బోనం.. ఒక బంధం

బోనాలను ఒక పండగగా చూడటానికి వీల్లేదు. ఈ వేడుక తెలంగాణ కల్చర్ లో ఒక భాగం. వందల సంవత్సరాలుగా తెలంగాణ కుటుంబాలతో పెనవేసుకుపోయిన బంధం. ముఖ్యంగా బీసీ కులాలవారి ఇంటి పండగగా బోనాల జాతర పేరు తెచ్చుకుంది. స్త్రీ శక్తికి ప్రతిరూపంగా కూడా బోనాన్ని చూడవలసి ఉంటుంది. తెలంగాణలోని అనేక అమ్మవారి గుళ్లల్లో  మహిళా పూజారులు కనిపించడం కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవలసిందే.

గోల్కొండలో..
ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం ఏది ముందుగా వస్తే ఆ రోజున గోల్కొండ ఖిల్లాలో ఉన్న జగదాంబికా అమ్మవారికి తరతరాలుగా కుమ్మరి వంశస్తులైన ఆడవారు తాము తయారు చేసిన మట్టి కుండలో బోనాన్ని వండుతారు. మగవారు వెదురుతో తయారు చేసిన తొట్టెలకు రంగురంగుల కాగితాలు అతికిస్తారు.  లంగర్ హౌస్ ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చి బోనాన్ని తీసుకుని గోల్కొండ కోట పై ఉన్న అమ్మవారికి మొట్టమొదట సమర్పిస్తారు. దీంతో తెలంగాణ అంతటా బోనాల జాతర మొదలవుతుంది. తరువాత ఆ కుమ్మరి వంశస్తులు భక్తులకు బొట్టు పెడుతూ అర్చనలు చేస్తూ అక్కడే పూజారులుగా ఉంటారు. బోనం సమర్పించాక వారికి కట్నకానుకలు అందించి ఆశీర్వాదం తీసుకుంటే తమ కుటుంబానికి బర్కత్ అని ప్రజలు నమ్ముతారు. అదే రోజు లోయర్ ట్యాంక్ బండ్ లో గల కట్ట మైసమ్మ తల్లికి రాష్ట్ర  కుమ్మర సంఘం తరఫున 501 బోనాలను ఆడవారు మట్టి కుండలలో  ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పిస్తారు.

శ్రావణమాసం వరకు బోనాల జాతర
ఆషాఢమాసంలో  మొదలయ్యే  ఈ బోనాలు శ్రావణమాసం వరకు కొనసాగుతాయి. పల్లెల్లో ఆయా కులవృత్తుల సంప్రదాయం ప్రకారం ఈ జాతరను నిర్వహిస్తారు. జాతర మొదటి, చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆచారం.

దున్నపోతుకు బదులు కోడి పుంజులు…
పాత రోజుల్లో బోనాల పండగ రోజున దుష్టశక్తులను పారదోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. దున్నపోతులకు బదులు కోడి పుంజులను, మేకపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ…
జాతరలో కొంతమంది మహిళలకు పూనకం వస్తుంది. అలా పూనకం వచ్చిన  ఆడవారు తలపై బోనం మోస్తూ డప్పు  చప్పుళ్లకు అనుగుణంగా అమ్మవారిని స్మరిస్తూ డ్యాన్స్ చేస్తారు. అమ్మవారు రౌద్రరసానికి ప్రతిరూపం. దీంతో ఆమెను శాంతింపచేయడానికి పూనకం వచ్చిన ఆడవారు గుడి వద్దకు రాగానే వారి పాదాలపై భక్తులు నీళ్లను కుమ్మరిస్తారు. శాంతించమని కోరతారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందం తొట్టెలను  సమర్పిస్తారు. అమ్మవారికి సమర్పించిన బోనాల ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. తర్వాత మాంసాహారంతో  విందు భోజనం మొదలవుతుంది. జాతర జరిగే  ప్రాంతాలను వేపాకులతో అలంకరిస్తారు. జానపద పాటలు, పోతురాజుల ఆటలు, పిల్లల కేరింతల మధ్య బోనాల జాతర ఎంతో శోభాయమానంగా జరుగుతుంది.

పోతురాజులకు పూనకం
రంగం పండగ ఉదయం పూట జరుగుతుంది. రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. దీంతో అతడిలోని  రౌద్రాన్ని  తగ్గించడానికి అక్కడ ఉన్న భక్తులు, కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు.

ఈ మేకపోతును అమ్మవారికి పోతురాజు బలి ఇస్తాడు. పోతురాజు మేకపోతను బలి ఇచ్చిన తర్వాత  బోనాల ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరిగే దారంతా పసుపు నీళ్లు, వేపాకులను చల్లుతారు. దీని వల్ల దేవతలు శాంతిస్తారని, అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని  ప్రజలు నమ్ముతారు. అమ్మవారి ఆకారంలో అలంకరించిన కుండను ఘటం అంటారు. పండగ  మొదటి రోజు నుంచి చివరి రోజు నిమజ్జనం వరకు ఈ ఘటాన్ని డప్పుల చప్పుళ్ల మధ్య ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం కార్యక్రమం తర్వాత జరుగుతుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో నెలరోజుల పాటు బోనాల జాతర వైభవంగా జరుగుతుంది.

 

లాల్​ దర్వాజాలో…
హరిబౌలి నుంచి ఏనుగు అంబారీపై, గుర్రాల మధ్య అక్కన్న, మాదన్నల  బొమ్మల నడుమ ఊరేగింపు ప్రారంభమై సాయంత్రానికి న యాపూల్ దగ్గర ఘటాల నిమజ్జనంతో ముగుస్తుంది. అక్కన్న – మాదన్న – మాతా మహంకాళి ఆలయంగా  పేరొందిన హరిబౌలి ఆలయంలో బోనాల రోజున  తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుచీరను కానుకగా సమర్పించే సంప్రదాయం కొనసాగుతున్నది. లాల్ దర్వాజా నుంచి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిల్చుని రంగరంగ వైభవంగా అలంకరించిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషాల్లో ఉన్న కుర్రాళ్లు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య డ్యాన్స్ చేస్తారు. పాత బస్తీలో జరిగే ఘటాల ఊరేగింపు హరిబౌలి అక్కన్న, మాదన్న, లాల్ దర్వాజా, ఉప్పుగూడ, మీరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ షాహీలోని జగదాంబాలయం, శాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్ షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాద్ లోని దర్బారు మైసమ్మ మందిరం చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి  మీదుగా సాగుతుంది.

 

బోనం అంటే….
బోనం అంటే నైవేద్యం. వండిన అన్నంతో పాటు పసుపు, పాలు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి కుండలలో ఉంచి ఆడవారు తమ తలపై పెట్టుకుని  మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య  అమ్మవారి గుడికి వెళ్తారు. ఆడవారు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరెమ్మలతో, పసుపు, కుంకుమ లేక  తెల్ల ముగ్గుతో అలంకరిస్తారు. దానిపై  ఒక దీపం ఉంచుతారు. పోచమ్మ, ఎల్లమ్మ. పెద్దమ్మ. బంగారు మైసమ్మ, మైసమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ. మారెమ్మ  మొదలైన అమ్మవారి ఆలయాలను దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు.

 

బోనం ఎలా మొదలైందంటే
ప్రకృతిని మనం తల్లితో పోల్చుకుని ఆరాధిస్తాం. అందరినీ కాపాడమని వేడుకుంటాం. కానీ అమ్మ ఆగ్రహిస్తే  ప్రకృతి విపత్తులు వస్తాయి. 1869 లో ఇదే జరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్  ప్రాంతాల్లో ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి వచ్చి వేలాది మంది చనిపోయారు. దీంతో అమ్మవారిని శాంతింపచేయడానికి ఏడాది అంతా భోజనం పెట్టే ఆ తల్లికి మనమందరం కలిసి భోజనం పెట్టి తమను కాపాడవలసిందిగా  వేడుకోవాలని  పెద్దలు నిర్ణయించుకున్నారట. కాలక్రమంలో ఈ భోజనమే ‘ బోనం’ గా మారింది.

 

అమ్మవారి సోదరుడు పోతురాజు…
పోతురాజును అమ్మవారి సోదరుడిగా ఇక్కడి ప్రజలు నమ్ముతారు. భక్తులను కాపాడే వీరుడిగా ప్రజలు భావిస్తారు. బోనాన్ని ఎత్తుకువచ్చే ఆడపడుచులను  పోతురాజు ముందుండి నడిపించడం ఒక ఆనవాయితీ. అమ్మవారికి సమర్పించే పలారం బండి ముందు కాలికి గజ్జెలు కట్టుకుని డప్పు చప్పుళ్లకు అనుగుణంగా ఆడతాడు  పోతురాజు.

 

లష్కర్ లో​..

ఆరంభించింది అప్పయ్య

సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఘనమైన చరిత్ర ఉంది. లష్కర్ బోనాలుగా  పిలిచే ఈ వేడుక దాదాపు వందేళ్ల కిందట మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన అప్పయ్య అనే సైనికుడు సికింద్రాబాద్ లో అమ్మవారిని ప్రతిష్టించడంతో  మొదలైందని చరిత్ర చెబుతోంది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కుమ్మరి వెంకయ్య వంశస్తులైన కుమ్మరి వినోద్ కుటుంబీకులు బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించిన ఘటాన్ని తయారు చేసి ఆలయానికి అందించడంతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు మొదలవుతాయి. ఈ ఘటాన్ని 15 రోజుల పాటు నగర వీధుల్లో ఊరేగిస్తారు. మిగిలిన ఆలయాల్లో జరిగే బోనాలు ఒక ఎత్తు అయితే లష్కర్ బోనాలు ఒక ఎత్తు.

ఈ బోనాలు సమైక్యతకు ప్రతీక అంటారు. తెలంగాణ అంతటా ఈ బోనాలు పాపులర్. ఈ బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.  అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ ఆనందంగా ఇందులో పాల్గొంటారు. ఈ జాతరలో అమ్మవారి తొట్టెల ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి వేళల్లో అమ్మవారి ఆలయం దీపాలంకరణతో అందరినీ ఆకట్టుకుంటుంది.

చివరి రోజు రంగం…
లష్కర్ బోనాల చివరి రోజు రంగం కార్యక్రమం జరుగుతుంది. రంగం అంటే భవిష్యవాణిని చెప్పే ఓ అపురూప ఘట్టం. ఈ రంగం కార్యక్రమానికి అవసరమైన పచ్చి కుండను కూడా కుమ్మరి వినోద్ వంశస్తులే చివరిరోజు తెల్లవారు జామున ఆలయ ప్రాంగణానికి తీసుకుని రావడం ఆచారంగా వస్తోంది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆరోగ్య సంక్షేమాల గురించి తెలియచేయడమే ఈ రంగం కార్యక్రమం. తన జీవితాన్ని అమ్మవారికి సమర్పించిన అవివాహిత మహిళ వచ్చి  పచ్చి కుండపై నిలబడి , రంగం  చెబుతుంది. జరిగేది, జరగబోయేది ప్రజలకు వివరిస్తుంది. బోనాలు ప్రారంభమైనప్పటి నుంచి మహిళలకు పూనకాలు వస్తూనే ఉంటాయి. మహిళలు భక్తిపారవశ్యంతో ఊగిపోతూ ఉంటారు. మూడు రోజుల బోనాలతో లష్కర్ జాతర ముగుస్తుంది. గోల్కొండ బోనాల జాతరతో  మొదలైన ఈ బోనాలు తిరిగి గోల్కొండ బోనాలతో ముగుస్తాయి. హైదరాబాద్ లో బోనాల పండగ సందడి  గోల్కొండ కోటలోని  మహంకాళి ఆలయం వద్ద మొదలై, లష్కర్ బోనాలుగా పాపులర్ అయిన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది.

– తాడూరి శ్రీనివాస్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్