ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద ఆదివారం తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఊరేగింపు నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి బోనం తీయడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. శాలివాహన సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకొని, శివసత్తుల శిగాలు, పోతురాజుల  విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి హాజరై  మాట్లాడారు. కుమ్మర్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, సిద్దిపేట, హుజూరాబాద్ లో  ప్రత్యేక స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గం లో కుమ్మర్ల కోసం ఐదు ఎకరాల్లో, రూ.5 కోట్లతో ప్రత్యేక ఇండస్ట్రీని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంబీసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ గర్నెపల్లి రమేశ్, సర్పంచ్ రజిత రమేశ్, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, గర్నెపల్లి కృష్ణమూర్తి, రవీందర్, ధర్పల్లి శ్రీనివాస్  తదితరులు ఉన్నారు.
 

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా వ్యాప్తంగా హమాలీలకు, స్వీపర్లకు చార్జీలు, నగదు ప్రోత్సాహాకాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని అడిషనల్​ కలెక్టర్ రమేశ్​ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  క్వింటాల్​కు హమాలీ చార్జీలు  రూ.22 నుంచి రూ.26, ఏటా రెండు జతల బట్టల కుట్టుకూలికి ఇస్తున్న రూ. 1000 నుంచి రూ.1,300,  స్వీట్ బాక్స్ రూ. 700 నుంచి రూ. 800తో పాటు నగదు పారితోషికం రూ.5,500 నుంచి రూ.6,500  పెంచినట్లు పేర్కొన్నారు.  500 మెట్రిక్ టన్నుల లోపు ఏంఎల్ఎస్  గోడౌన్లలో పనిచేస్తున్న మహిళా స్వీపర్లకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ  వేతనం రూ.4 వేల నుంచి రూ.5 వేలు, 500 నుంచి 1000 లోపు మెట్రిక్ టన్నుల గోడౌన్లలో పనిచేస్తున్న వారికి రూ.4,500 నుంచి రూ. 5,500కు, వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం పై  గోడౌన్లలో పనిచేస్తున్న వారికి రూ.5 వేల నుంచిరూ.6 వేల వరకు  వేతనం పెంచినట్లు తెలిపారు. వీరికి ఏటా రెండు చీరలు, జాకెట్ల కుట్టుకూలి కోసం  ప్రస్తుతం ఇస్తున్న రూ.1,458 నుంచి రూ.1,500 లకు, స్వీట్ బాక్సును రూ.700  నుంచి రూ. 800 వరకు, నగదు పారితోషికం రూ. 5,500 నుండి రూ.6,500  వరకు పెంచిందని పేర్కొన్నారు. ఈ పెంపుదల వల్ల మెదక్​ జిల్లాలోని మెదక్, పాపన్నపేట, పెద్ద శంకరంపేట, రామాయంపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్ లో నిర్వహిస్తున్న ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న 73 మంది హమాలీలు, 14 మంది స్వీపర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

ఆపదలో అండగా ‘సీఎంఆర్​ఎఫ్’

మెదక్​ టౌన్, వెలుగు :నిరుపేదలకు ఆపదలో  సీఎంఆర్ఎఫ్  అండగా నిలుస్తోందని మెదక్  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పాపన్నపేట మండలం మిన్​పూర్​ గ్రామానికి చెందిన బోయిని చంద్రకళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం గ్రామ సర్పంచ్ లింగారెడ్డి ద్వారా తెలుసుకున్న  ఎమ్మెల్యే సీఎంఆర్​ఎఫ్​ కింద నిమ్స్ హాస్పిటల్​కు రూ. 3 లక్షల ఎల్​వోసీ మంజూరు చేయించారు. ఆదివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె బోయిని చంద్రకళకు ఎల్​వోసీని అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మెదక్​ టౌన్​ ప్రెసిడెంట్ గంగాధర్, నాయకులు రాగి అశోక్, అరవింద్ గౌడ్, శ్రీనివాస్  శివరామకృష్ణ 
తదితరులు ఉన్నారు.

 

అర్హులకే డబుల్​ బెడ్ రూమ్ ఇండ్లు

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు : ఎలాంటి పైరవీలకు తావు లేకుండా అర్హులైన వారికే డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు ఇస్తున్నామని హుస్నాబాద్​ఎమ్మెల్యే వొడితెల సతీశ్​ కుమార్​ తెలిపారు. ఆదివారం హుస్నాబాద్ ​క్యాంపు ఆఫీస్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్​ పట్టణంలో డబుల్​బెడ్​ రూమ్ ఇండ్ల కోసం 1400 అప్లికేషన్లు వచ్చాయని, అందులో 489 మంది అర్హులను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం 284 ఇండ్లు అందించేందుకు రెడీగా ఉన్నాయన్నారు. సర్వేలో వచ్చిన పేర్లపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మున్సిపల్, తహసీల్దార్​ఆఫీస్​లో ఫిర్యాదు బాక్స్​లో వేయాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈనెల 28న హుస్నాబాద్​లో బీఆర్ఎస్​ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్​గా అవతరించిన తర్వాత మొదటిసారిగా నిర్వహించే మీటింగ్​కు ఏడు మండలాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు హాజరై సక్సెస్​ చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీ వైస్​ చైర్మన్​ రాజిరెడ్డి, మున్సిపల్​చైర్​ పర్సన్ రజిత, తదితరులు ఉన్నారు.

వాజ్​పేయి​ సేవలు మరవలేనివి..

భారత మాజీ ప్రధాని, దివంగత అటల్​ బీహారీ వాజ్​పేయి దేశానికి చేసిన సేవలు మరవలేనివని పలువురు బీజేపీ నాయకులు అన్నారు. ఆదివారం వాజ్​పేయి జయంతి సందర్భంగా ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలుచోట్ల నాయకులు ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెదక్​లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ శ్రీనివాస్, సిద్దిపేటలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పత్రి శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో బీజేపీ రాష్ట్ర మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి, ఆయా ప్రాంతాల్లో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. బీజేపీ పార్టీ అభివృద్ధికి, దేశ పురోగతికి వాజ్​పేయి నిరంతరం కృషి 
చేశారని కొనియాడారు.    -  వెలుగు, నెట్​వర్క్​


రైతాంగ నిధుల ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి:ఎమ్మెల్యే రఘునందన్ రావు

సంగారెడ్డి టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ 2 నుంచి కేంద్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి కేటాయించిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్​ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా బీజేవైఎం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగూరు జలాలను తాగు, సాగు కోసం జిల్లాకు ఇస్తామన్న పాలకులు ఇవ్వకుండా బీర్ కంపెనీలకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్​ సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకుంటున్నారన్నారు. సాయిల్ హెల్త్ కార్డు, యూరియా సబ్సిడీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఎంఎస్పీ ధరల రెట్టింపు, ట్రాక్టర్ సబ్సిడీ దారి మళ్లించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా హరీశ్​రావు ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలని డిమాండ్​ చేశారు. ఈనెల 27న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు సబ్సిడీ గణాంకాలతో వెల్లడిస్తామన్నారు. అటల్ బీహార్ వాజ్ పేయి జయంతి పురస్కరించుకొని సుపరిపాలన దినోత్సవంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో యువ నాయకులకు మార్గదర్శనం చేస్తుందన్నారు.

మల్లన్న ఆలయంలో భక్తుల సందడి

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకం, నిత్యకల్యాణం, గంగిరేగు చెట్టుకు ముడుపులు, తిరుగుడు కోడె, పట్నాలు, బోనాలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుట్టపైన ఉన్న రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ బాలాజీ, ఏఈవో వైరాగ్యం అంజయ్య, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, ఒగ్గుపూజరులు, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు. - కొమురవెల్లి, వెలుగు