వానాకాలం వచ్చింది.. బోనాలు పండుగ వస్తుంది.. ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ పెద్ద పండుగ బోనాలు.. 2024 జూలై 7వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు భక్తులు. ఈ క్రమంలో రాష్ట్ర పండుగా ఆ రోజున సెలవు ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2024 ప్రకారం జూలై 27న శనివారం రోజున బోనాలు సెలవుదినం ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి దేవిని జరుపుకునే ఆషాడ మాసంతో బోనాలు ప్రారంభమవుతాయి. హైదరాబాదు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో, భక్తులు, ముఖ్యంగా మహిళలు బోనాలు జరుపుకోవడానికి ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.
హైదరాబాద్‌లో నెలరోజుల పాటు బోనాల పండుగను మూడు దశల్లో నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు. పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.
150 సంవత్సరాల క్రితం పెద్ద కలరా వ్యాప్తి రావడంతో ఈ తరువాత ఈ పండుగను మొదటిసారి జరుపుకున్నారని భక్తుల నమ్మకం. మహంకాళి కోపం కారణంగానే ఈ మహమ్మారి వచ్చిందని ప్రజలు నమ్మి ఆమెను శాంతింపజేయడానికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు. ఆ తరువాత ఇదే సాంప్రదాయంగా వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర పండగగా ప్రకటించి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.