బోనాలకు వేళాయె .. ఉత్సవాలు జరిగే రోజుల్లో కోటలోకి ఫ్రీ ఎంట్రీ

బోనాలకు వేళాయె .. ఉత్సవాలు జరిగే రోజుల్లో కోటలోకి ఫ్రీ ఎంట్రీ
  • గోల్కొండలోని జగదాంబికకు తొలిబోనం
  • తర్వాత సిటీ వ్యాప్తంగా ఉత్సవాలు షురూ 
  • కోటలో భారీ ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

మెహిదీపట్నం, వెలుగు: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు గ్రేటర్​సిటీ ముస్తాబైంది. గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి(ఎల్లమ్మ తల్లి) అమ్మవారికి ఆదివారం తొలి బోనం సమర్పించగానే ఉత్సవాలు షురూ కానున్నాయి. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి భారీ తొట్టెలు, రథం బయలుదేరి కోటకు వెళ్తాయి. డప్పు వాయిద్యాలు, పోతరాజులు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపు ధూంధాంగా సాగుతుంది. ఉత్సవాలు జరిగినన్ని రోజులు కోటలోకి ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

జీహెచ్ఎంసీ, పోలీస్, హెల్త్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ అధికారులు విధుల్లో పాల్గొంటారు. ఎక్కడా చెత్త పేరుకు పోకుండా జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. గోల్కొండ కోటలో మొత్తం 20 మొబైల్ టాయిలెట్లు, ఐదు హెల్త్​ క్యాంపులు, మూడు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచినట్లు జోనల్​ కమిషనర్​ అనురాగ్​జయంతి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం బ్యాటరీ వెహికల్స్​ను ఏర్పాటు చేశామన్నారు. మొదటి ఐదు పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

నెల రోజులు ట్రాఫిక్ డైవెర్షన్స్

గోల్కొండ కోట పరిసరాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్​అమలులో ఉండనున్నాయి. కోటకు వచ్చే భక్తులు రాందేవ్ గూడా మక్కాయి దర్వాజా నుంచి రావాలని, రాందేవ్ గూడా వద్దే పార్కింగ్ చేయాలని అడిషనల్​కమిషనర్(ట్రాఫిక్) తెలిపారు. లంగర్ హౌస్ నుంచి గోల్కొండ కోటకు వచ్చే భక్తులు ఫతే దర్వాజ వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు.

షేక్ పేట​నాలా, 7 టూంబ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను బంజారా దర్వాజా వద్ద నిలపాలని సూచించారు. మొత్తం 650 మంది పోలీసులు కోటలో బందోబస్త్​నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ట్రాఫిక్​ డీసీపీలు, ఏడు మంది ఏసీపీలు, 25 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, కానిస్టేబుల్స్, హోంగార్డులతోపాటు అశ్వక దళం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది డ్యూటీ చేయనున్నారు. 

ప్రత్యేక తాగునీటి సదుపాయం

గోల్కొండ కోట ఎంట్రీ నుంచి పైన ఉన్న ఆలయం వరకు తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేసినట్లు వాటర్​బోర్డు అధికారులు తెలిపారు. అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్ లైన్లను అమర్చారు. వంట చేసే ప్రాంతంలో ప్రత్యేక స్టాండ్లు సిద్ధం చేశారు. వీటితోపాటు వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు అందుబాటులో ఉంచారు. రామదాసు బందిఖానా, చోటాబజార్, జీహెచ్ఎంసీ వార్డు ఆఫీస్, లంగర్ హౌజ్ లోనూ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు.