సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ

 

  • త్వరలో కాంగ్రెస్​లో చేరుతారని ప్రచారం 
  • ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు!

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్​ సీనియర్ ​నేత బొంతు రామ్మోహన్.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం రేవంత్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డి, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్​లో చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో ఆయన సీఎంను కలవడంతో దానికి మరింత బలం చేకూరింది. రామ్మోహన్ కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైపోయిందని.. ఆయన భార్య, చర్లపల్లి కార్పొరేటర్ ​బొంతు శ్రీదేవి కూడా చేరుతారని తెలుస్తున్నది. 

వారం రోజుల్లో రామ్మోహన్ కాంగ్రెస్​లో చేరుతారని.. రెండు మూడ్రోజుల్లో తేదీ నిర్ణయించి, ఏ రోజున చేరేది ప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్ ​లేదా మల్కాజిగిరి ఎంపీ సీటు ఇవ్వాలని రామ్మోహన్ అడిగారని.. అయితే పార్టీలో చేరిన తర్వాత టికెట్​పై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై కొద్దిరోజులుగా రామ్మోహన్ అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమ ద్రోహులుగా పేరున్న పలువురు సీనియర్​ లీడర్లనే  బీఆర్ఎస్​అధిష్టానం వెనకేసుకొస్తున్నదని రామ్మోహన్​ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలుస్తున్నది. పార్టీ జెండా మోసిన వారిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా, మూడ్రోజుల కిందనే మాజీ డిప్యూటీ మేయర్ ​బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు.