సింహవాహిని ఆలయానికి శిఖర హారతి..బోనాల ఉత్సవాలకు ముస్తాబైన పాతబస్తీ

సింహవాహిని ఆలయానికి శిఖర హారతి..బోనాల ఉత్సవాలకు ముస్తాబైన పాతబస్తీ
  •      రేపు, ఎల్లుండి ట్రాఫిక్​ ఆంక్షలు అమలు
  •     స్పెషల్ బస్సులు నడుపుతున్న  గ్రేటర్ ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు : ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా లాల్​దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయ శిఖరానికి శుక్రవారం రాత్రి ప్రత్యేక హారతి ఇచ్చారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి. బోనాల పండుగ సందర్భంగా లక్ష మందికి పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్​దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహించనున్నారు. 4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం ఉంటుంది.

తర్వాత బోనాలతో వచ్చే భక్తులను అనుమతిస్తారు. సోమవారం ఉదయం అష్టదళ పాద పద్మారాధన, 12 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 2 గంటలకు పోతరాజుల స్వాగతం,  సాయంత్రం 4 గంటలకు రంగం కార్యక్రమం, 5 గంటలకు శ్రీభవాని రథయాత్ర జరగనున్నాయి. ఆగస్టు 4న అమ్మవారికి మారు బోనం సమర్పించనున్నారు. సింహవాహిని ఆలయంతోపాటు పాతబస్తీలోని ప్రముఖ ఆలయాలన్నీ ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. నిర్వాహకులు ముందస్తుగా టెంపుల్స్ వద్ద ప్రత్యేక లైటింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సిటీలోని 9 ప్రధాన ఆలయాల్లోని అమ్మవార్లకు రాష్ట్ర మంత్రులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

2,500 మంది పోలీసులతో భద్రత

బోనాల సందర్భంగా పాతబస్తీలోని ఆలయాల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. 2,500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఫలక్ నుమా, చార్మినార్​, మీర్ చౌక్, బహదూర్​పురా పోలీస్ స్టేషన్ల పరిధిలో 28, 29న ట్రాఫిక్ ఆంక్షలు, వెహికల్స్​డైవర్షన్స్​అమలులో ఉంటాయి. అలియాబాద్ నుంచి లాల్​దర్వాజా ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను పోస్ట్ ఆఫీసు ఎదురుగా ఉన్న దేవి ప్లైవుడ్​వద్ద, శాలిబండ సింగిల్​లైన్, నాగుల చింతలోని అల్కా థియేటర్ ఓపెన్​ఏరియాలో పార్క చేయాలి. హరిబౌలి, గౌలిపురా నుంచి వచ్చే భక్తులు సుధా థియేటర్​ఎదురుగా లైన్​లోని ఆర్య వైశ్య మందిర్

వీడీపీ స్కూల్​గ్రౌండ్ లో నిలపాలి.  మూసబౌలి, మీర్​చౌక్ నుంచి వచ్చే భక్తులు చార్మినార్ బస్​ టెర్మినల్ లో పార్క్​ చేయాలి. 29న అంబారీ ఊరేగింపునకు వచ్చే భక్తులు తమ వెహికల్స్ ను ఢిల్లీ గేట్​సింగిల్​లైన్ లో పార్క్ చేయాలి. మదీనా ఎక్స్​ రోడ్ నుంచి ఇంజన్ బౌలి వరకు గుల్జార్​హౌజ్, చార్మినార్, చార్మినార్ బస్​టెర్మినల్, హిమ్మత్ పురా, అలియాబాద్​రోడ్లు పూర్తిగా క్లోజ్​చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆయా రూట్లలోకి ఎలాంటి వెహికల్స్ ను అనుమతించరు.

ఆర్టీసీ 100 స్పెషల్ బస్సులు

లాల్​దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాకు సిటీ నలుమూలల నుంచి 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, జేబీఎస్, జీడిమెట్ల, ఈసీఐఎల్​క్రాస్​రోడ్స్, దిల్​సుఖ్ నగర్, హయత్​ నగర్, మెహిదీపట్నం, కూకట్​పల్లి, రిసాల బజార్, చర్లపల్లి, రాజేంద్రనగర్, రాంనగర్, ఉప్పల్, బోరబండ, మిథాని, కేసీహెచ్​బీ కాలనీ, ఓల్డ్​ బోయిన్​ పల్లి, మల్కాజ్​గిరి, బాలజీనగర్ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్​హైదరాబాద్​ జోన్ ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్​వెంకటేశ్వర్లు తెలిపారు.ఓల్డ్ సీబీఎస్, దారుల్​షిపా క్రాస్​రోడ్స్, ఛత్రినాక, ఇంజన్ బౌలి వరకు బస్సులు నడుస్తాయని, చార్మినార్, ఫలక్​ నుమా, నయాపూల్ వైపు వెళ్లవని స్పష్టం చేశారు.