వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi)ని పలు సినీ ఇండస్ట్రీలు స్మరించుకుంటున్నాయి. ఇవాళ (ఆగస్టు 13న) శ్రీదేవి 61వ జయంతి సందర్భంగా ఆమె స్పెషల్ స్టోరీలో పలు విశేషాలు గుర్తుచేసుకుందాం.
శ్రీదేవి భారతదేశం గర్వించ దగ్గ గొప్ప నటులలో ఒకరు. 1963లో జన్మించిన ఆమెకు..చిన్నతనం నుంచి సినిమాలంటే ఆసక్తి. ఆ ఇష్టంతోనే 4 ఏళ్ల వయసులోనే 'కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం..ఇంతింతై వటుడింతై అనే స్థాయిలో ముందుకు సాగింది.1976లో 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ ఇలా భాషతో సంబంధంలేకుండా..దాదాపు అందరు స్టార్స్ తో నటించారు శ్రీదేవి. ఈ ప్రయాణంలో ఆమె సాధించని విజయాలు లేవు, ఆమె అందుకొని అవార్డులు లేవు. అలాంటి ఆమె సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం. శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా ముంబైకే పరిమితమైంది. తాజాగా ఆమె భర్త బోనీ కపూర్ ఇంస్టాగ్రామ్ లో 'హ్యాపీ బర్త్ డే మై జాన్' అంటూ పోస్ట్ చేశారు. అలాగే, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ తన తల్లి పుట్టినరోజున హత్తుకునే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో గుర్తు చేసింది. ఆమె తాను, తన సోదరి జాన్వి మరియు శ్రీదేవితో ఉన్న ప్రతిష్టాత్మకమైన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక 2002 లో సినిమాల నుండి విరామం తీసుకున్న ఆమె..2004 లో వచ్చిన మాలినీ అయ్యర్ అనే సీరియల్ తో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో కొన్ని టీవీ ప్రోగ్రాంలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. 2012 లో వచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో మళ్లీ వెండితెరపై ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. ఇక 2017లో వచ్చిన మామ్ మూవీ ఆమె కెరీర్లో చివరిదిగా నిలిచిపోయింది.
ఇక 2018, ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు చనిపోయారు శ్రీదేవి. తన అందం, అద్భుతమైన నటనతో సినీ ప్రేమికుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసారు శ్రీదేవి. కళ్లు తిప్పుకోలేని అందం, అంతకు మించిన నటన శ్రీదేవి సొంతం. అదే ఆమెను ఇండియా తొలి ఫిమేల్ సూపర్ స్టార్ చేసింది.