార్ బోసం' అంటారు.ఆదివారం నాడు (జులై 7) లంగర్ హౌజ్ నుంచి మొదలయ్యే తొట్టెల ఊరేగింపు, పూజారి ఇంటి నుంచి వచ్చే అమ్మవారి ఉత్సవవిగ్రహాలు (ఘటం), పటేలమ్మ ఇంటి నుంచి వచ్చే సర్కార్ బోనం... ఈ మూడూ డప్పల దరువులు, పోతురాజుల విన్యాసాలతో ఒకేసారి గోల్కొండ కోటకు చేరుకుంటాయి. ఈ రోజే( జులై7) మొదటి బోనం ఇస్తారు. ఇప్పటి నుంచి ఆషాడ మాసంలో ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ కోటలో బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ తొలి బోనం తర్వాత, పదిహేను రోజులకు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోవాలు సమర్పిస్తారు. ఇది రెండు రోజుల జాతర. వారం రోజుల తర్వాత హైదరాబాద్లో బోనాల పండుగ జరుపుకుంటారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాలతో పాటు పాతబస్తీలోని అన్ని ఆలయాల్లో బోనాల జాతర జరుపుకుంటారు.